Modi asks RaGa why overnight silence on Ambani and Adani
ఇన్నాళ్ళూ అంబానీ-అదానీ పేర్లతో దాడులు చేసిన కాంగ్రెస్
నేత రాహుల్ గాంధీ ఒక్కసారిగా ఆ పేర్లను ఎందుకు వదిలేసారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ
ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ,
అంబానీ అదానీల విషయంలో రాహుల్ ఉన్నట్టుండి ఎందుకు మూగపోయారని నిలదీసారు.
‘‘ఐదేళ్ళుగా కాంగ్రెస్ యువరాజు ఒకే విషయాన్ని
జపిస్తూ వచ్చారు. రఫేల్ విషయం మీద ఆరోపణలు నిరాధారమని తేలేసరికి కొత్తపేర్లు
పట్టుకున్నారు. ఐదుగురు పారిశ్రామికవేత్తలు అంటూ ఒకటే జపం చేసారు. క్రమంగా ఐదుగురి
నుంచి ఇద్దరికి తేలారు. అంబానీ, అదానీ అంటూ మొదలుపెట్టారు. కానీ ఎన్నికలు
ప్రకటించిన తర్వాత అంబానీ, అదానీలను దూషించడం ఆపేసారు. ఇవాళ తెలంగాణ గడ్డ మీదనుంచి
అడుగుతున్నాను. అంబానీ, అదానీ నుంచి ఆయన ఎంత డబ్బు తీసుకున్నారు? ఏమైనా ఒప్పందం
కుదిరిందా? రాత్రికి రాత్రి అంబానీ, అదానీలను దూషించడం ఎందుకు ఆపేసారు. ఎక్కడో ఏదో
తేడా జరిగింది. ఐదేళ్ళపాటు వాళ్ళను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, ఇప్పుడు,
ఇప్పటికిప్పుడు ఆపేసారెందుకు?’’ అని ప్రధానమంత్రి ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో
ఏదో ఒక వివాదం సృష్టించడం రాహుల్‌కు అలవాటని, 2019 ఎన్నికల సమయంలో రఫేల్ ఒప్పందంలో
కుంభకోణం జరిగిందంటూ రచ్చ చేసారని గుర్తుచేసారు.
ప్రధానమంత్రి ఈ ప్రశ్న సంధించడానికి ఎంచుకున్న సమయం,
సందర్భం కూడా గుర్తించదగినవే. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే అదానీ
గ్రూప్‌తో వివిధ రంగాల్లో సుమారు 12.4వేల కోట్ల పెట్టుబడులకు అవగాహనా ఒప్పందాలు
కుదుర్చుకుంది.
అంబానీ, అదానీలే కాక సంపద సృష్టికర్తలైన
అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలపై కాంగ్రెస్ నిర్హేతుక విమర్శలు చేస్తోందని బీజేపీ
మొదట్నుంచీ మండిపడుతోంది. రాహుల్ గాంధీ మొదట్లో నరేంద్రమోదీ ప్రభుత్వం కొంతమంది
అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించేవారు. 22మంది భారతీయులను
కోటీశ్వరులు చేసారని, అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోట్లాదిమందిని
లక్షాధికారులను చేస్తుందనీ వ్యాఖ్యలు చేసారు.
ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన
గౌరవ్ వల్లభ్, గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటూ తనను కాంగ్రెస్ పార్టీ
బలవంతం చేసేదని వెల్లడించారు.