ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యాయత్నంలో భారత గూఢచర్య సంస్థ హస్తముందని అమెరికాకు చెందిన ప్రముఖ దిన పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కథనం సంచలనంగా మారింది. రాలో పనిచేస్తోన్న విక్రయాదవ్ ద్వారా పన్నూ హత్యకు కుట్రపన్నారని వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు వచ్చాయి. సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ అమెరికా అధికార ప్రతినిధి పన్నూను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.
పన్నూను హత్య చేసేందుకు భారత గూఢచర్య సంస్థ చేపట్టిన ఆపరేషన్‌పై అమెరికా ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేసినట్లు ఆ కథనం ద్వారా తెలుస్తోంది. అమెరికా నిఘా వర్గాలు పన్నూ హత్యను అడ్డుకున్నాయని కథనం సారాంశం.
ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితులైన నిఘా అధికారులకు కూడా ఈ విషయం ముందే తెలుసని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్‌కు పన్నూ హత్యాయత్నం విషయం ముందే తెలిసే ఉంటుందని, అయితే దీనిపై స్పష్టమైన ఆధారాలు లేవని ఆ పత్రిక పేర్కొంది.