ED found
Rs 25 Crores in the house of PS of minister
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జార్ఖండ్
రాజధాని రాంచీలోని వేర్వేరు ప్రదేశాల్లో ఈ ఉదయం నుంచీ సోదాలు చేస్తున్నారు. ఆ
సోదాల్లో ఇప్పటివరకూ లెక్కలకు అందని రూ.25కోట్ల నగదు పట్టుబడింది.
ఈడీ
అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం సోదాలు నిర్వహించారు. వారు జార్ఖండ్
గ్రామీణాభివృద్ధి శాఖలో మాజీ చీఫ్ ఇంజనీర్ అయిన వీరేంద్రరామ్, అతని సన్నిహితులకు
సంబంధించిన అరడజనుకు పైగా ప్రదేశాల్లో ఈ సోదాలు చేపట్టారు. ఈ వీరేంద్రరామ్ను ఈడీ 2023
ఫిబ్రవరిలో అరెస్ట్ చేసింది.
జార్ఖండ్
గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్లాల్ ఇంట్లో
పనిచేస్తున్న వ్యక్తి గదిలో ఏకంగా కరెన్సీ నోట్ల కొండ బైటపడింది. 70 ఏళ్ళ ఆలంగీర్
ఆలం కాంగ్రెస్ నాయకుడు, జార్ఖండ్ శాసనసభలో పాకూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా
ఉన్నారు.
ఈడీ సోదాలపై మంత్రి
ఆలం స్పందించలేదు. ‘కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ కేసును ఇంకా పరిశోధిస్తున్న ఈ దశలో
ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం సరికాదు’ అన్నారు.
‘‘సంజీవ్లాల్
ప్రభుత్వోద్యోగి. అతను నా వ్యక్తిగత కార్యదర్శి. నాకంటె ముందు మరో ఇద్దరు మాజీమంత్రుల
దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసాడు. చాలామంది ప్రభుత్వోద్యోగులు ఉంటారు.
వారిలో ఎక్కువ అనుభవం ఉన్నవారిని సాధారణంగా వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకుంటాము.
ఈడీ దర్యాప్తు జరుగుతూ ఉండగా ఈ వ్యవహారం గురించి మాట్లాడడం సరికాదు’’ అని ఆలంగీర్
ఆలం అన్నారు.
ఈ ఉదంతంపై బీజేపీ
విరుచుకుపడింది. ‘‘జార్ఖండ్లో అవినీతికి ముగింపే లేదు. ఎన్నికల సమయంలో ఇంత డబ్బు
దొరికిందంటే దానర్ధం ఆ మొత్తాన్ని ఎన్నికల్లో ఉపయోగించే ప్రణాళికతోనే జమచేసారు. ఈ
వ్యవహారంపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలి’’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్
సహదేవ్ అన్నారు.
ఈడీ ఈ ఉదయం నుంచి రాంచీలో
తొమ్మిది చోట్ల ఒకేసారి సోదాలు చేపట్టింది. రహదారుల నిర్మాణ విభాగానికి చెందిన ఇంజనీర్
వికాస్ కుమార్ అనే వ్యక్తి గురించి వెతుకుతున్నారు. రాంచీలోని సెయిల్ సిటీ,
బరియాతు, మొర్హాబడి, బొడియా తదితర ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.