ఏపీలో సీఎం జగన్ పాలనలో అవినీతి పరాకాష్టకు చేరిందని ప్రధాని నరేంద్ర మోదీ రాజమహేంద్రవరం బహిరంగ సభలో విమర్శించారు.ఏపీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో అవినీతి పరుగులు పెడుతోందని, అభివృద్ధి సున్నా అని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రధాని ధ్వజమెత్తారు.
రాష్ట్ర నిర్లక్ష్యం వల్ల కేంద్ర ప్రాజెక్టులు ఒక్కటి కూడా అమలు కావడం లేదని మోదీ గుర్తుచేశారు. ఏపీలో ప్రతిభావంతులైన యువతకు కొదవలేదని, కాని వారికి ఇక్కడ ఉద్యోగాలు లేవన్నారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల వద్ద గుట్టల కొద్దీ డబ్బు బయటపడుతోందన్నారు.
జగన్‌రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో దోచుకున్నారని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చి, ఏరులై పారిస్తున్నారని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వానికి అవినీతి తప్ప ఆర్థిక క్రమశిక్షణ తెలియదన్నారు.
సినిమాల ద్వారా ఎన్టీఆర్ ప్రతి ఇంటికి రాముడి చరిత్ర తీసుకెళ్లారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠను బహిష్కరించిందని తప్పుపట్టారు. డిల్లీ ముంబై కారిడార్ తరహాలో, విశాఖ చెన్నై కారిడార్ కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కోల్‌కతా చెన్నై జాతీయ రహదారి రాజమండ్రి విమానాశ్రయం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు మోదీ గ్యారంటీ ఉంది, పవన్ కళ్యాణ్ విశ్వాసం, చంద్రబాబు నాయకత్వం ఉందన్నారు. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏపీ భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించాలన్నారు.
ప్రధాని మోదీ రాజమహేంద్రవరంలో పాల్గొన్న సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్,ఏపీ బీజేపీ చీఫ్ పురందరేశ్వరి. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.