ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. కేసుపై ఇప్పటికే చర్చలు జరిగాయని, ప్రస్తుతం తీర్పు రిజర్వ్‌లో ఉందని బెంచ్ వెల్లడించింది. కేసు లిస్టింగ్‌కు సంబంధించిన తదుపరి చర్యలపై సీజేఐ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.
బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలు, ఇతర ముఖ్యమైన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో వారం పొడిగించాలని కేజ్రీవాల్ తన పిటిషన్ లో కోరారు. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది.
తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల ప్రచారంకోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది. దీంతో మే 10న మధ్యంతర బెయిల్ మంజూరుచేసిన న్యాయస్థానం, జూన్ 2న లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది.