Our Prime Ministers, Their Leadership and Administration Skills – Special Series – Part 11
******************************************************************
సత్యరామప్రసాద్ కల్లూరి రచన : మన ప్రధానమంత్రులు
******************************************************************
నరేంద్ర దామోదరదాస్ మోదీ (17-09-1950) : ఎన్‌డిఎ 3 & 4
******************************************************************
అన్ని రంగాలలోను యుపిఎ ప్రభుత్వపు వైఫల్యాల మాట అలా ఉంచి, భాజపాకు 2014 ఎన్నికలలో కలిసివచ్చిన ముఖ్యమైన అంశాలు కొన్నింటిని మోదీకి, భాజపాకు వ్యతిరేకంగా నడపబడిన ఒక మీడియా సంస్థ ఈ విధంగా విశ్లేషించింది.
(1) ఆర్థికపరిస్థితిని గాడిలో పెట్టడం: గత ఎన్‌డిఎ అధికారంలో ఉన్నప్పుడు 8% ఉన్న ఆర్థికాభివృద్ధి రేటు 2013 నాటికి 5% కంటే క్రిందకు పతనమైపోయింది. భారతీయ జనతా పార్టీ ఆ విషయంపై దృష్టి కేంద్రీకరించి, అవకాశం వచ్చినప్పుడల్లా యుపిఎ హయాంలో అభివృద్ది ప్రోజెక్టులు నిలిచిపోవడంగురించి ఒకప్రక్క ప్రకటిస్తూ, మరొకప్రక్క అదే సమయంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో గుజరాత్లో జరిగిన అభివృద్ధిని ఆదర్శంగా ప్రజలకు చూపుతూ వచ్చింది. మోదీ ప్రసంగాలలోను, సందేశాలలోను ఆ విషయం తరచుగా ప్రతిధ్వనించసాగింది. దానితో ప్రజలు పురోగమనం వైపు, దానికోసం నాయకత్వపు మార్పు వైపు ఎదురుచూచిన పరిస్థితి ఏర్పడింది. ఆ విషయాన్ని సరిగ్గా అర్థంచేసుకున్న పారిశ్రామికవేత్తలు కూడా పారిశ్రామికాభివృద్ధి మోదీ నాయకత్వంలోనే కచ్చితంగా సాధ్యపడగలదనే నిశ్చయానికివవచ్చి, అతడిని బలపరచసాగారు.
(2) అవినీతిపై పోరాటం: యుపిఎ హయాంలో లెక్కలేనన్ని కుంభకోణాల కారణంగా దానిలో ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెసుకు చాలా చెడ్డపేరు వచ్చింది. దానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల కారణంగా ప్రజలలో ‘అధికార వ్యతిరేక తరంగం’ ఏర్పడింది. అదేసమయంలో ‘అవినీతిపై పోరాటం’ ముఖ్యాంశంగా కేజ్రీవాల్ నేతృత్వంలో ‘ఆమ్ ఆద్మీ పార్టీ అనే కొత్తపార్టీ కూడా ఏర్పడింది. మోదీ తన ప్రచారంలో తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వంనుండి అవినీతిని, లంచగొండితనాన్ని తరిమివేస్తాననీ, దేశానికి చౌకీదార్‌గా (కాపలాదారు) పనిచేస్తాననీ హామీ ఇచ్చాడు.
(3) యువత: 2014 నాటికి భారతదేశంలోని వోటర్లు ఎక్కువగా ’35 సంవత్సరాల యువకులు.’ అది ఒక చెప్పుకోదగిన, క్రమంగా జరిగిన మార్పు. వారికి మోదీ ఇవ్వజూపిన ‘ఉద్యోగావకాశాల కల్పన” ఆశాకిరణంగా తోచింది’. అప్పటికే గత ప్రభుత్వం కొన్ని సామాజిక-ఆర్థికవర్గాలను, కుల, మత వర్గాలను జోకొడుతూ, ఇతరులను రెచ్చగొడుతూ ఉండడాన్ని ప్రజలు భరించలేక, విసిగిపోయి ఉన్నారు.
4) వోటర్లతో ప్రత్యక్ష సంబంధం మెరుగుపడడానికి కొత్త సాంకేతిక పద్ధతుల వినియోగం: భారతీయ జనతా పార్టీ, మోదీ ‘ఉత్సాహపూరితమైన, మెరుగైన సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తూ వోటర్లను ఆకర్షించి, ఆకట్టుకోగలిగారు. మోదీ సెల్ఫీలను బాగా ఉపయోగించడంతో అవి క్షణాలలో జనాలకు అందుబాటులోకి వచ్చి, ఆయనకు వోటర్లతో ఎక్కువగా సంపర్కం కలిగింది. సంవత్సరాలపాటు ఆయన చేసిన ‘ట్వీట్లు’ ఆ పార్టీకి ఎంతో ప్రయోజనాన్ని కలిగించాయి.
(5) మౌలిక సదుపాయాలు: ఆ సమయంలో దేశంలోని రహదారుల, ఓడరేవుల అధ్వాన్నపు స్థితి, తరచుగా చేస్తూవచ్చిన కరెంటు కోతలు మొదలైనవి ఎన్నో అభివృద్ధి ప్రోజెక్టుల ప్రారంభానికి, ఉన్నవి నిలద్రొక్కుకోవడానికీ పెద్దగా ఆటంకం కలిగించాయి. అవే సమస్యలు వోటర్లకు (వారిలో 1/3 మంది నగరవాసులు) కూడా దుర్భరమైపోయాయి.
అప్పటికే మోదీ ఈ విషయమై మెరుగుదలను గుజరాత్లో సాధించి చూపడం (వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం, అతి పెద్ద ఓడరేవు నిర్మాణానికి పెట్టుబడులకై ఆకర్షించగలగడం మొ.) జరిగింది. తాను ప్రధానిగా ఎన్నికైతే అటువంటి అభివృద్ధిని దేశం మొత్తంమీద కలుగజేస్తానని ఆయన మాట ఇచ్చాడు. (ప్రస్తుతం ఇలాంటి అభివృద్ధిని మనం చూడగలుగుతున్నాము కదా.)
17వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు – 2019
మొత్తం సీట్లు 543
భాజపా 303
కాంగ్రెస్ 052
డిఎంకె 024
తృణమూల్ 022
వైఎస్ఆర్సిపి 022
శివసేన 018
జెడియు 016
బిజెడి 012
ఇతరులు 074
(ఈసారి కూడా స్వల్ప మార్పులు, చేర్పులతో ఎన్‌డిఎ కూటమి మంచి ఆధిక్యాన్ని (353) స్థానాలను పొందింది. అందులో భాజపా 303 స్థానాలతో – గత ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ స్థానాలను గడించింది. ఎన్‌డిఎ కూటమి కొన్ని పార్టీల మద్దతుతో పూర్తిగా 5 సంవత్సరాలవరకూ పరిపాలించగలిగింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ వంటి ప్రాంతీయ పార్టీలు ఏ కూటమినీ సమర్ధించకుండా స్వతంత్రంగా ఉండిపోయాయి; కమ్యూనిస్టులకు వచ్చిన స్థానాలు 10 దాటలేదు. ఇతర పార్టీలకు వచ్చిన స్థానాల సంఖ్య చాలా తక్కువే.)
******************************************************************
నరేంద్ర దామోదరదాస్ మోదీ (17-09-1950) : ఎన్‌డిఎ 3 & 4
******************************************************************
2019 లోక్‌సభ ఎన్నికలలో కూడా మోదీ నాయకత్వంలోని భాజపా అతిపెద్ద పార్టీగా (303 స్థానాలతో) అవతరించింది. మధ్యలో తెలుగుదేశం పార్టీ ఎన్‌డిఎ నుండి బయటకు వచ్చి, ఆ ఎన్నికలలో దారుణంగా దెబ్బతిన్నది. అది దాని ప్రత్యర్థియైన వైయస్సార్ కాంగ్రెసుకు బాగా అనుకూలించింది.
ఈసారి కూడా ఒక ప్రముఖ దినపత్రిక ఎన్‌డిఎ విజయానికి దోహదపడిన 12 ముఖ్యాంశాలను ఇలా పేర్కొంది:
“కొన్ని పత్రికలు, మీడియా చేసిన వంచనాత్మక ప్రకటనలను, అబద్ధాలను వోటర్లు గట్టిగా త్రిప్పికొట్టారు. ప్రతిపక్షాల ఒకే ఒక నినాదం – “మోదీని దించేయండి” బెడిసికొట్టింది. “కాషాయ ఉగ్రవాదం” అనే మోసపూరితమైన పడికట్టు పదం అసలు పనిచేయలేదు. అంతే కాదు, వాళ్ళ మరొక ఆయుధం “ప్రమాదంలో ప్రజాస్వామ్యం” అనేది కూడా పనిచేయలేకపోయింది.
దానికి వ్యతిరేకంగా మోదీ ఇచ్చిన “అందరితో, అందరి అభివృద్ధికై, అందరి నమ్మకంతో (సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్)” అనే నినాదాన్నే ప్రజలు గట్టిగా నమ్మారు, ఆదరించారు.
(1) సకారాత్మకమైన నివేదిక కార్డు: 2014 ఎన్నికల సమయంలో మోదీ తాను ఎన్నికైన పక్షంలో 2019 ఎన్నికలు జరిగేటప్పుడు వోటర్ల ఎదుటకు ‘తన నివేదిక కార్డుతో’ వస్తానని హామీగా చెప్పాడు. అన్నట్లుగానే ఆయన ముఖ్యమైన తన విజయాలను 2019 ఎన్నికలముందు ప్రకటించాడు. అతడి పరిపాలనను, పయనించిన దిశను వోటర్లు సకారాత్మకంగానే స్వీకరించారు. (దాని అర్థం ఎన్‌డిఎ ప్రభుత్వపు పథకాలను గట్టిగానే అంగీకరించి, అతడి విధానాలను కొనసాగించేందుకు అంగీకరించినట్టే కదా. 2019లో అధికంగా 21 స్థానాలను గెలవగలగడమే దానికి మరొక నిదర్శనం.)
(2) ఆర్థిక వ్యవస్థ: 2019కి తరువాత ఒకటి రెండేళ్ళకు భారతదేశపు ఆర్థికవ్యవస్థ ప్ర ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. 2023 నాటికి అది 5వ స్థానానికి ఎదిగింది. అంతేగాక, “కొనుగోలుశక్తి సమతౌల్యంలో రెండవ స్థానంలో ఉంది. అదంతా బలవంతుడైన నాయకుడు ఆర్థికరంగంలో పటిష్టమైన సమయోచిత నిర్ణయాలను తీసుకోవడం వల్లనే సాధ్యపడింది. రాబోయే 5 సంవత్సరాలలో దాని సత్ఫలితాలు మనకు కనిపించడం మొదలౌతుంది.
(3) పరిశుద్ధమైన ప్రభుత్వం: తనను ద్వేషించేవాళ్ళ మనస్సులలో కూడా మోదీ తాను అవినీతికి తావివ్వని వాడననే అభిప్రాయాన్ని కలిగించగలిగాడు. తన ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేకుండా చేయడంలో కృతకృత్యుడయాడు. 2014-19 మధ్యకాలంలో ఏ విధమైన కుంభకోణమూ జరగలేదు. ‘రఫేల్’ ఒప్పందం విషయమై గాంధీ కుటుంబం చేసిన ఆరోపణలు ఋజువు కాలేదు. రాహుల్ గాంధీ ఈయనను ఎంత తిట్టితే అంతమేరకు వోట్లు ఈయన ఖాతాలోకి వచ్చిపడ్డాయి.
(4) విదేశాంగ విధానం: 2019 నాటికి ప్రపంచదేశాల్లో భారతదేశం ఎంతో ఎత్తుకు ఎదిగింది. పాకిస్తాన్‌ను మినహాయిస్తే ఇరుగుపొరుగు దేశాలన్నిటితో సత్సంబంధాలను ఏర్పరచుకోగలిగింది. అమెరికా, రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్‌లతో స్వతంత్ర సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోగలిగింది. చైనా కూడా అయిష్టంగానైనా మనతో ఆర్థిక సంబంధాలను మెరుగు పరచుకోక తప్పలేదు. సగటు వోటరు అంతర్జాతీయంగా భారత్ పొందుతున్న గౌరవమేమిటో గుర్తించాడు. “భారతదేశపు పాస్‌పోర్టుకు” నానాటికీ పెరుగుతున్న ఆదరణే దానికి తార్కాణం.
(5) ప్రతిపక్ష పార్టీల మహాసమ్మేళనం: ప్రతిపక్షపార్టీల ‘మహాగఠ్‌బంధన్’ పూర్తిగా దెబ్బతిన్నది. ఆ ‘అతుకులబొంత’ కలయికలో కనీసమైన ఉమ్మడి విధాహాలంటూ లేవు. వాటిలో ప్రజలకు గర్వంగా చెప్పుకునేందుకు సమర్ధించుకోదగ్గ విలువలూ లేవు. మధ్యమధ్యలో వాళ్ళ మధ్య విభేదాలు, అంతర్గతకలహాలు బయటపడుతూ ఉండడంతో వాళ్ళ అసలు రంగులు బయటపడుతూనే ఉన్నాయి. మరొకప్రక్క గతిలేక ఒకళ్ళనొకళ్ళు పొగడుకుంటూ ఉండడం ప్రజలకు వినోదాన్ని మాత్రమే కలిగించగలిగింది. తాము ఆ పార్టీల నేతలకంటే చాలా తెలివైనవాళ్ళమని ప్రజలు చెప్పకనే చెప్పారు.
(6) రాహుల్ గాంధీ అంశం: తాను అంతవరకూ గెలుస్తూ వచ్చిన అమేథీ స్థానంలో రాహుల్ గాంధీ ఓడిపోవడమే అతగాడి ప్రాముఖ్యం ఎంతటిదో తెలియజెప్పింది. అంతకుముందు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో తమ గెలుపు కేవలం తన ప్రజ్ఞవల్లనేనని అతడు నమ్మబలికినా, ఈ 2019 లోక్‌సభ ఎన్నికలు ఆ కథనాన్ని తప్పుగా నిరూపించాయి. కారణం? అతడు దేశానికి స్పష్టమైన దిశానిర్దేశాన్ని చేయలేకపోవడమే. అతడు సరైన అవగాహన లేకుండా ప్రతిపాదించిన ‘న్యాయ్’ పథకానికి పురిట్లోనే సంధికొట్టింది. అతడి శ్రేయభిలాషి, సలహాదారు అయిన శామ్ పిట్రోడా ఒక దశలో ‘అతిగా చేసిన ప్రసంగాలు’ కూడా వోట్లను తేలేకపోయాయి.
(మరో విశేషం: 2019 ఎన్నికలలో రాహుల్ గాంధీ శ్రేయోభిలాషులు కొందరు “అమేథీతో పాటు మరొక క్షేమకరమైన నియోజకవర్గాన్ని” కూడా ఎంచుకోమని సలహా ఇవ్వడంతో కేరళలో అతి భద్రమైన వైనాడ్ నుండి కూడా అతడు పోటీచేశాడు. అక్కడ 4లక్షల పైచిలుకు ఆధిక్యంతో గెలవడం బహుశః అతడికే ఆశ్చర్యం కలిగించి ఉండాలి. అయితే, తాను అంతవరకూ గెలుస్తూ వచ్చిన అమేథీలో మాత్రం శ్రీమతి స్మృతీ ఇరానీ చేతుల్లో సుమారు 50,000 వోట్ల తేడాతో అతడు ఓడిపోయాడు. ఆ రోజుల్లో జనాలు అతడిగురించి తమాషాగా చెప్పుకున్న మాటల్లో ఒకటి – “అతడి మాటలను, చేష్టలను ప్రజలు గమనించినప్పుడల్లా భాజపా ఖాతాలోకి వెయ్యేసి వోట్లు పడేవి” అని.)
(7) ప్రజలు ఎక్కువగా హిందీ మాట్లాడే భాగం, పశ్చిమ భారతం: హిందీ ఎక్కువగా మాట్లాడే ఉత్తరభారతం, మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల ఓటర్లు మోదీ వెన్నంటే ఉన్నారు. అంతకుముందే జరిగిన శాసనసభల ఎన్నికలలో అవి (గుజరాత్ తప్ప) భాజపాకు వ్యతిరేకంగా వోటేసినా, ఆ వోటర్లందరూ మోదీ వ్యక్తిత్వాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో ఆయనవైపే నిలిచారు. అంతే కాదు, ఒడిషా, పశ్చిమ బెంగాల్ కూడా మోదీని స్వాగతించడం మొదలు పెట్టాయి. “విభజన రాజకీయాలు” ఆ ఎన్నికలలో పనిచేయలేదు. రాబోయే రోజుల్లో కలిగే పెనుమార్పులకు అది ఒక ‘‘సూచిక’’ అనే చెప్పాలి.
(8) మౌలిక సదుపాయాలు: భారతదేశంలో 2014-19 మధ్యకాలంలో కొట్టవచ్చిన మెరుగుదల కట్టెదుట కనిపించింది. కొత్త రహదారుల, విమానాశ్రయాల నిర్మాణం, మెరుగైన విద్యుత్తు సరఫరా, వేగవంతమైన రైళ్ళు (2022నుండి కొత్తగా ఎన్నో వందే భారత్ రైళ్ళను ప్రవేశపెడుతూ వస్తున్నారు) – అవన్నీ వేగోధృతితో సాగాయి. (2014కి ముందు పవర్‌కట్‌లు దైనందినజీవితంలో భాగంగా ఉండేవి.) ఆ విధమైన ప్రగతి మోదీ హయాంలో కచ్చితంగా కొనసాగుతుందనే నమ్మకం చాలామంది ప్రజలకు కలిగింది.
(9) యువతరం మద్దతు: సుమారు 8 కోట్లమంది కొత్తగా నమోదైన యువ వోటర్లు అధికసంఖ్యలో మోదీ పక్షాన వోటుచేశారు. నిజానికి వాళ్ళకూ, అయోధ్య రామమందిరం మొదలైనవాటికీ ప్రత్యక్షసంబంధమే లేదు – ఉన్నదల్లా మోదీతోనే. ఆ నాయకుడితోనే తమ కలలు సాకారం కాగలవని గుర్తించారు. మొత్తంమీద తమ జీవనశైలిలో మెరుగుదల, ప్రపంచ దేశాల మధ్య భారతదేశ గౌరవం నానాటికీ పెరగడం – ఇవన్నీ వారి ఎదురుగా గోచరించాయి.
(10) ఉగ్రవాదంపై ఉక్కుపాదం: “పుల్వామా, బాలాకోట్ విమానదాడుల ఫలితాలు” అందరి కళ్ళెదుట కనిపిస్తూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు పుల్వామా దాడుల విషయమై అనవసరంగా రాద్ధాంతం చేసి ఉండకపోతే గనుక, బాలాకోట్ దాడులు జరిగినప్పుడు అవి అభాసుపాలయే పరిస్థితి ఏర్పడేది కాదు! మోదీ సాహసోపేతంగా శత్రుదాడులను త్రిప్పికొట్టగలడనీ, మన సరిహద్దులు ఆయన పాలనలో క్షేమంగా ఉండగలవనీ వోటర్లు గాఢంగా నమ్మారు.
(11) పల్లెల ఆర్థిక వ్యవస్థ: ప్రతిపక్ష పార్టీలు ఎంత నమ్మబలకడానికి ప్రయత్నించినా, వేగంగా దూసుకుపోతున్న వినిమయ వస్తువులను తయారుచేసే కంపెనీల సంఖ్య పెరుగుదల, ఆటోమొబైల్ రంగంలో వాహనాల తయారీకి ఏర్పడిన విపరీతమైన గిరాకీ – పల్లె ప్రాంతాలనుండి చెప్పుకోదగినంతగా పెరిగిన వాటి కొనుగోళ్ళు – అదంతా పల్లె ప్రజలలోనూ పెరిగిన కొనుగోలు శక్తిని సూచిస్తోంది. అదంతా పల్లె ప్రజలలోని పేదరికాన్ని తొలగించడానికి మోదీ పరోక్షంగా చేసిన ప్రయత్నానికి ఫలితంగా అర్థంచేసుకోవచ్చు.
(12) “ఆనువంశికపాలనకు అడ్డుకట్ట”: కాంగ్రెసు పార్టీ నాయకులు “ఆనువంశికపాలన ఆవశ్యకత” గురించి పునరాలోచించుకోవడం, తమ పార్టీలోనికి కొత్తరక్తాన్ని ఎక్కించవలసిన అవసరాన్ని గుర్తించడంవంటి అంశాలను ఇకపైన అయినా మొదలుపెట్టడం మంచిది. భాజపాకు ఎదురునిలిచిన 22 పార్టీల నేతలు కూడా తమ పార్టీలలో తమ కుటుంబసభ్యుల జోక్యాన్ని తగ్గించుకోవలసిన ఆవశ్యకతను తెలుసుకోవడం శ్రేయస్కరం.
అలాగే, ప్రతిపక్షనాయకులు “ఎన్నికలలో నియంతృత్వపోకడలు, పక్షపాతపూరితమైన ఎన్నికల కమిషన్, వ్యతిరేకాత్మకమైన ఎన్నికలు, ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలలో గోల్మాల్”వంటి ఆరోపణలను విసుగుచెందకుండా చేస్తూనే ఉంటారు. కాలక్రమేణా అదంతా “తమ ఓటమిని జీర్ణించుకోలేని అంగలార్పు మాత్రమే” అని గ్రహించక తప్పదు. వోటరు మహాశయుడు అటువంటి కుంటిసాకులను నమ్మడు, పట్టించుకోడు. మరో విధంగా చెప్పాలంటే ‘‘ప్రతిపక్ష పార్టీలు ఆత్మపరీక్షచేసుకోవలసిన సమయం ఆసన్నమైంది.’’
(పైన పేర్కొన్నదంతా 2019 ఎన్నికలను సమీక్షిస్తూ ఒక పత్రిక, మరికొన్ని మీడియా ఇచ్చిన వాస్తవికచిత్రణ, హితబోధ. అయినా సరే, ఆ ప్రతిపక్షాలు తమ పోకడను మార్చుకోలేదు సరి కదా, తమ మనుగడ కోసం కొన్ని అసాంఘికశక్తులను పరోక్షంగా ప్రోత్సహించడమూ మొదలుపెట్టాయి. వాళ్ళ ఏకైక లక్ష్యం – మోదీ ఎట్టి పరిస్థితులలోనూ ప్రధానిగా కొనసాగకూడదు అనేదే. అందులో భాగంగానే 2023 జూలైలో ఎంతో ఆర్భాటంగా Indian National Developmental Inclusive Alliance – I.N.D.I. Alliance అనే “కొంగ్రొత్త కూటమిని” ఏర్పరచుకున్నారు. అందులోని భాగస్వామ్య పార్టీలమధ్య ఏ విషయంలోనూ ఏకాభిప్రాయమనేది కనిపించడం లేదు. దానిలో ఇప్పటికే ఎన్నో లుకలుకలు, బీటలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఇకపైన కూడా ఆ కూటమిలో ఐక్యతను ఆశించడం అడియాసే.)
(I) ఇప్పటివరకు మోదీ ప్రభుత్వం చేసిన ప్రయోజనకరమైన చట్టాలలో ముఖ్యమైనవి కొన్ని:
చట్టాలను చేసే విధానాన్ని ప్రక్షాళన చేసేందుకు ఉద్యుక్తమైన మోదీ ప్రభుత్వం 2014లోనే 1,200 అనవసరమైన, దండుగమారి చట్టాలను పూర్తిగా తొలగించింది. అలాంటివే మరి 1,800 చట్టాలను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. అంతేగాక, మన ఆర్థికవ్యవస్థను, సాంఘికసంక్షేమాన్ని ప్రభావితం చేసే 100కు పైగా బిల్లులను చట్టాలుగా చేసింది. అది ఈ ప్రభుత్వపు నిబద్ధతను తెలియజేస్తుంది. అటువంటి చట్టాలు కొన్ని:
(1) ముస్లింస్త్రీల వివాహ పరిరక్షణ చట్టం 2019: భారతదేశంలో ఉన్న ముస్లిం మహిళలకు ఊరట కలిగించేలా 2019లో శ్రీ మోదీ ప్రభుత్వం ఆ చట్టాన్ని చేసింది. దానితో ఏ ముస్లిమైనా 3సార్లు మౌఖికంగా “తలాక్” చెప్పి, భార్యతో వివాహబంధాన్ని తప్పించుకోవడం పెద్ద నేరం. ఇలా చేసినవాళ్ళకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధింపవచ్చు. అట్టి వ్యక్తులను వారెంట్లు లేకుండానే అరెస్టుచేయవచ్చు. (ఇంతకాలమూ ఈ త్రిపుల్ తలాక్‌ను భార్య అంగీకారం లేకపోయినా, మౌఖికంగా గానీ, ఇ-మెయిల్ ద్వారా గాని, ఒక మెసేజ్ రూపంలో గానీ చెప్పి, తక్షణం వివాహబంధాన్ని తెగగొట్టుకునే హక్కు ముస్లిం సంప్రదాయంలో ఉండేది.) బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలు వోటింగులో పాల్గొనకపోవడంతో పార్లమెంటు ఉభయసభలలో ఆ బిల్లు చట్టమవడానికి దారి సుగమమయింది.
(2) జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019: హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగంనుండి ఆర్టికిల్ 370ను తొలగించడానికి వీలు కల్పించేందుకు ఈ బిల్లును 2019 ఆగస్టు 5న ప్రవేశపెట్టారు. దాని కారణంగా స్వాతంత్ర్యం వచ్చిననాటినుండీ జమ్మూకశ్మీర్ ప్రాంతానికి ఉన్న “ప్రత్యేక ప్రతిపత్తి” పోతుంది. స్వంతంగా చట్టాలను చేసుకునే హక్కు, కేంద్రప్రభుత్వం చేసిన చట్టాలను అతిక్రమించే హక్కు కూడా ఆ ప్రాంతానికి ఇకపై ఉండబోవు. సహజంగానే దానిని ప్రతిపక్షాలు, ఆ ప్రాంతానికి చెందిన మెహబూబా మప్తీ, ఒమర్ అబ్దుల్లా వంటి స్థానిక నాయకులూ దానిని ‘అప్రజాస్వామిక, రాజ్యాంగవిరుద్ధ చర్య’ అంటూ శాయశక్తులా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కేంద్రప్రభుత్వం దానివలన ఆ ప్రాంతంలో ఉగ్రవాదానికి ఆస్కారం లేకుండా రక్షణదళాలకు నిర్ణయాత్మకమైన అదుపును కలిగించడానికి దోహదకారిగా ఆ చట్టాన్ని సమర్థించుకుంది. ఎట్టకేలకు ఆ బిల్లు లోక్‌సభలో 2023 డిసెంబర్ 6న, రాజ్యసభలో డిసెంబర్ 11న ఆమోదించబడింది. దాని ప్రకారం జమ్మూ కశ్మీర్ మొత్తాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టారు. అవి (i) జమ్మూ-కశ్మీర్ (ఢిల్లీ వలె స్వంత శాసనసభతో) (ii) లద్దాఖ్ (చండీగఢ్ వలె స్వంత శాసనసభ లేకుండా).
(3) జిఎస్టి చట్టం 2017: 2016లో రాజ్యాంగానికి చేసిన 101వ సవరణ ఈ “వస్తువులు-సేవల చట్టాన్ని” చేయడానికి సౌలభ్యాన్ని కల్పించింది. జిఎస్టి కౌన్సిల్ CGST బిల్లు 2017ను ఆమోదించాక “ఏకీకృతమైన వస్తువులు-సేవల బిల్లు 2017 (IGST Bill 2017), దానికి సంబంధించిన మరికొన్ని బిల్లులు లోక్‌సభ చేత 2017 మార్చి 29న, తదనంతరం రాజ్యసభచేత 2017 ఏప్రిల్ 6న ఆమోదించబడ్డాయి. 2017 ఏప్రిల్ 12 నాటికి చట్టాలుగా రూపొందాయి. 2017 జూలై 1న ఒక అర్దరాత్రి కార్యక్రమంలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో ఈ జిఎస్టి ప్రారంభించబడింది. ఈ జిఎస్టి విధానం స్వాతంత్ర్యం వచ్చాక దేశంలోని 130 కోట్ల జనాభాను ఏకీకృతమైన విపణి (Single Market) పరిధిలోకి తీసుకురాగలిగింది. యథాప్రకారం ఎన్నో ప్రతిపక్షాలు, దీనివల్ల నష్టపోయే కొన్ని సంస్థలు, దానిగురించి సరైన అవగాహనలేని కొందరు అహితువాదులూ ఈ విధానాన్ని విమర్శించారు.
(4) ఆధార్ కార్డు చట్టం 2016: యుపిఎ ప్రభుత్వం 2009లో నందన్ నీలేకని ఆధ్వర్యంలో భారతదేశంలో ఏకైక గుర్తింపు అధికార యంత్రాంగాన్ని (Unique Identification Authority of India – UIDAI) ఏర్పరచింది. ఆయన దానికి ‘ఆధార్’ అని నామకరణం చేశారు కూడా. ఆ ‘అధార్’ను తీసుకోవడం ఐచ్ఛికమే. అయితే, “గోప్యతకు అడ్డంకులవంటి సమస్యలు” తలెత్తుతాయనే కారణంతో ‘ఆధార్’ను చట్టంగా చేయడానికి ఆ ప్రభుత్వం ముందుకు పోలేకపోయింది. అయితే, 2016లో మోదీ ప్రభుత్వం ఈ ‘‘ఏకైక గుర్తింపు’’ను 2016 ఆధార్ చట్టంగా చేసేందుకు ఒక పనిముట్టుగా ఉపయోగించుకుంది. ఆ బిల్లును ఆర్థిక బిల్లుగా మార్చి, ఆ చట్టాన్ని చేయడానికి ఉన్న ఇతర అడ్డంకులను తొలగించగలిగింది. (సహజంగానే తమ హయాంలో తేలేని ఆధార్ చట్టాన్ని మోదీ ప్రభుత్వం తెస్తున్నప్పుడు కాంగ్రెసు, దాని యుపిఎ మిత్రపక్షాలు సాధ్యమైనంతగా అడ్డుకోవడానికి ప్రయత్నించడం మరొక విశేషం.)
ఈ చట్టానికి ‘‘ప్రతిపక్షులు’’ సుప్రీంకోర్టులో అభ్యంతరాలు లేవనెత్తగా, అక్కడ ‘‘ప్రైవేటు కంపెనీలు, వ్యక్తులకు ‘ఆధార్ నంబర్’ను, దానిలోని వివరాలను కోరడానికి అధికారం ఉండబోదు’’ అని స్పష్టపరచింది. అయితే, “రకరకాల సంక్షేమపథకాలకు సంబంధించి ఈ ఆధార్‌ను శాశ్వత ఖాతా సంఖ్య – PAN పాన్ నెంబర్‌తో ముడిపెట్టడం తప్పనిసరి” అనే విషయంపై అభ్యంతరు తెలపలేదు.
ఈ 2016 ఆధార్ చట్టం ప్రకారం భారతదేశపౌరులెవరైనా తమ కుటుంబ వివరాలను, వ్రేలిముద్రలవంటి వివరాలను ఇచ్చి, తమ ‘ఆధార్ సంఖ్యను పొందవచ్చు. ఒకసారి ఇచ్చాక, దానిని తొలగించడానికిగాని, వదలివేయడానికిగాని దానిని విడుదలచేసే యంత్రాంగానికి అవకాశం ఉండదు.
దీనిని ప్రవేశపెట్టిన ముఖ్యకారణం – “విశేషసదుపాయాలు లేని, దారిద్ర్య రేఖకు క్రింద ఉన్న పౌరులకు” మెరుగైన అవకాశాలను కల్పించడం. దానికి అనుగుణంగా చేసిన 2016 ఆధార్ చట్టం ముఖ్యోద్దేశం – “ఆర్థిక సదుపాయాలను, ఇతర రాయితీలను, సేవలను ‘ఉద్దేశించబడిన వర్గాలకు బట్వాడా” చేయడం. ఈ “ఆధార్ కార్డ్” బడుగు జనులకే గాక, సామాన్యులకు కూడా ఎన్ని లావాదేవీలను సుగమం చేస్తోందో మనకందరికీ తెలిసినదే.
(5) వ్యవసాయ చట్టాలు: అనే మూడు చట్టాలూ (1) వ్యవసాయదారుల ఉత్పత్తుల వాణిజ్యం (ప్రోత్సాహం, సౌకర్యాలూ కలగజేసే) చట్టం 2020, (2) “వ్యవసాయదారుల (సాధికారత & రక్షణ) కనీస మద్దతు ధర, వ్యావసాయిక సేవల చట్టం, (3) నిత్యావసరవస్తువుల (సవరణ) చట్టం2020…. 2020 జూన్ 5న మొదలై, భారత రాష్ట్రపతిచేత ఈ చట్టాలకు పూర్వగాములుగా ఆర్డినెన్సులు జారీచేయబడ్డాయి.
అయితే, రైతు యూనియన్ల పేరుతో కొన్ని బలమైన వ్యతిరేకశక్తులు ఢిల్లీ, దాని పరిసరప్రాంతాలలో చాలాకాలం పెద్ద గొడవలు, అల్లర్లు చేపట్టడంతో ఆ చట్టాలను మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇప్పుడిప్పుడే చాలామంది రైతులకు కొన్ని స్వార్ధపూరితశక్తులచేత తామెంత తప్పుదారి పట్టామో, ఆ చట్టాలు ఇవ్వబోయిన ఎంత మంచి అవకాశాలను జారవిడుచుకున్నామో తెలియవస్తోంది.
(6) పౌరసత్వ సవరణ చట్టం 2019: వ్యవసాయ చట్టాలను చేయడానికి కొన్నాళ్ళ ముందే ఈ “పౌరసత్వ సవరణ చట్టం” ఉభయసభల్లో ఆమోదించబడి, రాష్ట్రపతి ఆమోదాన్ని కూడా పొందింది. దానికి కూడా వ్యతిరేకంగా దేశమంతటా అల్లర్లు చెలరేగాయి. ఈ చట్టం ప్రకారం 2015కు ముందు పాకిస్తాన్ బాంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ దేశాలనుండి మన దేశానికి శరణార్ధులుగా వచ్చిన ఆయా దేశాలలోని హిందూ, జైన, బౌద్ధ, సిక్కు, క్రైస్తవ మైనారిటీలకు భారతదేశపు పౌరసత్వం లభిస్తుంది.
(7) ‘చట్టవిరుద్ధకార్యకలాపాల (నివారణ) చట్టం 2019: భారత పార్లమెంటు ఈ ‘ఉపా’ బిల్లును ఆమోదించడంతో దీనిననుసరించి కేంద్రప్రభుత్వానికి, వివిధ రాష్టప్రభుత్వాలకు ఏ వ్యక్తినైనా ఉగ్రవాదిగా ప్రకటించి, అతడి ఆస్తులను జప్తు చేసుకునే అధికారం ఏర్పడింది. (అనుకున్నట్లే కమ్యూగనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు దానిని క్రూరమైన ఎత్తుగడగా అభివర్ణించారు) గృహమంత్రి “భారతదేశమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకీకృతమై ఉన్నదనీ, మానవహక్కులకు భంగంకాకుండా ఉండేందుకు దీనిలో నాలుగంచెల పరిశీలనకు అవకాశం ఉన్నదనీ దీనిని సమర్థించుకున్నారు. ఈ “ఉపా”నే “ఉగ్రవాద వ్యతిరేకచట్టం” అని కూడా పేర్కొంటున్నారు.
(8) ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ – రాజ్యాంగానికి 124వ సవరణ చట్టం: ఈ ప్రభుత్వం 2019లో ‘ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ సదుపాయం” కలిగించడంకోసం రాజ్యాంగానికి 124వ సవరణ చట్టం చేసింది. దాని ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ప్రభుత్వోద్యోగాలలోను, విద్యాసంస్థలలోను, 10% రిజర్వేషన్ పొందడానికి అర్హులౌతారు. ఇంకా వివరంగా చెప్పాలంటే – “సాధారణ వర్గం”వారిలో సాలుకు కుటుంబపు ఆదాయం 8 లక్షల లోపు ఉంటే, వేరే వర్గం దేంట్లోనూ ఈ ప్రయోజనాన్ని పొందకపోతే (ఎక్స్ సర్వీస్ వ్యక్తులు, దివ్యాంగులు మొదలగువారు మినహాయింపు) అట్టి పౌరులకు ఇది వర్తిస్తుంది. ఈ చట్టం 15, 16 అధికరణాలను స్వల్పంగా సవరిస్తూ, ఈ ‘ఆర్థికమైన వెనుకబాటు’ నిబంధనను చేర్చి, మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఏర్పరచగలిగింది. మరొక విషయం – ఈ రిజర్వేషన్ ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్లు అలానే ఉండగానే, అధికంగా ఇవ్వబడుతుంది. ఇది లోక్‌సభలో 2019 జనవరి 8న, రాజ్యసభలో 2019 జనవరి 12న ఆమోదించబడి, 2019 జనవరి 12న రాష్ట్రపతి ఆమోదముద్ర పొందింది.
(9) ప్రత్యేకరక్షణబృందం (సవరణ) చట్టం 2019: ఇది 2019లో పార్లమెంటు ఉభయసభలచేత ఆమోదించబడింది. దీనిననుసరించి, ప్రత్యేక రక్షణ కేవలం ప్రధానమంత్రికి, మాజీ ప్రధానమంత్రికి, అతడి సమీప కుటుంబ సభ్యులకు మాత్రమే ఇవ్వబడుతుంది. అదికూడా ఆ పదవి పూర్తయిన 5 సంవత్సరాలవరకు మాత్రమే.
(10) అప్పులు తీర్చలేకపోవడం, దివాళాకు సంబంధించిన చట్టం: అప్పటివరకు అమలులో ఉన్న దివాళాకు సంబంధించిన చట్టాలలోని లోపాలను (ముఖ్యంగా ఎక్కువ సమయం తీసుకోవడం పెద్ద సమస్య) సరిచేయడానికి ఈ చట్టం చేసారు. అంతవరకూ ఈ దివాళా పరిష్కారాలకు సగటున మన దేశంలో 4.3 సంవత్సరాలు పట్టేది. పోల్చి చూస్తే ఇటువంటి లావాదేవీలకు అమెరికాలో 1.5 సంవత్సరాలు, ఇంగ్లండులో ఒక సంవత్సరం, దక్షిణాఫ్రికాలో రెండు సంవత్సరాల సమయం పడుతుంది. ప్రపంచ బ్యాంక్ 2015 గణాంకాల ప్రకారం ‘వాణిజ్యం చేయడంలోని సౌలభ్యపు’ రిపోర్టును అనుసరించి, ఈ లావాదేవీల విషయమై మన దేశం 135/190 స్థానంలో ఉన్నది. ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటినుండి ఈ లావాదేవీల విషయమై ఆర్థికవేత్తలు, న్యాయవాదులు, పెట్టుబడిదారులు, వ్యాపారస్తులచేత నిశిత పర్యవేక్షణ జరుగుతోంది.
(11) మహిళలకు రిజర్వేషన్ బిల్లు: ఈ బిల్లు లోక్‌సభలో 2023 సెప్టెంబర్‌లో అంగీకరింపబడినప్పుడు 454 వోట్లు అనుకూలంగా రాగా, ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. ఈ బిల్లు పేరు – “నారీశక్తి వందన్ అధినియమ్.” ఇదే బిల్లు మరుసటి రోజునే రాజ్యసభలో ఏకగ్రీవంగా అంగీకరించబడింది. దానిని “నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు’’ పూర్తయాక మాత్రమే అమలుచేయడానికి ఆస్కారం కలుగుతుంది గనుక, 2024 లోక్‌సభ ఎన్నికల్లో అమల్లోకి వచ్చే అవకాశం తక్కువగా ఉంది.
గతంలో 2014కి ముందు ఈ ‘మహిళల రిజర్వేషన్ బిల్లు’ను మొదటినుండీ శాయశక్తులా ఏదో విధంగా అడ్డుకున్న పార్టీలు – లాలూ రాష్ట్రీయ జనతా దళ్, ములాయం సమాజ్‌వాదీ పార్టీ & ఒవైసీ మజ్లిస్. ఈసారి వీటిలోని మొదటి రెండు పార్టీలు పెద్దగా అడ్డుకోకపోవడం ఒక పెద్ద విశేషం.
(12) క్రిమినల్ న్యాయవ్యవస్థకు సంబంధించిన బిల్లులు 2023: ఈ వ్యవస్థకు సంబంధించిన 3 బిల్లులు 2023 డిసెంబర్లో (శీతాకాల సమావేశాలలో) చట్టాలయాయి. ఇవి ఆంగ్లేయుల కాలంనాటినుండి ఏ మార్పులూ, చేర్పులూ జరగకుండా స్వాతంత్ర్యం వచ్చాక కూడా అదే రీతిలో కొనసాగుతూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఈ క్రిమినల్ చట్టంలో చేపట్టిన సంస్కరణ మొట్టమొదటిసారిగా ఉగ్రవాద నేరాలను సాధారణ నేర చట్టపు పరిధిలోకి తెస్తోంది. ప్రభుత్వవ్యతిరేక చర్యల (sedition) క్లాజును తొలగించి, దానికి బదులుగా రాజ్యాన్ని వ్యతిరేకించే నేరాలు” అనే సెక్షన్‌ను ప్రవేశపెట్టింది. మూకల ఉన్మాదచర్యలకు మరణశిక్ష విధించేందుకు ఆస్కారం కలిగిస్తోంది కూడా. ఆ మూడూ క్రింది విధంగా ఉన్నాయి.
— భారతీయ న్యాయ సంహిత బిల్లు – 1860 నాటి భారతీయ శిక్షాస్మృతిని రద్దు చేసింది.
— భారతీయ సాక్ష్య సంహిత బిల్లు – 1872 నాటి భారతీయ సాక్ష్యచట్టాన్ని రద్దు చేసింది.
— భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్లు – 1898 నేర స్మృతిని రద్దుచేసింది.
(II) ఎన్‌డిఎ పరిపాలనలో 2014 నుండి 2023 డిసెంబర్ వరకూ ప్రవేశపెట్టిన ప్రముఖ పథకాలు, ఉద్యమాలు:
మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే హుటాహుటిన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం మొదలుపెట్టింది. అది క్రమక్రమంగా వివిధ రంగాలకు విస్తరిస్తూనే ఉంది. వాటిని గమనిస్తే “ఈ ప్రభుత్వం ఎన్నుకున్న రంగాలలోని వైవిధ్యం, వాటిని ప్రవేశపెట్టవలసిన ఆవశ్యకత, దేశంలోని వివిధ వర్గాల అవసరాలు, ఎన్నోరకాల వస్తువులను ఉత్పత్తి చేయవలసిన ఆవశ్యకత, కొత్తరంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే కొత్త పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం మొదలైనవాటిని లోతుగా పరిశీలించార”ని అర్ధమౌతుంది.
(1) ప్రధానమంతి జన్ ధన్ యోజన (28-08-2014): ఇది అందరు పౌరులకు అవకాశమిస్తూ, వారు ఆర్థికంగా భాగస్వాములు అయేటందుకు భారతప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దాని ధ్యేయం – “బ్యాంకుఖాతాలు, సొమ్ము జమ, అరువు, బీమా, పెన్షన్లు” మొదలైన సేవలను అంతకంతకూ ఎక్కువమందికి అందుబాటులోకి తేవడం. ఇది మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి స్వాతంత్ర్యదినోత్సవం నాడు ప్రకటించబడి, అదే ఆగస్టు 25నాటికే అమలులోకి వచ్చింది. దానికి ప్రజల స్పందన అనూహ్యంగా వచ్చింది. ప్రారంభోత్సవంనాడే 1.5కోట్లమంది ఖాతాలు తెరిచారు. 2023 సెప్టెంబర్ 28నాటికి ఈ జన్ ధన్’వలన ప్రయోజనం పొందినవాళ్ళ సంఖ్య 50 కోట్లు దాటిపోయింది.
(2) భారత నైపుణ్యాల మిషన్ (Skill India Mission) (28-08-2014): ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన’, ‘ప్రధానమంత్రి యువత శిక్షణ కార్యక్రమం’ అనేది యువతలోని నైపుణ్యాలను గుర్తించి, ప్రామాణీకరించేందుకు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక “నైపుణ్యాలను పెంపొందించే’’ పథకం. దాని ఉద్దేశం “పారితోషికాలు, పురస్కారాల వంటివి ఇవ్వడంద్వారా ఉద్యోగావకాశాలున్న నేర్పరితనాలపై విద్యార్ధుల్లో అభిరుచిని పెంచడం, రోజువారీ పనులు చేసేవాళ్ళ సామర్ధ్యాన్ని పెంచడం.” దానికోసం 1,500 కోట్ల రూపాయలు కేటాయించారు. వివిధరంగాలలో “జాతీయ వృత్తిపరమైన ప్రమాణాల ఆధారంగా శిక్షణాకార్యక్రమాలు ఏర్పాటయ్యాయి కూడా.
(3) భారత్‌లో తయారీ (28-09-2014): మేకిన్ ఇండియా అనేది “భారతదేశంలోనే వస్తువులను పెంపొందించడం, తయారుచేయడం, సమీకరించడం” అనే క్రియాకలాపమంతా కంపెనీలు ఇతోధికంగా జరపాలనే ఆశయంతో భారత ప్రభుత్వం చొరవతో చేపట్టిన ఉద్యమం. దాని విధానపు పోకడ – “పెట్టుబడులను ఆకర్షించడానికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగించడం; ఆధునికమైన, సమర్థమైన మౌలిక సదుపాయాల కల్పన; ఇదేగాక విదేశీపెట్టుబడులకు కొత్త విభాగాలను ఏర్పరచడం.” ఈ చొరవతో ఉద్యోగాల కల్పనకు, నైపుణ్యాల పెంపుదలకు 25 ఆర్థిక విభాగాలను లక్ష్యంగా పెట్టుకుని, “రూపకల్పన, తయారీ మన దేశంలోనే జరిగే విధంగా భారతదేశాన్ని ఒక వస్తువుల ఎగుమతి కేంద్రంగా రూపొందించాలని“ సంకల్పించారు.
ఈ ఉద్యమపు లక్ష్యాలు – (అ) ఉత్పాదక రంగంలో అభివృద్ధి రేటును 12-14%కు పెంచడం, (ఆ) 2022 నాటికి ఉత్పత్తి రంగంలో 70 కోట్ల ఉద్యోగాల కల్పన (ఇ) 2022 నాటికి స్థూల జాతీయోత్పత్తిలో ఉత్పత్తి రంగపు మద్దతు 25%కు పెరిగేటట్లు చేయడం (ఇది తరువాత 2025కు సవరించబడింది.)
ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాక, 2014 సెప్టెంబర్ కు, 2016 ఫిబ్రవరికి మధ్యలో భారతదేశం ₹16.40 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడమేగాక, ₹7.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడికి ఎంక్వయిరీలు వచ్చాయి. దానితో 2015 నాటికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 60.1 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐతో భారతదేశం అమెరికాను, చైనాను దాటిపోయి, ప్రపంచంలో అగ్రగమ్య స్థానంగా నిలువగలిగింది.
(4) ‘స్వచ్ఛభారత్ అభియాన్ (02-10-2014): దీని ముఖ్యోద్దేశాలలో ఒకటి – పల్లెలలో ప్రజలు బహిర్భూములలో మలవిసర్జనను అరికట్టడం, తద్వారా కాలక్రమేణా అటువంటి పద్ధతికి స్వస్తి చెప్పే గ్రామాలను తయారుచేయడం.” స్త్రీలు బహిష్టు కాలంలో పాటించవలసిన ఆరోగ్యకర పద్ధతులను పాటించడంవంటివి కూడా కూడా ఈ ఉద్యమంలో భాగమే. ఇందులోని మొదటి ఘట్టం 2019 అక్టోబర్ వరకూ సాగింది. రెండవ ఘట్టం 2020-21 & 2024-25ల మధ్య, మొదటి ఘట్టంలోని వెలితిని పూడ్చడానికి ఉద్దేశించబడింది. మొదటి ఘట్టంలో సుమారు 9 కోట్ల టాయిలెట్లు కట్టబడ్డాయి.
(5) ‘సంసద్ ఆదర్శ గ్రామ యోజన (11-10-2014): ఈ పథకం పల్లెలలో సాంఘిక, సాంస్కృతిక అభివృద్ధి విషయమై ప్రేరణ’లపై దృష్టిపెట్టేందుకు ఉద్దేశించబడింది. ఈ పథకంలోని ప్రత్యేకతలు ఏమిటంటే – (అ) అది పల్లెల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేయబడింది; (ఆ) సమాజమే దీనికి ప్రేరణను కలిగిస్తుంది (ఇ) ఇది ప్రజల భాగస్వామ్యంపైన ఆధారపడినది. ఈ పథకపు ముఖ్యోద్దేశాలు: (i) ఉన్న ప్రణాళికలను అమలుచేస్తూ, కొన్ని గ్రామాల ప్రత్యేకావసరాలను దృష్టిలో ఉంచుకుంటూ ఆదర్శగ్రామాలను రూపొందించడం (ii) స్థానికాభివృద్ధికై నమూనాలను రూపొందిస్తూ, వాటిని ఆదర్శంగా పెట్టుకుంటూ ఇతర గ్రామాలను అభివృద్ధి చేయడం.
(6) శ్రమ ఏవ జయతే యోజన (16-10-2014): ఈ పథకం ముఖ్యోద్దేశం – శ్రామికులకు సంబంధించిన చట్టాలను మెరుగుపరచడం, శ్రామికులను ఎంచుకునే పద్దతిని కూడా మెరుగుపరచడం.
(7) బేటీ బచావో, బేటీ పఢావో (22-01-2015): కొన్ని రాష్ట్రాలలో లింగం ఆధారంగా జరుగుతున్న అబార్షన్ల కారణంగా “ఆడ-మగ బిడ్డల నిష్పత్తి గణనీయంగా పడిపోవడాన్ని అరికట్టేందుకు” ఉద్దేశించిన పథకం ఇది. తద్వారా ఈ దురాచారాన్ని రూపుమాపుతూ, విద్యావిషయంలోనూ, ఇతర రంగాలలోనూ ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా ఎదగడాన్ని ప్రోత్సహించడమే దీని పరమోద్దేశం.
(8) ‘హృదయ్ ప్రణాళిక (21-01-2015): ఈ “వారసత్వ నగరాల అభివృద్ధి, పెంపుదల ప్రణాళిక ప్రతీ వారసత్వపు నగరం యొక్క నగర ప్రణాళిక, దాని ఆర్థికాభివృద్ధి, వారసత్వపు పరిరక్షణ కోసం కృషిచేయడానికి ఉద్దేశించినది.
(9) ప్రధానమంత్రి ముద్రాయోజన (08-04-2015): “నిధులు లేని చోట నిధులను సమకూర్చడం ప్రధానోద్దేశంగా మోదీ సారథ్యంలో భారతదేశం ప్రవేశపెట్టిన ‘అతిముఖ్యమైన పథకం ఇది. చిన్నాచితకా వ్యాపారులను, పరిశ్రమలను ‘సాధారణ ఆర్థికవ్యవస్థ పరిధిలోకి తీసుకురావడానికి ఇది దోహదం చేస్తుంది. అంటే ప్రభుత్వరంగ బ్యాంకులు, స్థానిక గ్రామీణబ్యాంకులు, సహకారబ్యాంకులు మొదలైనవాటిద్వారా “వ్యవసాయేతర సంపదను సృష్టించే కార్యకలాపాలకు” రూ.10 లక్షల వరకు అప్పులివ్వడానికి ఆస్కారాన్ని ఈ పథకం కలిగిస్తుంది. దీనివలన ఏ భారతీయ పౌరుడైనా “వస్తువుల తయారీ, ఏదైనా వస్తునిర్మాణ పద్దతి, వ్యాపారం, సేవ వంటి వ్యవసాయేతర రంగంలో ఒక ప్రణాళికతో పైన చెప్పిన ఏ బ్యాంకువద్దకైనా వెళ్ళి, 10 లక్షలవరకూ ఈ ‘ముద్ర‘ పథకం పేరిట అప్పు కోరవచ్చు.
(10) ప్రధానమంత్రి ఉజ్వల యోజన (01-05-2016): పేద స్త్రీలు ఉచిత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లను పొందే సదుపాయాన్ని కల్పించే పథకం ఇది. పనిలో పనిగా వంటచెరకు, పిడకలు మొదలైన పాతకాలపు ఇంధనాల వాడకాన్ని తొలగించడం కూడా ఈ పథకపు మరొక ఉద్దేశం. దీనికి ప్రారంభంలో సుమారు రూ. 8,000 కోట్లు కేటాయించారు.
(11) ప్రధానమంతి ఆవాస్ యోజన (25-06-2016): ఈ గృహనిర్మాణపథకం ‘పరపతికి ముడిపెట్టబడిన రాయితీ పథకం. “తక్కువ, ఒక మోస్తరు ఆదాయాలలతో బ్రతుకుతున్నవారి” అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పరచబడింది. 2022 మార్చి 31 నాటికి రెండుకోట్ల ఇళ్ళను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో రెండు విభాగాలున్నాయి. (i) ప్రధానమంత్రి ఆవాసయోజన (పట్టణ) – నగరాలలో నివసించే పేదలకోసం (ii) ప్రధానమంత్రి ఆవాసయోజన (గ్రామీణ) – పల్లెలలో ఉండే పేదలకోసం. ఇది “ఇళ్ళలో టాయిలెట్ల పథకం, సౌభాగ్యపథకం (ఇంటింటా కరెంటు), ఉజ్వల పథకం (ఎల్పిజీ సిలిండర్ల సరఫరా), త్రాగునీటి పథకం, జన్-ధన్’ వంటి మరికొన్ని పథకాలతో అనుసంధానమౌతుంది కూడా.
విడ్డూరమైన విషయమేమిటంటే “దక్షిణభారతంలో కొన్ని ప్రాంతీయపార్టీలు నడుపుతున్న రాష్ట్రప్రభుత్వాలు ఈ పథకాన్ని తమ ఖాతాలలో వేసుకోవడం.” దురదృష్టవశాత్తు ఆయా లబ్ధిదారులు కొందరికి ఈ విషయమే తెలియదు; మరికొందరికి తెలిసినా, వాళ్ళూ పట్టించుకోవడలేదు. కేంద్రప్రభుత్వం, ఎన్డిఎలో భాగస్వాములైన పార్టీలు ఇకనైనా ఈ విషయమై ప్రచారంచేసుకోవడంపైన శ్రద్ధ చూపించకపోతే ఆయా ప్రాంతీయ, ప్రతిపక్షపార్టీల బుకాయింపులు ఇలాగే కొనసాగే అవకాశం చాలా ఉంది.
(12) “అటల్ పెన్షన్ యోజన (09-05-2015): అసంఘటిత రంగాలలో పనిచేసేవారికి సహాయకరంగా ఉండే పథకం ఇది. 40 ఏళ్ళ లోపు వయస్సు కలిగి, దీనిలో సభ్యత్వం తీసుకుని, ఒక పద్ధతిగా సొమ్ము కడుతూండే వాళ్ళకు 60 సంవత్సరాల తరువాత నెలనెలా ₹5, 000 వరకూ పెన్షన్‌గా లభిస్తుంది.
(13) ‘ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (08-05-2015): ఇది ప్రభుత్వం మద్దతునిచ్చే ఒక “ప్రమాదాలకు ఇన్సూరెన్సును ఇచ్చే” పథకం. 18నుండి 70 ఏళ్ళ వయస్సున్న భారతీయపౌరులు, ఎన్నారైలు కూడా ఈ పోలసీని తీసుకోవచ్చు. దీని ప్రీమియం సాలుకు 20 రూపాయలు; పేరును నమోదు చేసుకున్నాక దానంతట అదే బ్యాంక్ అకౌంటునుండి ఈ పథకం అకౌంటులోకి పోతుంది. జూన్ 1నుండి మే 31వరకు లెక్కింపబడుతుంది. దీనిని పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీలు నిర్వహిస్తున్నాయి. మరణం గానీ, పూర్తి వైకల్యం గానీ ఏర్పడితే 2 లక్షలు, పాక్షికంగా శాశ్వత వైకల్యం ఏర్పడితే లక్ష చెల్లించబడతాయి.
(14) అమృత్ విధానం (25-06-2015): “అటల్ పునరుజ్జీవన, నగరస్వభావపు మార్పు ఉద్యమం” (Atal Mission for Rejuvenation and Urban Transformation) ఒక అభివృద్ది పథకం. ఈ ఉద్యమం “నగరాలలోని మురికినీటిని బయటకు పంపే భారీ విధానం, నగరాలలోని అవసరాలకు తగినంతగా నీటి సరఫరా”వంటి అంశాలపై దృష్టిని కేంద్రీకరించి, తగిన చర్యలను చేపడుతుంది.
(15) డిజిటల్ ఇండియా (02-07-2015): గ్రామప్రాంత పౌరులు తమకు తామే సాధికారతను ఏర్పరచుకోవడానికి, ఎలక్ట్రానిక్ పద్ధతిలో మెరుగైన మౌలికసదుపాయాలను ఉపయోగించుకుంటూ, ఇంటర్నెట్ సేవలను మరింతగా వినియోగించుకుంటూ ప్రభుత్వపు సేవలను అందుబాటులోకి తెచ్చుకోవడానికి ఉద్దేశించబడిన ఒక దోహదకారియైన ప్రచారం. దీనివలన దేశం మొత్తం సాంకేతికరంగంలో డిజిటల్ సాధికారతను పెంపొందించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇందులో 3 అంశాలున్నాయి – (అ) సురక్షితమైన, సుస్థిరమైన డిజిటల్ మౌలికసదుపాయాలను పెంపొందించుకోవడం (ఆ) ప్రభుత్వ సేవలను డిజిటల్‌గా అందించడం (ఇ) దేశమంతటా డిజిటల్ సేవల విషయమై అవగాహన కల్పించడం. ఈ విధానం “భారత్ డాట్ నెట్, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా ఇండస్ట్రియల్ కారిదార్స్, భారతమాల, సాగరమాల’వంటి పథకాలకు కారకమూ, లబ్ధిదారు కూడా.
(16) గోల్డ్ డీమోనిటైజేషన్ స్కీమ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్, ఇండియా గోల్డ్ కాయిన్స్: పై పథకాల ఉద్దేశం – “వ్యక్తుల ఇండ్లలో ఉన్న బంగారానికి ఉత్పాదక ప్రయోజనం కలిగించడం, దీర్హకాలికంగా మన దేశపు గిరాకీ అవసరాలకు బంగారం దిగుమతులకై విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించడం.” ఈ విధానాలు బంగారం మదుపరులకు తమ బంగారపు అకౌంట్లపై తగిన వడ్డీలు వచ్చే సదుపాయాన్ని కలిగించడం. ఈ పథకంలో మదుపరికి సాలుకు స్వల్పకాలానికి 2.25% చొప్పున, దీర్పకాలానికి 2.5% చొప్పున లభించగలదు. ఈ పథకం విజయవంతంగా నడుస్తోందని జనవాక్యం.
(17) ఉదయ్ పథకం – ఉజ్వల్ డిస్కమ్ బీమా పథకం (20-11-2015): ఈ పథకం భారతదేశంలోని విద్యుత్తు పంపిణీ కంపెనీలు ‘ఆర్థికంగా నష్టాలనుండి మలుపు తిరిగి, పునరుజ్జీవనం పొందడానికి ఒక ప్యాకేజి.’ ఇది ప్రస్తుతం విద్యుత్తు పంపిణీ వ్యవస్థ ఎదుర్కొంటున్న విపరీతమైన ఒడుదుడుకులకు శాశ్వతపరిష్కారాన్ని ఇవ్వడానికి ఉద్దేశింపబడింది. ఈ పథకం ప్రకారం డిస్కమ్‌లకు యజమానియైన ఏ రాష్ట్రప్రభుత్వమైనా ఐచ్ఛికంగా దాని 2015 సెప్టెంబర్ 30నాటి 75% భాగం అప్పును బాండ్లుగా తీసుకుని, తనకు అప్పు ఇచ్చినవాళ్ళకు ఆ బాండ్ల అమ్మకం ద్వారా బాకీ తీర్చవచ్చును. మిగిలిన 25% శాతం అప్పుకు బాండ్లు జారీ చేయవచ్చు. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి ఎన్నో రాష్ట్రాలు ముందుకు వచ్చాయి.
(18) కొత్త సంస్థలకు ప్రోత్సాహం (స్టార్టప్ ఇండియా) (16-01-2016): ఈ పథకం ఉద్దేశం భారతదేశంలోని వ్యక్తుల ప్రతిభను ప్రోత్సహించి, ప్రతిభ కలిగిన ఔత్సాహికులను (కొన్ని షరతులకు లోబడి) పన్నుల రాయితీ వంటి ప్రోత్సాహకాలను ఇస్తూ ముందుకు నడిపించడం. ఇది కొత్తగా పెట్టుకొన్న సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకం ప్రకారం ఆర్జించిన లాభాలపైన మొదటి మూడు సంవత్సరాలవరకు పన్ను రద్దు, లేదా తగ్గింపు వంటి ప్రయోజనాలు ఉంటాయి.
(19) సేతుభారతం యోజన (04-03-2016): ఈ ప్రోజక్టు క్రింద సుమారు 20,000 కోట్ల ఖర్చుతో ‘మనుష్యులు కాపలా లేని లెవెల్ క్రాసింగుల'” స్థానే మొత్తం 208 రైల్ ఓవర్ బ్రిడ్జిలను, అండర్ బ్రిడ్జిలను నిర్మించడానికి, శిథిలావస్థకు చేరుకుంటున్న 1,500 ఆంగ్లేయుల కాలంనాటి బ్రిడ్జిలను క్రమేణా వెడల్పుచేయడానికి/బాగు చేయడానికి/మార్చివేయడానికి’ నిశ్చయించారు. దాని ఉద్దేశం – 2019 నాటికి జాతీయ రహదారులన్నింటికీ రైల్వే లెవెల్ క్రాసింగుల ఇబ్బంది, కాలయాపన, ప్రమాదాలు, చావులు మొదలైనవాటిని తగ్గించడం.
(20) గ్రామ వికాసం ద్వారా భారతదేశ వికాసం (14-04-2016): ఈ ఉద్యమం ఉద్దేశం – పంచాయతీరాజ్ వ్యవస్థను బలపరచడం, తద్వారా గ్రామాలలో సామాజిక సామరస్యాన్ని, అభివృద్దిని, వ్యవసాయదారుల పురోగతిని సాధిస్తూ, మొత్తంమీద పేదల జీవన ప్రమాణాన్ని పెంచడం.
(21) నమామి గంగే యోజన (07-07-2016): ఇది భారతప్రభుత్వపు “అతిప్రాముఖ్యం కలిగిన సమీకృత పరిరక్షణ ఉద్యమం.” జాతీయస్రాముఖ్యం కలిగిన గంగానదిలో కాలుష్యనివారణకు, దాని పరిరక్షణకు, దానికి తిరిగి జవసత్వాలను కలిగించడంకోసం 2023-26 మధ్య 22,500 కోట్ల రూపాయలను కేటాయించారు.
(22) ‘సతత్ పథకం (అక్టోబర్ 2018): కంప్రెస్డ్ బయోగాస్ను ఉపయోగించే ప్లాంట్లను నిర్మించి, వాటిని వాహనాలకు ఇంధనంగా వాడడంకోసం చొరవ తీసుకుని ప్రవేశపెట్టిన పథకం ఇది. Sustainable Alternative Towards Affordable Transportation నే క్లుప్తంగా ‘సతత్’ అంటున్నారు. దీనికై పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం మొదలయింది. ఇది ప్రభుత్వరంగంలోని చమురు కంపెనీలైన BPCL, HPCL సహకారంతో ‘పెట్రోలియం & నేచురల్ గ్యాస్ మంత్రిత్వశాఖ’చేత ప్రవేశపెట్టబడింది. ‘ప్యారిస్ ఒప్పందం’లో మన దేశం అంగీకరించిన కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నానికి కూడా తోడ్పడుతుంది.
(23) భూసార కార్డుల పథకం (19-02-2015): ఈ పథకంలో ప్రభుత్వపు విధానం ఏమిటంటే – “రైతులకు భూసార కార్డులను జారీచేయడం. వాటిలో రైతుల ఉత్పాదకతకు సహాయకారులుగా వేరు వేరు పొలాలకు ఆయా నేలలలో వేయదగిన పంటలను, తగిన పోషకాలను, ఎరువులను పేర్కొనడం జరుగుతుంది. అన్ని నేలల నమూనాలు జాతీయ ప్రయోగశాలలలో పరీక్షించబడి, ఒక్కొక్కదాని సారం, పోషకాల కొరత మొదలైన విషయాలు నిపుణులచేత లెక్కించబడతాయి; తగిన పరిష్కారాలు సూచించబడతాయి. దానికి ₹568 కోట్లు కేటాయించారు. మొత్తం 14 కోట్ల కార్డులు జారీచేయాలని సంకల్పించారు.
(24) విశ్వకర్మ పథకం (17-09-2023): విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో ఈ పథకం ప్రధానిచేత ప్రారంభించబడింది. దీని ప్రధానోద్దేశం – “సాంప్రదాయక వృత్తులకు, నైపుణ్యాలకు సంబంధించిన కార్మికులకు చేయూత, ప్రోత్సాహం ఇవ్వడం”. పరోక్షంగా ఈ పథకం ఆర్థికంగాను, సాంఘికంగాను వెనుకబడిపోయిన (ముఖ్యంగా ఇతర వెనుకబడిన వర్గాల) ప్రజలకు దోహదకారి కాగలదని నిపుణుల అభిప్రాయం. స్వర్ణకారులు, వడ్రంగులు, రజకులు, క్షురకులు మొదలైన సాంప్రదాయక వృత్తులవారికి ఇది సహాయకారిగా ఉండబోతోందని ప్రధాని దీనిని ప్రారంభించిన సందర్భంలో పేర్కొన్నారు. భారతప్రభుత్వం పూర్తిగా 13,000 కోట్ల రూపాయలు కేటాయించి అమలు చేస్తున్న క్రొత్త పథకం ఇది.
25) “జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ (జన్మన్) (14-01-2024): “ఆదివాసీలకు ఇండ్లు కట్టించి ఇచ్చే” ఈ పథకాన్ని మోదీ 2024 జనవరి 24న ప్రారంభించారు. ఇది సుమారు లక్షమందికి ప్రయోజనకారి కాగలదు. మొదటి దఫాగా ఆ రోజున రూ. 540 కోట్లు విడుదల చేసారు.
(నరేంద్ర మోదీ ప్రభుత్వం పనితీరు గురించి మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చూద్దాం)