1924 అక్టోబర్ 8న మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ తన 21 రోజుల నిరాహార దీక్ష ముగించాడు. ఆ సందర్భంగా ఆయన మౌలానా మహమ్మద్ అలీకి లేఖ రాసాడు. ‘‘నువ్వు నాకు సోదరుడి కంటె ఎక్కువ. మీ సోదరులతో నా అనుబంధం సఫలమైనట్లే, దేశంలోని హిందూ ముస్లిముల మధ్య బంధమూ దృఢోపేతం అవాలి. అది మన రెండు మతాలకు, మన దేశానికీ, మొత్తంగా మానవత్వానికీ చాలా మంచిది’’ అని గాంధీ ఆ లేఖలో రాసాడు. ఐకమత్యం గురించి గాంధీ ఆశించిన ఆదర్శ విధానానికి ముస్లిం సమాజం ఏనాడూ సానుకూలంగా స్పందించలేదన్నది చారిత్రక వాస్తవం. ఖిలాఫత్ ఉద్యమంలో కీలక పాత్రధారి, గాంధీ ఎంతగానో గౌరవించి అభిమానించిన ముస్లిం నేత అయిన మౌలానా మహమ్మద్ అలీ గాంధీ గురించి 1924లోనే తన అభిప్రాయాన్ని ఈవిధంగా వెల్లడించాడు. ‘‘గాంధీ శీలం ఎంత స్వచ్ఛమైనది అయినా, నా మతం కోణం నుంచి చూసినప్పుడు, ఎలాంటి సౌశీల్యమూ లేని నీచుడైన ముస్లిం కంటె కూడా గాంధీ అధముడే.’’ ఆ ప్రకటన గురించి కొన్నాళ్ళ తర్వాత వివరణ అడిగినప్పుడు మహమ్మద్ అలీ తన వైఖరి నుంచి అంగుళం కూడా మారలేదు. ‘‘అవును. నా మతం ప్రకారం, మా విశ్వాసాల ప్రకారం, ఎంత పతనమైన వాడైనా, ఎంత వ్యభిచారి అయినా, అటువంటి ముస్లిం సైతం గాంధీ కంటె ఉన్నతుడే’’ అని కచ్చితంగా ఖరాఖండీగా తేల్చిచెప్పాడు.
అప్పటినుంచి ఒక శతాబ్దం ముందుకు వద్దాం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని బహరాంపూర్ నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని ఒక్కసారి పరిశీలిద్దాం. అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిగా అధీర్ రంజన్ చౌధురి పోటీ చేసాడు. ఆయన ఆ ప్రాంతం నుంచి చాలాకాలం ఎంపీగా ఉన్నాడు. ఆయనకు నియోజకవర్గం అంతటా బలమైన సంబంధాలున్నాయి. ఆయన మీద తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధిగా యూసుఫ్ పఠాన్ పోటీ చేసాడు. యూసుఫ్ పఠాన్ మాజీ క్రికెటర్, గుజరాత్‌కు చెందినవాడు, రాజకీయాలకు కొత్త, బెంగాల్‌కు ఏ మాత్రం సంబంధం లేనివాడు, స్థానిక భాషలో ఒక్క అక్షరమైనా రాదు. ఇంక ఆ నియోజకవర్గంలో ఒక్కరైనా అతనికి తెలీదు. అయినప్పటికీ యూసుఫ్ పఠాన్ 85,022 ఓట్ల గణనీయమైన ఆధిక్యంతో గెలిచాడు. దానికి కారణం, ఆ ప్రాంతంలోని ఓటర్లలో 52శాతం మంది ముస్లిములే.
ఆశ్చర్యకరమైన ఆ ఫలితం, భారత రాజకీయాల్లో ఎప్పటికప్పుడు పునరావృతమవుతున్న ఒక కీలక విధానాన్ని మరోసారి తెర మీదకు తీసుకొచ్చింది. అదే, చీలికలు పేలికలయ్యే హిందూ ఓట్ల విధానానికి భిన్నంగా ముస్లిం సమాజం ఏకీకృతంగా ఓట్లు వేసే విధానం. బహరాంపూర్‌లో ఓటర్లు తమకు ఏళ్ళ తరబడి సేవ చేసిన సీనియర్ రాజకీయ నాయకుణ్ణి కాదని, స్థానిక మూలాలు లేనివాడూ, రాజకీయంగా ఏ పరిజ్ఞానమూ లేనివాడయిన అభ్యర్ధిని ఎన్నుకున్నారు. ఆ నిర్ణయం మౌలానా మహమ్మద్ అలీ సెంటిమెంటును ప్రతిఫలిస్తోంది. అభ్యర్ధి అనుభవం లేదా నేపథ్యంతో సంబంధం లేదు. అతను కేవలం ముస్లిం అన్న ఒకే ఒక కారణంతో ముస్లిమేతరుడైన సీనియర్ నాయకుణ్ణి పక్కన పెట్టి అతనికే ఓట్లు వేసారు.
మహారాష్ట్రలోని ధూలే లోక్‌సభా నియోజకవర్గం కథ చూద్దాం. అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి శోభా బచావ్, రెండుసార్లు బీజేపీ ఎంపీ సుభాష్ భామ్రే మీద విజయం సాధించారు. ధూలే ఎంపీ సీటు పరిధిలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. షిండాఖేడా, మాలేగావ్ ఔటర్, మాలేగావ్ సెంట్రల్, ధూలే రూరల్, బగ్లాన్, ధూలే సిటీ. సుభాష్ భామ్రే ఐదు సెగ్మెంట్లలో స్పష్టమైన, గణనీయమైన ఆధిక్యం సాధించారు. షఅయితే మాలేగావ్ సెంట్రల్‌లో ఓటింగ్ సరళి ఆయనను ఓటమిపాలు చేసింది. ఆ ఒక్క సెగ్మెంట్‌లో భామ్రేకు 4542 ఓట్లు మాత్రమే వచ్చాయి, శోభా బచావ్‌కు ఆ ఒక్క సెగ్మెంట్లో 198,869 ఓట్లు వచ్చాయి. కారణం సుస్పష్టం. మాలేగావ్ సెంట్రల్ సెగ్మెంట్ జనాభాలో 76శాతం కంటె ఎక్కువ ఓటర్లు ముస్లిములు. దానివల్ల సుభాష్ భామ్రే కేవలం 3831 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలపై ఆ ప్రాంతంలోని జనాభా (డెమోగ్రఫిక్ కాంపోజిషన్) ఎంత ప్రభావం చూపిందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
2024 ఎన్నికల్లో ముస్లిం మతస్తుల ఓటింగ్ సరళిని చూస్తే వారు అద్భుతమైన ఐకమత్యాన్ని ప్రదర్శించారని అర్ధమవుతుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి విజయం సాధిస్తుందన్న అంచనాల మధ్య దేశంలోని ముస్లిములు అందరూ ఇండీ కూటమికి అండగా నిలిచారు. అలాంటి సామూహిక ఓటింగ్ సరళి ఏ ఒక్క ప్రాంతానికో, లేక ముస్లిములలోని ఏ ఒక్క వర్గానికో పరిమితం కాలేదు. ముస్లిములలోని అన్ని కులాల, వర్గాల వారూ ఇండీ కూటమికి గంపగుత్తగా ఓటు వేసారు.
ముస్లిం ఓటర్లలోని ఆ ఐకమత్య భావనకు పూర్తి భిన్నంగా, హిందువుల ఓట్లలో గణనీయమైన చీలికలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. హిందువులు తమ కులం, ప్రాంతం, సామాజిక-ఆర్థిక పరిస్థితులు ఆధారంగా ఓట్లు వేసారు. అంతే తప్ప ముస్లిములలో ఉన్న ఐకమత్యం హిందువులలో లేదు. ఆ చీలికలు హిందూ సమాజంలోని వైవిధ్యతను మాత్రమే చూపడం లేదు, హిందూ సమాజపు బలహీనతను కూడా బైటపెట్టాయి. రాజకీయ రంగస్థలంలో ఐకమత్యంగా ఉండలేని అసమర్థతను వెలికిచూపించాయి. హిందూ సమాజం ఓటింగ్‌లో కులం ప్రముఖ పాత్ర పోషించింది. హిందువులలోని వేర్వేరు కులాల వారు తమ కులాలకు అండగా నిలిచేవి అని భావించే వేర్వేరు రాజకీయ పార్టీలకు అండగా నిలిచారు. ఆ చీలికను ప్రాంతీయ భావాలు మరింత పెద్దవి చేసాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో హిందువులు తమ ప్రాంతీయత ఆధారంగా జాతీయ పార్టీల కంటె ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గుచూపారు. ఆ ఓటింగ్ సరళిని చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. హిందూ ఓటర్లకు స్థూలంగా ఒక సాంస్కృతిక, మతపరమైన ఉనికి ఉండిఉండవచ్చు, కానీ వారి రాజకీయ ఎంపికలు కుల సమీకరణాలు, ప్రాంత సమీకరణాలతో తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.
చారిత్రకంగా, ముస్లిం సమాజంలోని పలువురు ‘అవిశ్వాసులు లేదా కాఫిర్ల’ను చూసే దృష్టికోణం ఒకేలా ఉంటోంది. మరోవైపు, వారిలో తమ మతం పట్ల ఉన్న స్పృహను హిందువులు శతాబ్దాల తరబడి విస్మరిస్తూనే ఉన్నారు. ముస్లిం సమాజం తమ ఉమ్మడి ఉనికిని బలంగా పదేపదే చాటుకుంటూ వస్తోంది. అయనప్పటికీ హిందువులు గతంలో చేసిన తప్పులను అదేవిధంగా పునరావృతం చేస్తున్నారు. అంతే తప్ప ఈ రాజకీయ సమీకరణాల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. ఇటీవలి ఎన్నికల్లో ఓటింగ్ తీరుతెన్నులు ఆ విభజనకు మరోసారి నిదర్శనంగా నిలిచాయి. హిందువులు కులం, ప్రాంతం లాంటి చిన్నచిన్న కారణాలతో విడిపోతున్నారు. ముస్లిములు మాత్రం ఏకతాటిపై నిలబడి తమ సామూహిక ఓటింగ్ బలాన్ని ప్రదర్శిస్తున్నారు.
హిందూ మతస్తులు భారతదేశంలో మెజారిటీ ప్రజలే అయినప్పటికీ అంతర్జాతీయంగా చూసుకుంటే మైనారిటీలే. విదేశీ అబ్రహామిక్ మతాల నుంచి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. 1300 సంవత్సరాలుగా భారత నాగరికతపై జరిగిన దాడులను మన దేశవాసులు ప్రతిఘటిస్తూ, మన నాగరికతను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే గత 200 ఏళ్ళుగా ఆ సవాళ్ళు ఒక స్పష్టమైన రూపు తీసుకున్నాయి. హిందువులు వర్తమానంలో నియో-ఇంపీరియలిస్టుల నుంచి, క్రైస్తవ మిషనరీల నుంచి, వామపక్షవాదుల నుంచి, ఇస్లామిక్ జిహాదిస్టుల నుంచీ సైద్ధాంతిక, సాంస్కృతిక దాడులను ఎదుర్కొంటున్నాయి. ఆ ప్రతీప శక్తులు భారతదేశపు వ్యవస్థలను, కుటుంబజీవన విధానాన్ని, ఆలయాలను, సంప్రదాయాలనూ లక్ష్యం చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయి. ఇలాంటి బహుముఖీనమైన బెదిరింపులను ఎదుర్కొనడానికి ఐకమత్యంగా నిలబడడానికి బదులు హిందూసమాజం కులాలు, ప్రాంతాల పేరిట చీలికలు పేలికలైపోతోంది, ఐకమత్యంగా ఉండే సామర్థ్యాన్ని స్వయంగా బలహీనపరచుకుంటోంది. తద్వారా తమ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా చాటుకోవడం మాట దేవుడెరుగు, కనీసం సమర్ధించుకోలేకపోతోంది.
భారతదేశంలో తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు, రాజకీయ రంగంలో ప్రభావం చూపుతున్న ఈ స్థూలమైన చారిత్రకమైన క్రమాలకు స్పష్టమైన ఉదాహరణ. గణనీయమైన సంఖ్యలో ముస్లిం ఓటర్లున్న బహరాంపూర్ వంటి నియోజవకర్గాల్లో వారి ఐకమత్యం ఎన్నికల ఫలితాలను ఎలా మార్చేయగలదో చూసాం. దానికి పూర్తి భిన్నంగా, హిందూ ఓటర్లు చీలికలైపోయారు. స్థూలంగా హిందూ సమాజం ప్రయోజనాలను పట్టించుకోకుండా తమ కులం, ప్రాంతం వంటి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ విభజన హిందువుల రాజకీయ శక్తిని నిర్వీర్యం చేస్తోంది.
హిందువులు ఐకమత్యపు ప్రాధాన్యతను గుర్తించాలి. కులం, ప్రాంతం వంటి ప్రాతిపదికలు బలహీనపరుస్తాయని అర్ధం చేసుకోవాలి. తమ విస్తృత సాంస్కృతిక, నాగరిక అస్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలా చేయగలిగినప్పుడే వర్తమానంలో మనం ఎదుర్కొంటున్న పలు సైద్ధాంతిక, సాంస్కృతిక సవాళ్ళకు దీటుగా బలమైన శక్తిగా నిలబడగలుగుతాం. హిందూ భావధారకు చెందిన విద్వాంసుడు పంకజ్ సక్సేనా, హిందువులకు ఒక ప్రాధమ్యాల క్రమాన్ని సూచించారు. దాని ప్రకారం, సనాతన ధర్మం, భారతదేశం అనేవి కులం, ప్రాంతం, ఆఖరికి కుటుంబం కంటె పై స్థాయిలో ఉండాలి. అటువంటి విధానాన్ని అనుసరించినప్పుడే హిందువులు తాము ఎదుర్కొంటున్న సమకాలీన సవాళ్ళను సమర్ధంగా ఎదుర్కొనగలుగుతారు. శరవేగంగా మారిపోతున్న ప్రపంచంలో తమ సాంస్కృతిక ధారను సజీవంగా కొనసాగించగలుగుతారు.
2024 ఎన్నికల్లో హిందువులు, ముస్లిముల ఓటింగ్ తీరు మధ్య తేడా… హిందువులు తమ సామాజిక ప్రాధమ్యాలను పునర్మూల్యాంకనం చేసుకోవలసిన అవసరాన్ని ఎత్తిచూపుతోంది. చీలికలు పేలికలుగా జరుగుతున్న హిందువుల ఓటింగ్ సరళికి భిన్నంగా ముస్లిములు సామూహికంగా, వ్యూహాత్మకంగా ఓటింగ్ చేస్తున్నారు. సైద్ధాంతికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా హిందువులు ఎదుర్కొంటున్న అసంఖ్యాక సవాళ్ళను సమర్ధంగా పరిష్కరించుకోవాలంటే హిందువులు తమ ‘సబ్-ఐడెంటిటీ’లను పక్కన పెట్టి సామాజిక లక్ష్యం కోసం ఐకమత్యంగా నిలబడాలి. అంతర్జాతీయంగానూ దేశీయంగానూ ఎదురవుతున్న ఒత్తిళ్ళను తట్టుకుని తమ ఘనమైన, సుదీర్ఘమైన నాగరికతను పరిరక్షించుకోవడం, బలపరచుకోవడం అలాంటి ఐకమత్యం ద్వారా మాత్రమే సాధ్యం.