ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు కీలక సమాచారం అందించారు. ఢిల్లీ మద్యం పాలసీని మార్చి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి, కొందరికి లబ్ది చూకూర్చిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారుడని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టుకు తెలిపింది. అన్ని ఆధారాలు సేకరించిన తరవాతే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసినట్లు ఈడీ తరపు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు.
గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం రూ.45 కోట్లు ఖర్చు చేశారని, ఈ డబ్బంతా ఢిల్లీ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిందేనని కోర్టుకు వెల్లడించారు. మద్యం వ్యాపారులకు ప్రయోజనం చూకూర్చడం ద్వారా సంపాదించిన డబ్బు గోవా ఎన్నికలకు తరలించినట్లు ఆధారాలున్నాయన్నారు.
కొందరికి ప్రయోజనం చూకూర్చి వారి నుంచి ముడుపులు తీసుకున్నారంటూ ఈడీ 734 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మద్యం పాలసీ రూపొందించడంలో సీఎం కేజ్రీవాల్ హస్తం ఉందని ఈడీ అఫిడవిట్‌లో పేర్కొంది. తనను అన్యాయంగా అరెస్ట్ చేసిందంటూ సీఎం కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల వాదనలను ఈడీ తోసిపుచ్చింది. కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల వాదనలపై ఈడీ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.