1952లో పెనుకొండ పార్లమెంట్ నియోజకవర్గంగా ఉండగా, ప్రజాపార్టీకి చెందిన కె.ఎస్.రాఘవాచారి విజయం సాధించారు. 1957 లో హిందూపురం లోక్ సభ స్థానం ఏర్పడగా ప్రస్తుతం జనరల్ కేటగిరిలో ఉంది. తాజా సమాచారం మేరకు 16,41,717 ఓటర్లు ఉండగా, 8,20,254 పురుషులు.. 821387 మంది మహిళలు.. 76 మంది టాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
ఈ లోక్సభ స్థానంలో పరిధిలో హిందూపురం, మడకశిర (ఎస్సీ), పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాప్తాడు అనంతపురం జిల్లాలో భాగంగా ఉండగా, మిగిలిన నియోజకవర్గాలన్నీ శ్రీ సత్యసాయి జిల్లాలోనే ఉన్నాయి.
ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదిమార్లు కాంగ్రెస్ గెలవగా టీడీపీ ఐదు సార్లు గెలిచింది.
2019 ఎన్నికల్లో మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్, ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పపై విజయం సాధించారు. అయితే వైసీపీ ఈ దఫా టికెట్ ను వాల్మీకి (బోయ) సామాజిక వర్గానికి చెందిన జోళదరాశి శాంత కు కేటాయించింది. . 2009 లో బళ్లారి నుంచి బీజేపీ తరఫున శాంత విజయం సాధించారు. ఆమె సోదరుడు బి.శ్రీరాములు కర్ణాటక మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి సమద్ షహీన్ పోటీలో ఉన్నారు.
ప్రస్తుతం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పోటీ లో ఉన్నారు. బీసీ (కురుబ) సామాజిక వర్గానికి చెందిన పార్థసారథి అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్గా, హిందూపురం ఎంపీగా, రెండుసార్లు పెనుగొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009, 2014 లో ఈ స్థానంలో టీడీపీ నుంచి నిమ్మల కిష్టప్ప గెలిచారు. 2014లో వైసీపీ తరఫున శ్రీధర్ రెడ్డి పోటీ చేసి ఓడారు. ఆయన 2019లో పుట్టపర్తి నుంచి ఎమ్యెల్యేగా విజయం సాధించారు