పుణె రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన బాలుడి రక్తనమూనాలను తారుమారు చేసిన వ్యవహారంలో ఇద్దరు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెలోని ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అజయ్ తవాడే, డాక్టర్ హరిహార్నర్‌లను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ తవాడే ప్రభుత్వ ఆసుపత్రిలో ఫొరెన్సిక్ ల్యాబ్ అధిపతిగా చేస్తున్నాడు.
లగ్జరీ కారును అత్యంత వేగంగా నడిపి 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ప్రాణాలు బలిగొన్న బాలుడి రక్తనమూనాలను తారుమారు చేసిన ఘటన సంచలనంగా మారింది. బాలుడి రక్త నమూనాలో ఆల్కహాల్ నెగటివ్ వచ్చినట్లు తప్పుడు నివేదికలు తయారు చేయడంతో పోలీసులు డాక్టర్లను అరెస్ట్ చేశారు. రెండు రక్తనమూనాలను పోలీసులు వేర్వేరు ల్యాబులకు పంపించారు. డీఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించారు. బార్‌లో బాలుడు మద్యం సేవిస్తున్న సీసీటీవీ ఫుటేజీని కూడా పుణె పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదం యాధృచ్ఛికంగా జరిగింది కాదని పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ స్పష్టం చేశారు. సన్న గొందిలాంటి రోడ్డులో అత్యధిక వేగంగా వెళితే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతాయనే స్పృహ బాలుడికి ఉందని ఆయన గుర్తుచేశారు. బాలుడిని కేసు నుంచి తప్పించి వారి వద్ద పనిచేస్తోన్న డ్రైవర్‌ను ఇరికించే క్రమంలో బాలుడి తాత దొరికిపోయాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడి తండ్రి పుణెలో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ వ్యక్తిగా ఉండటంతో ఎలాగైనా కేసు నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో మరిన్ని కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రమాదం చేసిన బాలుడిని జువైనల్ హోంలో ఉంచారు.