మణిపుర్‌లో ఉగ్రవాదులు ఏకంగా సీఎం బీరేన్ సింగ్ కాన్వాయ్ పై దాడికి తెగబడ్డారు. నేటి ఉదయం కొందరు తీవ్రవాదులు సీఎం కాన్వాయ్‌పై విచక్షణా రహితంగా కాల్పులకు దిగారు. ఈ ఘటన కాంగ్‌పోక్సి జిల్లాలో జరిగింది. గత ఏడాది మొదలైన మణిపుర్ అల్లర్లు నేటికీ చల్లార లేదు. ఇటీవల జిరిబామ్ జిల్లాలో ఒకరిని దుండగులు హత్య చేశారు. అప్పటి నుంచి మరలా అల్లర్లు మొదలయ్యాయి. 70 ఇళ్లు తగులబెట్టారు.
బాధితులను పరామర్శించేందుకు సీఎం ఇవాళ ఉదయం రాజధాని ఇంఫాల్ నుంచి జిరిబామ్ బయలు దేరారు. ఆయన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సీఎం బీరేన్ సింగ్ పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. గత ఏడాది మేలో మొదలైన అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు తగులబెట్టడంతో లక్ష మందికిపైగా నిరాశ్రయులయ్యారు. వారంతా శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మైతేయి తెగ రిజర్వేషన్లకు హైకోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో కుకీలు హింసకు దిగారు.అప్పటి నుంచి మణిపుర్ రగులుతోంది.