Another chance for postal ballot in AP
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు
హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించరాదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్
కుమార్ మీనా అన్నారు. అటువంటి ఉద్యోగుల వద్ద ఫారం 12ను స్పాట్‌లోనే స్వీకరించి
అర్హులు అందరికీ ఓటు హక్కు మీనా జిల్లా ఎన్నికల అధికారులకు, రిటర్నింగ్ అధికారులకూ ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఓటర్లు ఫారం-12ను సకాలంలో సమర్పించలేకపోవడం వల్ల ఓటుహక్కును
వినియోగించుకోలేకపోతున్నారనే విషయం తమ దృష్టికి
వచ్చినట్లు ఆయన తెలిపారు.
ఎన్నికల విధుల్లో ఉన్న వారికి పోస్టల్
బ్యాలెట్ కోసం ఫారం12 సమర్పించడానికి మే 1 ఆఖరు తేదీ. అయితే చాలామంది ఉద్యోగులు
ఆలోగా ఫారం సమర్పించలేకపోయారు. అలాంటి వారికి మరో అవకాశం కల్పించారు. అలాంటి వారు ఏ
ఆర్ఓ పరిధిలో ఓటరుగా నమోదు అయ్యారో, ఆ ఆర్‌ఓకు ఫారం 12 సమర్పించేందుకు, ఆ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకొనేందుకు అనుమతించాలని
మీనా ఆదేశించారు. ఈ నెల 7,8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫెసిలిటేషన్ కేంద్రాలు పని చేస్తాయని తెలిపారు.
ఉద్యోగులకు మంజూరు చేసిన స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను సద్వినియోగం చేసుకుంటూ పోస్టల్
బ్యాలెట్ ఫెసిలిటీ సెంటర్‌లో ఓటు వేయవచ్చని చెప్పారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత
గడువులోగా ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా
ఆర్‌ఓలు సహకరించాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఓటర్ల వివరాలు, అపాయింట్‌మెంట్ ఆర్డర్ ధ్రువీకరించుకుని, పోస్టల్
బ్యాలెట్ ఇప్పటికే జారీ అవలేదని నిర్ధారించుకున్నాక అటువంటి ఓటర్లకు తమ హక్కును
వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఆయన సూచించారు.