ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీయే కూటమి పక్షాల నాయకులు హాజరయ్యారు.
మొదట చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసారు. తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసారు. ఆ తర్వాత చంద్రబాబు కుమారుడు, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ప్రమాణస్వీకారం చేసారు.
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా, కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఆంధ్ర్రప్రదేశ్ నుంచి కేంద్ర క్యాబినెట్‌లో స్థానం దక్కించుకున్న ముగ్గురు మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.
ప్రముఖ సినీనటులు చిరంజీవి, రజనీకాంత్, రామ్‌చరణ్, సినీనటీమణులు సుహాసిని, లత, సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడూ నిర్మాతా అయిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, సినీదర్శకుడు క్రిష్ జాగర్లమూడి, యువనటులు నిఖిల్, నారా రోహిత్, నందమూరి చైతన్యకృష్ణ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ తదితరులు హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసాక అన్న చిరంజీవికి పాదనమస్కారం చేయడం అభిమానులను అలరించింది. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా, కొడుకు అకిరా నందన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మంత్రిమండలి ప్రమాణస్వీకారం పూర్తయాక ప్రధానమంత్రి నరేంద్రమోదీ వేదిక మీదున్న ప్రముఖులందరినీ పలకరించారు. చిరంజీవి, పవన్‌కళ్యాణ్ ఇద్దరినీ మోదీ దగ్గరకు తీసుకున్న దృశ్యం అభిమానులకు కన్నులపండుగ చేసింది.