వినాయక దామోదర్ సావర్కర్ గొప్ప ధైర్యవంతుడైన స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, గొప్ప రచయిత, వక్త, నిష్టావంతుడైన జాతీయతావాది.
సావర్కర్ 1883 మే 28న మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో భాగూర్ అనే గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆరేళ్ళ వయసులో గ్రామంలోని పాఠశాలలో చేరాడు. రామాయణ మహాభారతాలు, దేశభక్తుల వీరగాధలూ తండ్రి చదువుతూ ఉంటే వినడం చిన్నతనం నుంచే అలవాటైంది. బాల్యం నుంచే సావర్కర్ ప్రతిభాపాటవాలు వెల్లివిరిసాయి. కవిత్వం చెప్పడంలో చిన్ననాటినుంచే అతనిది అందె వేసిన చేయి. సావర్కర్‌కు పదేళ్ళయినా నిండక మునుపే మహారాష్ట్రలోని ప్రఖ్యాత పత్రికల్లో అతని రచనలు ప్రచురితమవుతుండేవి.
సావర్కర్‌కు చిన్నతనం నుంచే ప్రజలు అనుభవిస్తున్న కష్టాల గురించి అవగాహన ఉంది. కరవు కాటకాలు, ప్లేగు వంటి అంటువ్యాధులు, వాటికి తోడు బ్రిటిష్ పాలకుల కిరాతక చర్యల వల్ల ప్రజల పాట్లు అతన్ని కదిలించివేసాయి. ఆ వాతావరణం యువ సావర్కర్ హృదయాన్ని కలచివేసింది. మాతృభూమిని బ్రిటిష్ కబంధహస్తాల నుంచి విముక్తం చేయడానికి ఎందరో అమరవీరులు చేపట్టి అసంపూర్తిగా మిగిలిపోయిన కార్యాన్ని పూర్తి చేయడానికే జీవితాన్ని అంకితం చేస్తాననీ, దానికోసం బంధుమిత్రులు అందరినీ త్యాగం చేస్తానని అతడు ప్రతిజ్ఞ చేసాడు. తన పదహారేళ్ళ వయసులో అంటే 1899లో సావర్కర్ ‘మిత్ర మేళా’ అనే సంస్థను ఏర్పాటు చేసాడు. దాని లక్ష్యం భారతదేశానికి సంపూర్ణ రాజకీయ స్వాతంత్ర్యం సాధించడమే. తరువాతి కాలంలో ఆ సంస్థ పేరును ‘అభినవ భారత్’గా మార్చారు.
సావర్కర్ 1906లో లండన్ వెళ్ళాడు, అక్కడ కూడా తన ప్రయత్నాలు కొనసాగించాడు. అదే యేడాది ఆయన ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ ప్రారంభించాడు. సావర్కర్ సిద్ధాంతం ప్రకారం మాతృభూమి విముక్తి పోరాటంలో కచ్చితంగా ఉండాల్సినవి స్వదేశీ బోధన, విదేశీ వస్తు బహిష్కరణ, జాతీయ విద్యావిధానం, ప్రజల్లో విప్లవ స్ఫూర్తి కలిగించడం, సైనిక బలగాలను దేశభక్తితో నింపడం. 1908 డిసెంబర్‌లో ఆయన ఒక సదస్సు నిర్వహించాడు. ఆ సదస్సులో దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి అంటూ ఏకగ్రీవ తీర్మానం చేసారు. ఆ సదస్సులోనే తుర్కెస్థాన్ ఒక రిపబ్లిక్‌గా ఏర్పడినందుకు ఆ దేశాన్ని అభినందించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామానికి అంతర్జాతీయ మద్దతు ఆవశ్యకతను, దాని ప్రాధాన్యాన్నీ గుర్తించిన మొదటి భారతీయ నాయకుల్లో సావర్కర్ ఒకరు. అభినవ భారత్ విప్లవకారులు రష్యా, ఐర్లండ్, ఈజిప్ట్, చైనా వంటి దేశాలకు చెందిన విప్లవశక్తులతో నిరంతరం ప్రమేయం కలిగి ఉండేది. అమెరికాలోని న్యూయార్క్ నుంచి వెలువడే ఒక పత్రికలో ఆయన భారతదేశంలోని వ్యవహారాల గురించి వ్యాసాలు రాసేవాడు. అవి ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్, రష్యన్ భాషలలోకి అనువాదమై, ప్రచురితమయ్యేలా చూసేవాడు.
రాజకీయ కార్యకలాపాలతో పాటు సావర్కర్ తన చదువు మీద కూడా శ్రద్ధ వహించాడు. ‘గ్రేస్ ఇన్’లో తుది పరీక్ష పాస్ అయినా, అక్కడి సహవిద్యార్ధులు సావర్కర్‌ను న్యాయవాదుల బార్‌కు తీసుకువెళ్ళడానికి నిరాకరించారు. అతను ఎప్పుడూ రాజకీయాల్లో పాల్గొనబోను అని రాతపూర్వకంగా ఒప్పుకోవాలని వారు కోరారు. దానికి సావర్కర్ కుదరదని చెప్పేసాడు, మొత్తం మీద సావర్కర్ కార్యకలాపాలు అతని అరెస్టుకు దారితీసాయి. 1910 మార్చిలో అతన్ని అరెస్ట్ చేసి సముద్రమార్గం ద్వారా భారత్‌కు తరలించాలని భావించారు. నౌక ఇంజన్‌లో సమస్య తలెత్తినందున ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్‌లో ఓడను ఆపారు. ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని దాన్నుంచి తప్పించుకోవాలని సావర్కర్ రెండుసార్లు ప్రయత్నించాడు, కానీ రెండుసార్లూ విఫలమయ్యాడు. మూడోసారి ఓడ బాత్‌రూమ్‌లోని కిటికీలోనుంచి తప్సించుకున్నాడు. సముద్రంలో ఈదుకుంటూ మార్సెయిల్స్ వరకూ చేరుకోగలిగితే ఫ్రెంచ్ చట్టాల పరిధిలోకి వెళ్ళిపోతానని భావించాడు. కానీ ఆ ప్రయత్నంలో ఇంగ్లిష్ గార్డులు సావర్కర్‌ను నిర్బంధించి మళ్ళీ ఓడలోకి తీసుకొచ్చారు. అలా, 27ఏళ్ళ యువప్రాయంలో సావర్కర్‌కు రెండు జీవితకాల శిక్షలు ఒకేసారి విధించారు. వాటిని అండమాన్ దీవుల్లోని ‘కాలాపానీ’ జైలులో అనుభవించాలన్నారు. జైలులో సావర్కర్ (1911-1924) అనుభవించిన కష్టాలు అన్నీఇన్నీ కావు. నూనె గానుగను ఎద్దు లేకుండా తానే లాగాడు. అక్కడ కనీసం మంచి తాగునీరయినా లేదు. అండమాన్స్‌లో కఠిన శిక్షలతో సావర్కర్ ఆరోగ్యం వేగంగా క్షీణించిపోయింది. కొన్నాళ్ళకే అతను ఎముకలపోగులా క్షీణించిపోయాడు.
1924లో జైలు నుంచి విడుదల అయ్యాక సావర్కర్ సమాజ సంస్కరణ కార్యక్రమం ప్రారంభించాడు. కుల వ్యవస్థ, అంటరానితనం మీద యుద్ధం చేసాడు. కులాంతర వివాహాలు, సముద్రం దాటడం, మతం మళ్ళీ మార్పిడి వంటి అంశాలపై సమాజంలో నెలకొని ఉన్న మూఢనమ్మకాల మీద యుద్ధమే చేసాడు. అంటరాని కులాల పిల్లల చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన, మానవీయమైన హక్కుల కోసం పోరాడాడు. ప్రభుత్వ పాఠశాలల్లో అగ్రవర్ణ హిందూ విద్యార్ధులతో పాటు దిగువ కులాల పిల్లలు కూడా కూర్చునేలా చేయగలిగాడు. అస్పృశ్యతా నిర్మూలనకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చేసిన పోరాటానికి సావర్కర్ మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించాడు.
1937లో హిందూమహాసభ అహ్మదాబాద్ సమావేశంలో ఆ సంస్థ అధ్యక్షుడిగా సావర్కర్ ఎన్నికయ్యాడు. అప్పటినుంచీ ఐదేళ్ళ పాటు మహాసభ సమావేశాలకు ఆయనే అధ్యక్షత వహించాడు. స్వాతంత్ర్యం వచ్చే సమయంలో దేశ విభజనకు వ్యతిరేకంగా ఆయన ఎలుగెత్తి ప్రసంగాలు చేసాడు. సావర్కర్ దృష్టిలో స్వతంత్ర భారతం అంటే కులం, మతం, జాతి భేదాలు లేకుండా పౌరులందరికీ అన్నిహక్కులూ సమానంగా అందుబాటులో ఉండాలి. వారందరూ దేశానికి విధేయులుగా ఉండాలి. మైనారిటీలకు వారి భాష, మతం, సంస్కృతిని కాపాడుకోడానికి నిర్దిష్టమైన ఆరక్షణలు ఉండాలి. భావప్రకటనా స్వేచ్ఛ, తమకు నచ్చిన దైవాన్ని పూజించుకునే స్వేచ్ఛ వంటి హక్కులు అందరికీ సమానంగా ఉండాలి. ఏవైనా ఆంక్షలు విధించేటప్పుడు ప్రజాసమూహం శాంతియుతంగా ఉండడం, శాంతిభద్రతల పరిస్థితి సాధారణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకమైన ఎలక్టొరేట్‌లు ఉండకూడదు, ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలి. ప్రభుత్వ సర్వీసుల్లో నియామకాలు ప్రతిభ ఆధారంగా మాత్రమే జరగాలి. ప్రాథమిక విద్య అందరికీ తప్పనిసరిగా ఉండాలి, ఉచితంగా ఉండాలి. దేవనాగరి జాతీయ లిపిగానూ, సంస్కృతం దేవభాషగానూ, హిందీ వ్యవహార భాషగానూ ఉండాలి.
ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతను సావర్కర్ గుర్తించాడు. దేశ ఆర్ధిక విధానానికి స్థూలంగా కొన్ని నియమాలను ఆయన సూచించాడు. వాటిలో కొన్ని… గ్రామాల్లో కార్మికులు, కర్షకులకు పునరుజ్జీవం కలిగించేలా ప్రయత్నాలు ఉండాలి. కొన్ని ప్రధాన పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలను జాతీయీకరణ చేయాలి, విదేశాల పోటీ నుంచి స్వదేశీ పరిశ్రమలకు రక్షణ ఉండాలి.
సావర్కర్ రచనలు ఆదర్శ వ్యవస్థను సాధించమే లక్ష్యంగా ఉండేవి. గెసెప్ మాజినీ తత్వంతో తీవ్రంగా ప్రభావితమైన సావర్కర్, అతని జీవితగాధను మరాఠీలోకి అనువదించాడు. అయితే ఆ రచన నలభై ఏళ్ళ పాటు నిషేధానికి గురైంది. అండమాన్‌లోని సెల్యులార్ జైలులో రాతకు ఎలాంటి పరికరాలూ అందుబాటులో లేని స్థితిలో సావర్కర్ తన కవిత్వాన్ని తన జైలుగది గోడల మీద చెక్కాడు. అతని కవిత్వ సంకలనానికి ‘అడవిపూలు’ అన్న పేరు సార్థకమైంది. ఆయన కవిత్వానికి గాఢమైన తాత్విక భూమిక ఉంది.
సావర్కర్ రచనల్లో గొప్పవైన ‘హిందుత్వ, హిందూపద పాదుషాహీ’లను ఆయన రత్నగిరి జైలులో నిర్బంధంలో ఉన్నప్పుడు ‘మహరట్ట’ అనే కలంపేరుతో రాసాడు. ‘హిందుత్వ’ పుస్తకం హిందూ జాతీయతావాదపు నియమనిబంధనలు, సూత్రాలను విస్తృతంగా నిర్వచించింది. అంతకంటె ముందు, లండన్‌లో ఉన్నప్పుడు అంటే 1907-1908 సమయంలో సావర్కర్ రాసిన ‘1857 మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం’ అనే రచన ఎందరో విప్లవకారులకు స్ఫూర్తిగా నిలిచింది. ‘సిక్స్ గ్లోరియస్ ఎపోక్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’, ‘ట్రాన్స్‌పోర్టేషన్ ఫర్ లైఫ్’, ‘హిందూ రాష్ట్ర దర్శన్’, ‘యాన్ ఎకో ఫ్రమ్ అండమాన్స్’ వంటి రచనలు యువతకు ప్రేరణగా నిలిచాయి. మరాఠీ కవిత్వంలో వైనాయక శైలి ఛందస్సును ప్రవేశపెట్టింది సావర్కరే. శుద్ధ మరాఠీ భాష కోసం ఆయన ఉద్యమం నడిపాడు.
కాలక్రమంలో ఆయన ఆరోగ్యం వేగంగా దెబ్బతింది. ఆయన మంచానికే పరిమితమయ్యాడు. 1966 ఫిబ్రవరి 3న ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. వైద్యులకే ఆశ్చర్యం కలిగించేలా ఆయన 22 రోజులు ఏ మందూ లేకుండా, రోజుకు ఐదారు చెంచాల మంచినీరు మాత్రమే తీసుకుంటూ బ్రతికాడు. చివరకు 1966 ఫిబ్రవరి 26న 83ఏళ్ళ వయసులో సావర్కర్ తుదిశ్వాస విడిచాడు.
సావర్కర్‌కు నివాళులర్పిస్తూ నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ‘‘దేశ స్వాతంత్ర్యం కోసం సావర్కర్ నిలకడగా దృఢంగా పోరాడారు, ఆయన చరిత్ర యువతరానికి స్ఫూర్తిదాయకం’’ అన్నారు.
అప్పటి ఉపరాష్ట్రపతి జాకీర్ హుసేన్ సావర్కర్‌కు నివాళులర్పిస్తూ ‘‘ఆయన గొప్ప విప్లవకారుడు, మాతృభూమి స్వేచ్ఛ కోసం పనిచేయాలంటూ లక్షలాది యువతీయువకులకు ప్రేరణ కలిగించాడు’’ అన్నారు.
అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సావర్కర్‌ను ఆనాటి భారతదేశంలో ధైర్యసాహసాలు, దేశభక్తికి నిదర్శనంగా నిలిచిన మహనీయుల్లో సావర్కర్ ఒకడంటూ నివాళులర్పించారు.