Nomination filed with fake ST certificate cancelled
అసోంలోని కోక్రఝార్ లోక్‌సభా నియోజకవర్గానికి గణ
సురక్షా పార్టీకి (జిఎస్‌పి) చెందిన నబకుమార్ సరానియా సిట్టింగ్ ఎంపీ. ఆయన దాఖలు
చేసిన నామినేషన్ పత్రాలను పరిశీలించిన ఎన్నికల సంఘం అధికారులు అందులో తప్పుడు
వివరాలు ఉన్నాయంటూ నామినేషన్‌ను రద్దు చేసారు.
రిటర్నింగ్ అధికారి ప్రదీప్ కుమార్ ద్వివేదీ ఆ
వివరాలు ఇలా చెప్పారు. ఏప్రిల్ 19న మొత్తం 16 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో 15
సరిగ్గానే ఉన్నాయి. కానీ సిట్టింగ్ ఎంపీ నబకుమార్ సరానియా నామినేషన్‌లో
లోపాలున్నాయి. అది గమనించిన అధికారులు ఆ నామినేషన్‌ను రద్దు చేసారు. మే7న మూడో దశ
పోలింగ్ జరగాల్సి ఉన్న దశలో ఈ పరిణామం చోటు చేసుకోవడం కోక్రఝార్‌లో సంచలనం
కలిగించింది.
సరానియా షెడ్యూల్డు తెగకు చెందినవాడు
కాదని, అందువల్ల ఎస్టీలకు రిజర్వు చేసిన నియెజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆయన అనర్హుడనీ
హైకోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. అయినప్పటికీ సరానియా ఏప్రిల్ 19న
నామినేషన్ దాఖలు చేసారు.
హైకోర్టు ఆయనకు
వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. సరానియా కచారీ కులానికి చెందినవాడన్న వాదనను
కొట్టిపడేసింది. సరానియాకు 2011 అక్టోబర్ 17న జారీ చేసిన ఎస్టీ సర్టిఫికెట్ సరైనది
కాదంటూ రాష్ట్రస్థాయి స్క్రూటినీ కమిటీ ఆ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. ఆ నిర్ణయం
ఆధారంగా న్యాయస్థానం ఈ యేడాది ఏప్రిల్ 18న ఇచ్చిన తీర్పులో సరానియా అసలు కచారీ
కులానికి చెందినవాడే కాదని తేల్చింది. దాని ఆధారంగా ఎన్నికల కమిషన్ ఆయన నామినేషన్‌ను
రద్దు చేసింది.
తన నామినేషన్‌ను రద్దు
చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై సరానియా నిరాశ వ్యక్తం చేసారు. న్యాయవ్యవస్థపై గౌరవం
ఉందంటూనే కోర్టు తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తానని చెప్పారు.
అయితే, నామినేషన్ల ఉపసంహరణ
గడువు ఏప్రిల్ 22, అంటే రేపటితో ముగుస్తుంది. దాంతో నబకుమార్‌కు ఈసారి ఎన్నికల్లో
పోటీ చేసే అవకాశం లేనట్లే.
నబకుమార్ ఎన్నికల బరిలో లేకపోతే కోక్రఝార్ ఎంపీ సీటుకోసం ఎన్‌డీఏ కూటమిలోని
యుపిపిఎల్, కాంగ్రెస్, బిపిఎఫ్ పార్టీల అభ్యర్ధుల మధ్య త్రిముఖ పోటీ జరుగుతుంది.