రోడ్లు రక్తమోడాయి. కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం సీతనపల్లి జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కంటెయినర్ లారీ, కర్రల లోడుతో వెళుతోన్న ట్రాక్టర్ని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. చనిపోయినవారంతా పశ్చిమగోదావరి జిల్లా తాళ్లరేవుకు చెందిన వారిగా గుర్తించారు.
కంటెయినర్ లారీలో డ్రైవర్ సహా పది మంది ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఐదుగురు ప్రమాద స్థలంలో చనిపోగా ఒకరు ఆసుపత్రిలో మరణించాడు. ఈ దుర్ఘటనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.