గర్భవిచ్ఛిత్తి తీర్పును సుప్రీంకోర్టు వెనక్కు తీసుకుంది. 30 వారాల వరకు గర్భవిచ్ఛిత్తికి అనుమతినిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వెనక్కు తీసుకుంది. బాధితురాలి ఆరోగ్య ప్రయోజనాలే తమకు ముఖ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై.చంద్రచూడ్ ధర్మాసనం అభిప్రాయపడింది.
లైంగిక వేధింపులకు గురైన 14 సంవత్సరాల బాలిక దాల్చిన 30 వారాల గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకోవచ్చని గత వారం సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని బాలిక తల్లిదండ్రులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో, తీర్పును వెనక్కు తీసుకుంటున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బాలిక ఆరోగ్యమే తమకు ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది.
మహారాష్ట్రకు చెందిన ఓ బాలిక లైంగిక వేధింపులకు గురైంది. తల్లిదండ్రులకు విషయం ఆలస్యంగా తెలిసింది. తరవాత వారు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ అనుకూల తీర్పు రాకపోవడంతో, గర్భవిచ్ఛిత్తికి అనుమతి కోరుతూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం మేరకు వివాహితులు, దివ్యాంగులు, అత్యాచార బాధితులకు 24 వారాల వరకు గర్భవిచ్ఛిత్తి చేసుకునే వెలుసుబాటు ఉంది.