ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ తన ప్రభుత్వపు ఆఖరి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సాధారణ మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చేసిన నేపథ్యంలో మోదీ తన మంత్రివర్గపు ఆఖరి సమావేశం ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ‘గత పదేళ్ళూ బాగా పనిచేసాం. దాన్నే ఇప్పుడు కూడా కొనసాగిస్తాం’ అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ఫలితాలను ఆయన ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు విజయం’గా అభివర్ణించారు. ‘గెలుపోటములు రాజకీయాల్లో భాగం. ఇక్కడ అంకెల ఆట కొనసాగుతుంది’ అన్నారు.
ప్రధాని మోదీ గత పదేళ్ళలో తనకు అండగా నిలిచిన మంత్రిమండలికి ధన్యవాదాలు తెలిపారు. ‘మీరంతా కష్టపడి పనిచేసారు, మీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు’ అంటూ ప్రశంసించారు.
మంత్రిమండలి సమావేశం తర్వాత ప్రధాని నేరుగా రాష్ట్రపతి భవన్కు వెళ్ళి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆయన వచ్చే శనివారం మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ‘శ్రీ నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గం రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకూ ప్రస్తుత మంత్రిమండలి కొనసాగుతుంది’ అని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రస్తుత లోక్సభ పదవీకాలం జూన్ 16న ముగుస్తుంది.