Gannavaram
Assembly Constituency Profile
కృష్ణా జిల్లాని కృష్ణా,
ఎన్‌టీఆర్ అని రెండు జిల్లాలుగా విడగొట్టిన తర్వాత కూడా రెండు జిల్లాల్లోనూ
వ్యాపించి ఉన్న శాసనసభా నియోజకవర్గం గన్నవరం. ఈ స్థానం 1955లో ఏర్పడింది. ఈ
నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు,
విజయవాడ రూరల్‌లో కొంతభాగం.
గన్నవరం నియోజకవర్గం
నుంచి 1955, 1962, 1978 ఎన్నికల్లో సిపిఐ తరఫున కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి
సుందరయ్య విజయం సాధించారు. 1967, 1968, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ
గెలిచింది. 1983, 1985లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 1989లో మళ్ళీ
కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంది. 1994లో గద్దే రామ్మోహనరావు స్వతంత్ర అభ్యర్ధిగా
విజయం సాధించారు. 2004లో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1999, 2009, 2014, 2019
ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది.
2014లో టిడిపి అభ్యర్ధి
వల్లభనేని వంశీమోహన్ వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి దుట్టా రామచంద్రరావు మీద విజయం
సాధించారు. 2019లో కూడా వంశీ టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి
యార్లగడ్డ వెంకట్రావును ఓడించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత కొద్దికాలానికే వంశీ
తెలుగుదేశాన్ని వీడి, వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. 2024 ఎన్నికలకు
ముందు సాంకేతికంగా లాంఛనం పూర్తి చేసుకుని వైసీపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు.
వంశీ వైసీపీకి మద్దతు
ఇవ్వడం మొదలుపెట్టిన నాటి నుంచీ ఆ పార్టీలోని యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా
రామచంద్రరావు వర్గాలు ఆయనను వ్యతిరేకిస్తూ వచ్చాయి. చివరికి యార్లగడ్డ వెంకట్రావు
వైసీపీని వీడి టిడిపిలో చేరి టికెట్ తెచ్చుకోగలిగారు. అలా 2024 ఎన్నికల్లో కూడా
వారిద్దరే మళ్ళీ తలపడుతున్నారు. వారి పార్టీలే తారుమారయ్యాయి. ఇక ఇండీ కూటమి తరఫున
గన్నవరం నుంచి సిపిఐ(ఎం) అభ్యర్ధి కల్లం వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు.