బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ హత్య వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్‌ను బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ శిలాష్టి రెహ్మాన్ హనీ ట్రాప్‌లోకి లాగినట్లు పోలీసులు గుర్తించారు. ఎంపీ అనార్‌ను హత్య చేయడానికి ఎప్పటి నుంచో కుట్ర జరిగిందని కోల్‌కతా పోలీసులు అనుమానిస్తున్నారు. మే 12న కోల్‌కతాలోని గోపాల్ బిస్వాస్ ఇంటికి వచ్చిన ఎంపీ అనార్, మే 13న బయటకు వెళ్లి వస్తానని న్యూటౌన్ అపార్టుమెంటుకు వెళ్లాడు. అతను ఓ మహిళతో కలసి న్యూ టౌన్ అపార్టుమెంటులో ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ మహిళను బంగ్లాదేశ్‌కు చెందిన శిలాష్టి రెహ్మాన్‌గా పోలీసులు ప్రకటించారు.
ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ హత్యలో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న జిహాద్ హవాల్దార్‌తోపాటు, మరో నలుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో నివాసం ఉంటోన్న బంగ్లాదేశ్ పౌరుడు అక్తరుజ్జామన్ ఆదేశాల మేరకు హవాల్దార్ హత్యకు పథకం వేసినట్లు తెలుస్తోంది. ఎంపీని కోల్‌కతా రప్పించేందుకు శిలాష్ఠి రెహ్మాన్‌తో హానీ ట్రాప్‌లోకి దింపాడని పోలీసులు తెలిపారు.
బంగ్లాదేశ్ ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుఫారీ అమెరికా నుంచి అందినట్లు తెలుస్తోంది. అమెరికా పౌరసత్వం పొందిన అక్తరుజ్జామన్ ఆ డబ్బును హవాల్దార్‌కు పంపినట్లు గుర్తించారు. హవాల్దార్ మరో నలుగురు బంగ్లాదేశీయుల సాయం తీసుకుని ఎంపీని దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు.
ఎంపీ హత్య తరవాత అతని తోలు వలిచి శరీరాన్ని ముక్కలుగా చేశారు. ఎముకలను చిన్న చిన్న భాగాలుగా చేశారు. హత్య తరవాత అపార్టుమెంట్ ప్లాట్‌ను శుభ్రం చేశారు. శరీర భాగాలను ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి కోల్‌కతాలో పలు ప్రాంతాల్లో పడేశారని పోలీసుల విచారణలో తేలింది. ప్లాట్‌లోని ప్రిజ్‌లో మరికొన్ని భాగాలను గుర్తించారు. శరీర భాగాలను ఓ పెద్ద బ్యాగులో కూడా తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయటపడింది.