ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్దమవుతోందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకున్నాయి. హమాస్ ఉగ్రవాదులకు తాజాగా ఇజ్రాయెల్ కాల్పుల విమరణ ప్రతిపాదలను పంపింది. ఇజ్రాయెల్ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు హమాస్ తెలిపింది. దీనిపై త్వరలో స్పందన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 13న ఈజిప్టులో ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి.
అందులో 40 మంది ఇజ్రాయెలీ బందీల విడుదల, ప్రతిగా వందలాది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేసే అంశం చర్చకు వచ్చింది. తాజా ప్రతిపాదన అమలైతే బందీల సంఖ్య 33కు తగ్గనుంది.
ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య కాల్పుల విరమణకు ఈజిప్టు తొలి నుంచి చొరవ చూపుతోంది.కాల్పుల విరమణపై జరిపిన చర్చలు త్వరలో ఫలించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో పాలస్తీనాకు అనుకూలంగా విద్యార్థులు నిరసనకు దిగారు. దీంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. యూనివర్సీటీల్లో బలగాలను దింపింది. మరోవైపు ఫ్రాన్సులో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.