Will Saffron Flag be able to hold Devbhoomi Uttarakhand?
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌లో అన్ని
స్థానాలకూ ఎన్నికలు జరుగుతున్న మరో రాష్ట్రం ఉత్తరాఖండ్. దేవభూమిగా వ్యవహరించే ఆ
రాష్ట్రంలో ఐదు లోక్‌సభ స్థానాలు ఉంటే, వాటన్నింటికీ రేపు శుక్రవారం పోలింగ్
జరగనుంది.
ఉత్తరాఖండ్‌లో ఐదు ఎంపీ సీట్లున్నాయి. తెహ్రీ
గఢ్వాల్, గఢ్వాల్, అల్మోరా, నైనిటాల్-ఉధంసింగ్‌నగర్, హరిద్వార్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో
ఆ ఐదు స్థానాలనూ భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకోగలిగింది. అప్పుడు 61.5శాతం
పోలింగ్ జరిగింది.
ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో
ఉండడం ఆ పార్టీకి సానుకూలాంశం. అంతేకాదు, గత నెలలో ఉత్తరాఖండ్ శాసనసభ యూనిఫామ్
సివిల్ కోడ్‌ను అమల్లోకి తీసుకొస్తూ చట్టం చేసింది. దాని ప్రభావం ప్రజల్లో ఎలా
ఉందన్న విషయం ఇప్పుడు జరిగే లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో తేలిపోతుంది. అందువల్లే ఈ
రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలను ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లో ప్రధానమైన నియోజకవర్గాల్లో మొదట
చెప్పుకోదగినది హరిద్వార్. రాష్ట్ర మాజీముఖ్యమంత్రి హరీష్ రావత్ ఈ ప్రాంతానికి
చెందినవారు. 2014 నుంచీ ఇక్కడ బీజేపీ కాషాయజెండా ఎగురుతోంది. హరిద్వార్ నియోజకవర్గం
1977 నుంచి 2009 వరకూ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉండేది. 2014లో ఈ
నియోజకవర్గంలో బీజేపీ మాజీ ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్ ఎంపీగా గెలిచారు. 2019లో
కూడా ఆయనే కాంగ్రెస్ అభ్యర్ధి అంబరీష్ కుమార్‌ను రెండున్నర లక్షలకు పైగా
మెజారిటీతో ఓడించారు. ఇప్పుడు 2024 ఎంపీ ఎన్నికలకు బీజేపీ తమ అభ్యర్ధిగా మాజీ
ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్‌ను మోహరించింది. కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ
సీఎం హరీష్ రావత్ కుమారుడు వీరేంద్ర రావత్ బరిలో ఉన్నారు.
గఢ్వాల్ నియోజకవర్గం ప్రత్యేకత ఏంటంటే అందులో ఐదు
జిల్లాల ప్రాంతాలున్నాయి. చమోలీ, పౌరీగఢ్వాల్, రుద్రప్రయాగ జిల్లాలు పూర్తిగానూ,
నైనిటాల్, తెహ్రీ గఢ్వాల్ జిల్లాల్లో కొన్నిభాగాలూ ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.
2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి భువనచంద్ర ఖండూరీ విజయం సాధించారు. 2019
ఎన్నికల్లో బిజెపి తరఫున తీరథ్ సింగ్ రావత్ పోటీచేసి గెలుపొందారు. ఇప్పుడు 2024లో
ఆ పార్టీ తరఫున అనిల్ బలూనీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి గణేష్ గోడియాల్‌తో
తలపడుతున్నారు.
ఉత్తరాఖండ్‌లో మరో ముఖ్యమైన ఎంపీ సీటు అల్మోరా.
2009నుంచీ ఆ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేసారు. అల్మోరా నియోజకవర్గం పరిధిలో
బాగేశ్వర్, చంపావత్, అల్మోరా, పితోరాగఢ్ అనే నాలుగు జిల్లాలున్నాయి. ఈ స్థానం
1952లో ఏర్పడినప్పటినుంచీ కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. కానీ 1996లో బీజేపీ ఈ
స్థానాన్ని కాంగ్రెస్ నుంచి లాగేసుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకూ, ఒక్క 2009లో
తప్ప, అన్నిసార్లూ బీజేపీయే విజయం సాధించింది. 2014, 2019 ఎన్నికల్లో బిజెపి తరఫున
అజయ్ తమటా విజయం సాధించారు. ఇప్పుడాయన మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు
ప్రయత్నిస్తున్నారు. గత రెండుసార్లూ అజయ్ చేతిలో ఓడిపోయిన ప్రదీప్ తమటాయే మూడోసారి
కూడా కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలబడుతున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల గురించి ఇప్పటివరకూ నిర్వహించిన
ప్రీపోల్ సర్వేలన్నీ ఉత్తరాఖండ్‌లోని 5 నియోజక వర్గాలనూ బీజేపీ స్వీప్ చేస్తుందని
అంచనా వేస్తున్నాయి. అయితే ఆ పరిస్థితిని మార్చడానికి కాంగ్రెస్ శ్రమిస్తోంది.