నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆదివారం సాయంత్రం దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు మరో 71మంది మంత్రులు ప్రమాణం చేసారు. కేంద్ర క్యాబినెట్లో గరిష్ఠంగా 80 మందికి (ప్రధానమంత్రి కాకుండా) అవకాశం ఉంటుంది, అంటే మరో 9 మందికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందన్నమాట.
ఎన్డీయే కూటమిగా ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆ కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి సహజంగానే మంత్రి పదవుల్లో మెట్టువాటా లభించింది. ప్రధాని కాకుండా మరో 60 మంత్రి పదవులు భారతీయ జనతా పార్టీ ఎంపీలు స్వీకరించారు. మరో 11 బెర్తులు మిత్రపక్షాలకు దక్కాయి.
బీజేపీ తర్వాత కూటమిలో పెద్ద పార్టీ అయిన తెలుగుదేశానికి 16 మంది ఎంపీలు ఉన్నారు. ఆ పార్టీకి 2 మంత్రి పదవులు ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి మూడోసారి ఎంపీ అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు మొదటిసారి కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్ ర్యాంక్ దక్కించుకున్నారు. రాజకీయ ఆరంగేట్రంలోనే గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారే కేంద్ర సహాయ మంత్రి అయ్యారు.
ఎన్డీయేలో మూడో పెద్ద పార్టీ జేడీయూ. ఆ పార్టీ 12 ఎంపీ స్థానాల్లో గెలిచింది. ఆ పార్టీకి 2 మంత్రి పదవులు దక్కాయి. రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్‌కు క్యాబినెట్ మంత్రి పదవి లభించింది. రామ్‌నాథ్ ఠాకూర్‌కు సహాయ మంత్రి పదవి లభించింది.
ఎన్డీయేలో 7గురు ఎంపీలతో నాలుగో స్థానంలో ఉంది శివసేన. ఆ పార్టీకి చెందిన ప్రతాపరావ్ జాదవ్‌కు స్వతంత్ర సహాయ మంత్రి హోదా లభించింది.
లోక్‌సభలో ఐదు సీట్లు గెలుచుకున్న లోక్‌జనశక్తి (రాంవిలాస్) పార్టీకి ఒక మంత్రి పదవి లభించింది. పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్‌కు క్యాబినెట్ హోదాతో కూడిన మంత్రిపదవి ఇచ్చారు.
జేడీఎస్ నుంచి కుమారస్వామి, ఆర్ఎల్డి నుంచి జయంత్ చౌధురి, హెచ్ఎఎం(ఎస్) నుంచి జీతన్‌రాం మాంఝీ, అప్నాదళ్ నుంచి అనుప్రియా పటేల్, ఆర్పిఐ నుంచి రాందాస్ అథవాలే మోదీ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు.
రెండు ఎంపీ సీట్లు గెలుచుకున్న జనసేన పార్టీకి ఒక్క మంత్రిపదవి కూడా దక్కలేదు కానీ ఒక్క ఎంపీ సీటైనా గెలుచుకోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత రాందాస్ అథవాలేకు సహాయమంత్రి పదవి లభించడం గమనార్హం.