ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను కెనడా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి ఫోటోలను మీడియాకు
విడుదల చేశారు. నిజ్జర్ హత్యలో భారతీయ గూఢచర్యసంస్థల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.
కెనడా అరెస్ట్ చేసిన ముగ్గురు భారతీయుల్లో కరణ్ బ్రార్, కమల్ ప్రీత్‌సింగ్, కరణ్‌ప్రీత్‌సింగ్ ఉన్నారు. కెనడాలోని అల్బెర్టాలో వీరు గత ఐదు సంవత్సరాలుగా ఉంటున్నారు. ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ బృందానికి నాయకత్వం వహిస్తున్న మన్‌దీప్ మూకర్, ముగ్గురు నిందితుల ఫోటోలను విడుదల చేశారు.
అనుమానితులకు భారత్ ప్రభుత్వంతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నట్లు కెనడా పోలీసులు తెలిపారు. నిజ్జర్ హత్య దర్యాప్తు చాలా వేగంగా జరుగుతున్నట్లు రాయల్ మౌంటెడ్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ టెబౌల్ శుక్రవారం మీడియాకు తెలిపారు.
ఖలిస్థాన్ వేర్పాటు వాద ఉగ్రవాది నిజ్జర్, గత ఏడాది జూన్ 18న కెనడాలోని సర్రెలోని ఓ గురుద్వారా బయట హత్యకు గురయ్యాడు. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.