ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్
జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్
మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. ‘మేమంతా సిద్ధం యాత్ర’ లో భాగంగా సింగ్‌నగర్ వద్ద
ప్రసంగిస్తున్న సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది. దీంతో జగన్ ఎడమ కంటి పైభాగాన తాకడంతో
గాయమైంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వ్యక్తిగత వైద్య
సిబ్బంది ప్రాథమిక చికిత్స నిర్వహించగా గాయంతోనే జగన్ ప్రచార యాత్ర కొనసాగించారు.
క్యాట్‌బాల్ తో కొట్టినట్లుగా అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన
ప్రదేశంలో క్లూస్ టీమ్ విచారణ చేపట్టింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ
ఫుటేజిని పరిశీలిస్తున్నారు.
ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పక్కనే ఉన్న
ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటి వద్ద గాయమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, ఘటనా స్థలం
సమీపంలోని ఓ స్కూలు భవనం పై నుంచి దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు.గంగానమ్మ
గుడి, స్కూలు మధ్య భాగంలోని చెట్ల ప్రాంతంలో దాక్కుని కూడా రాయి విసిరే
అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడిని
పలువురు ప్రముఖులు ఖండించారు. జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు
ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. జగన్ సోదరి, ఏపీపీసీసీ చీఫ్ షర్మిల కూడా
స్పందించారు. దాడిని విచారకర, దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో
హింసకు తావులేదన్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన
దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.
దాడి వెనుక టీడీపీ హస్తం
ఉందని వైసీసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి దాడులతో ఎన్నికల్లో గెలవలేరని
మండిపడుతున్నారు.
రాయి
ఘటన వైసీపీ డ్రామా అంటూ టీడీపీ కొట్టిపారేసింది. వైసీపీ డ్రామాలు ప్రజలు నమ్మే
పరిస్థితిలో లేరని టీడీపీ నేతలు అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
మాత్రం వ్యంగ్యంగా స్పందించారు. ‘‘ రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్…?. ఇంకెక్కడి నుంచి వస్తా… తాడేపల్లి ప్యాలెస్ నుంచే
వచ్చా!’’ ఛలోక్తులు విసిరారు.