కోల్‌కతాలో అనుమానాస్పదంగా దారుణ హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ కేసులో మిస్టరీ వీడింది. ఎంపీని క్రూరంగా హత్య చేసింది అక్రమంగా భారత్‌లో చొరబడ్డవారేనని కోల్‌కతా పోలీసులు తేల్చారు. వైద్యం కోసం కోల్‌కతా వచ్చి మే 13 నుంచి కనిపించకుండా పోయిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్‌ను హత్య చేసి, తోలు వలిచి, ముక్కలుగా చేసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
బంగ్లాదేశ్ ఎంపీ హత్యలో నిందితులుగా భావిస్తున్న జిహాద్ హవాల్దార్‌ను కోల్‌కతా సీఐడీ అరెస్ట్ చేసింది. బంగ్లాదేశ్ నుంచి ఇతను భారత్‌లో అక్రమంగా చొరబడి ముంబైలో నివసిస్తున్నట్లు గుర్తించారు. బంగ్లాదేశ్ ఎంపీ హత్యలో జిహాద్ హవాల్దార్ హస్తముందని, ఎంపీ శరీరాన్ని ముక్కలుగా చేసి కోల్‌కతా న్యూ టౌన్‌లో పడేయడం వెనుక కూడా ఇతని ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
బంగ్లాదేశ్ ఎంపీ హత్య వెనుక సూత్రధారి అక్తరుజ్జమన్ ప్రమేయమున్నట్లు తేలింది. ఇతను బంగ్లాదేశ్‌కు చెందిన అమెరికన్‌గా గుర్తించారు. ఇతని ఆదేశాల మేరకు హవాల్దార్ పనిచేసినట్లు తెలుస్తోంది. ఇతనికి మరో నలుగురు బంగ్లాదేశీలు సహకరించినట్లు తేలింది.
బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అన్వర్ హత్యతో ప్రమేయమున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు బెంగాల్ హోం మంత్రి అసదుజ్జమ్ ఖాన్ వెల్లడించారు. న్యూటౌన్ అపార్టుమెంటులో ఎంపీ హత్య జరిగిన ప్రాంతంలో రక్తపు మరకలను పోలీసులు కనుగొన్నారు. కొన్ని ప్లాస్టిక్ సంచులను స్వాధీనం చేసుకున్నారు. శరీర భాగాలను తరలించడానికి వాటిని వాడినట్లు అనుమానిస్తున్నారు.
హత్య తరవాత ఎంపీ శరీరాన్ని ముక్కలుగా చేసి ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో పడేసినట్లు హవాల్దార్ చెప్పినట్లు పోలీసులు ప్రకటించారు. హత్య తరవాత ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, శరీరంలోని ఎముకలను చిన్న చిన్న ముక్కలుగా నరికినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు స్పష్టం చేశారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.