ఒడిశాలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ అభ్యర్థులు 78 స్థానాల్లో విజయం సాధించారు. బీజేడీ 51 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ 14 చోట్ల గెలవగా స్వతంత్రులు మూడు చోట్ల, సీపీఎం ఒక చోట గెలిచారు. 24 ఏళ్ల తర్వాత ఒడిశాలో అధికారమార్పిడి జరిగింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 113 సీట్లు గెలవగా బీజేపీ23, కాంగ్రెస్ 9 సీట్లలో విజయం సాధించింది.
లోక్ సభ పోరులోనూ బీజేపీ సత్తా చాటింది. 21 ఎంపీ స్థానాలకు గాను బీజేపీ 20 చోట్ల జయకేతనం ఎగురవేయగా కాంగ్రెస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. కంటాబంజిలో ఓడిన నవీన్ పట్నాయక్, హింజిలిలో గెలవడానికి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. నవీన్ మంత్రివర్గంలో 9 మంది అమాత్యులు ఓడారు. బీజేడీ లో అగ్రనేతలుగా పేరున్న వారు సైతం ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ 24 ఏళ్ల 165 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేయగా నవీన్ పట్నాయక్ మరో 74 రోజులు సీఎంగా కొనసాగితే ఆ రికార్డును బద్దలు కొట్టేవారు. కానీ బీజేపీ విజయంతో ఆయనకు ఆ అవకాశం దక్కలేదు.