శనివారం ఏడవ దశ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్ జరుగుతుంది. వాటిలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ఆ రాష్ట్రంలో 4 లోక్‌సభ స్థానాలున్నాయి. అవి కాంగ్రా, మండీ, హమీర్‌పూర్, సిమ్లా. వాటిలో సిమ్లా ఎస్సీ రిజర్వుడు స్థానం. వాటితో పాటు 6 శాసనసభ నియోజకవర్గాలకు ఉపయెన్నికలు కూడా జరుగుతాయి.
గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ అంటే 2014, 2019లో హిమాచల్‌లోని నాలుగు స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. అయితే 2022లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. స్థానిక, జాతీయ రాజకీయాల మధ్య హిమాచల్ ఓటర్లు స్పష్టమైన తేడా చూపించడం అంతకుముందు కూడా చరిత్రలో నమోదైంది. అందువల్ల ఈ లోక్‌సభ ఎన్నికల్లో వారి మొగ్గు ఎటువైపు ఉందన్నది ఆసక్తికరంగా నిలిచింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు స్థానాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖీ తలపడుతున్నాయి. కాంగ్రెస్ నాలుగు చోట్లా కొత్త అభ్యర్ధులను నిలబెట్టింది. బీజేపీ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్చింది.
కాంగ్రా నియోజకవర్గంలో బీజేపీ తరఫున రాజీవ్ భరద్వాజ్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత ఆనంద్ శర్మ పోటీ చేస్తున్నారు. మండీలో బీజేపీ అభ్యర్ధి ఫైర్‌బ్రాండ్‌గా పేరుగడించిన సినీనటి కంగనా రనౌత్. ఆమెతో పోటీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్ధి విక్రమాదిత్య సింగ్.
హమీర్‌పూర్‌లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మళ్ళీ పోటీచేస్తున్నారు. ఆయన మీద కాంగ్రెస్ సత్పాల్‌సింగ్ రాయ్‌జాదాను నిలిపింది. ఇంక సిమ్లా ఎస్సీ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ సురేష్ కుమార్ కశ్యప్, కాంగ్రెస్ కొత్త అభ్యర్ధి వినోద్ సుల్తాన్‌పురీ పోటీ పడుతున్నారు.
కంగనా రనౌత్ మీద కాంగ్రెస్ నేతల దూషణలు హిమాచల్ రాజకీయాన్ని వేడెక్కించాయి. అదే సమయంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కమలదళంలో చేరారు కూడా. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లో హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.