ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బందీలను విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం దూకుడుగా ముందుకెళుతోన్న సమయంలో హమాస్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సోమవారంనాడు నలుగురు బందీలను విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 274 మంది పౌరులు చనిపోయారు. బందీలను విడిపించుకునేందుకు ఐడీఎఫ్ దూసుకొస్తోందని హమాస్ కమాండర్లు గుర్తించారు. ఇక ముందు ఇలాంటి చర్యలకు దిగితే బందీలను చింపేయాలంటూ హమాస్ ఉగ్రవాదులకు సంకేతాలు అందాయని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది.
గత ఏడాది అక్టోబర్ 27న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసిన తరవాత అది యుద్ధంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో 38 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కాల్పుల విరమణకు సిద్దం అంటూనే, ఇజ్రాయెల్ యుద్ధం పూర్తిగా విరమిస్తేనే అంటూ హమాస్ షరతులు పెడుతోంది. చివరి ఉగ్రవాదిని ఏరివేసేంత వరకు యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పష్టం చేశారు.