Congress alleges BJP-CPM deal in Kerala
ఇండీ కూటమిలోని తమ భాగస్వామి సిపిఐ(ఎం) పైనే
కాంగ్రెస్ పార్టీ నేత కెసి వేణుగోపాల్ తీవ్ర ఆరోపణలు చేసారు. ప్రత్యర్థి బీజేపీతో
సీపీఎం ఒప్పందం కుదుర్చుకుందని ఆయన ఆరోపించారు.
ఎల్డిఎఫ్ కన్వీనర్ ఇపి జయరాజన్, బిజెపి నాయకుడు
ప్రకాష్ జవదేకర్ మధ్య చర్చలు జరిగాయంటూ వచ్చిన కథనాల గురించి వేణుగోపాల్
స్పందించారు. ‘‘వారిద్దరూ కలుసుకున్నారు, చాలాసేపు మాట్లాడుకున్నారు. అది
దిగ్భ్రాంతికరమైన పరిణామం. జవదేకర్ వచ్చి తనను కలుసుకున్నారని జయరాజన్ కూడా
ఒప్పుకున్నారు. బిజెపి కేరళ ఇన్చార్జ్ అయిన జవదేకర్ అది కేవలం వ్యక్తిగత సమావేశమే
అని చెబుతున్నారు. కానీ అది వ్యక్తిగతం ఎలా అవగలదు? దాన్ని బట్టే బిజెపి-సిపిఎం
మధ్య ఒప్పందం ఉందని స్పష్టంగా తెలిసిపోతోంది’’ అన్నారు వేణుగోపాల్.
అంతకుముందు, కెపిసిసి అధ్యక్షుడు, కన్నూర్ ఎంపీ
సీటుకు యుడిఎఫ్ అభ్యర్ధి అయిన కె సుధాకరన్, ఎల్డిఎఫ్ కన్వీనర్ ఇపి జయరాజన్ మీద
తీవ్ర ఆరోపణలు చేసారు. జయరాజన్ బిజెపిలో చేరిపోడానికి సిద్ధంగా ఉన్నారన్నది ఆ
ఆరోపణల సారాంశం.
‘‘కొంతకాలం క్రిందట గల్ఫ్‌లో చర్చలు జరిగాయి. అది
ఏ రోజు అన్నది కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. నాకు తెలిసినదేంటంటే గవర్నర్‌గిరీ
గురించి చర్చలు జరిగాయట. రాజీవ్ చంద్రశేఖర్, శోభా సురేంద్రన్, తదితర బీజేపీ నేతలు
కూడా పాల్గొన్నారు. ఎల్డిఎఫ్ కార్యదర్శిగా ఎంవి గోవిందన్ నియామకంపై జయరాజన్
అసంతృప్తిగా ఉన్నారు. ఆ పదవి తనకు రాకపోవడం ఆయనను బాధించింది’’ అని సుధాకరన్
చెప్పారు.
ఎన్‌డిఎ నాయకులతో సమావేశం తర్వాత సిపిఎం నాయకత్వం జయరాజన్‌ను
బెదిరించింది, దాంతో ఆయన పార్టీ మారకుండా ఉండిపోయారు అని సుధాకరన్ ఆరోపించారు.