Congress MLA asks Party president permission to raise slogan for Bharat Mata
కాంగ్రెస్ పార్టీలోని నిజమైన దేశభక్తుల పరిస్థితి
ఇది. దేశమాతను కీర్తించడానికి సైతం అధినాయకత్వం అనుమతి తీసుకోవాలి. ఒకవైపు
పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినవారికి మద్దతుగా ఆ పార్టీ నాయకులు నిలబడతారు.
మరోవైపు భారత్‌మాతా కీ జై అంటే ఎలాంటి వేటు పడుతుందో తెలీదు. కర్ణాటక కాంగ్రెస్‌లో
పరిస్థితిఇది.
కలబురగిలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్
పార్టీ ఎన్నికల ప్రచారసభ నిర్వహించింది. అందులో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఆ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ సావడి కూడా
ఉన్నారు. ఆయన గతంలో బీజేపీలో ఉన్నప్పుడు యడ్యూరప్ప మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా
పనిచేసారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వనందుకు బీజేపీని వదిలి
కాంగ్రెస్‌లో చేరారు. కలబురగిలో నిర్వహించిన ప్రచార సభలో ప్రసంగించారు.
ఆ సందర్భంగా లక్ష్మణ్ సావడి మాట్లాడుతూ ‘‘భారత్
మాతా కీ జై’’ అని నినాదం ఇస్తానని సభకు హాజరైన ప్రజలకు చెప్పారు. అలా నినాదం
ఇవ్వడానికి తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుమతి కోరారు. ఆ నినాదం
పలుకుతున్నందుకు తన గురించి తప్పుగా అనుకోవద్దంటూ ఖర్గే ముందరి కాళ్ళకు బంధాలు
కూడా వేసారు. ‘‘నేను మీ ప్రజలందరికీ ఒకమాట చెప్పాలనుకుంటున్నాను. ఖర్గేజీ దయచేసి
తప్పుగా అర్ధం చేసుకోకండి. నేను బోలో భారత్‌మాతాకీ… అంటాను, ప్రజలు జైకొట్టాలి’’
అని లక్ష్మణ్ కోరారు.
భారతమాతకు జై కొట్టడానికి కాంగ్రెస్
ఎమ్మెల్యే తమ పార్టీ అధ్యక్షుడి అనుమతి కోరిన వీడియో విస్తృతంగా ప్రచారమైంది. దాంతో
ప్రజల్లోనూ ఒక ప్రశ్న తలెత్తింది. కొన్నాళ్ళ క్రితం కర్ణాటకలోనే కొందరు కాంగ్రెస్
నాయకులు బహిరంగంగానే పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసారు. వారికి మద్దతుగా
మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే నిలిచారు. అలాంటి వ్యక్తి తండ్రి
మల్లికార్జున ఖర్గే, భారతమాతకు జైకొట్టడానికి ఒప్పుకుంటారా అన్న అనుమానాలు
తలెత్తాయి.
ఈ సంఘటనపై బీజేపీ తీవ్రంగా ఆగ్రహం
వ్యక్తం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర స్పందిస్తూ ‘‘భారతమాతను
తలచుకోవాలన్నా, ఆమె పేరును నినాదంగా జపించాలన్నా, ఆఖరికి మనసులోని దేశభక్తి చాటుకోవాలనుకున్నా
కాంగ్రెస్ నేతలకు తమ అధిష్ఠానం నుంచి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. ఇది
దురదృష్టకరం, ప్రమాదకరం. లక్ష్మణ్ సావడి తన దేశభక్తిని నిరూపించుకునేందుకు ఒక
వ్యర్థ ప్రయత్నం చేసారు. అలాంటి పరిస్థితి మా పార్టీలో అయితే లేదు’’ అని తీవ్రంగా
విమర్శించారు. కాంగ్రెస్‌లో సాంస్కృతిక విభేదాలు ఏ స్థాయిలో ఉంటాయనడానికి ఈ ఉదంతమే
నిదర్శనమని వ్యాఖ్యానించారు.
కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక
కూడా లక్ష్మణ్ సావడి పరిస్థితిని విమర్శించారు. ‘‘పాకిస్తాన్ జిందాబాద్ అని
నినాదాలు చేసిన వారికి మద్దతుగా మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడడం చూసిన తర్వాత
లక్ష్మణ్ సావడికి కాంగ్రెస్ నిజమైన భావజాలం అర్ధమైంది. అందుకే ఆయన ఇప్పుడు ‘భారత్‌మాతా
కీ జై’ అని నినదించాలంటే భయపడుతున్నారు. దానికి ఖర్గే అనుమతి కోరుతున్నారు. మీరు ఏ
పార్టీలో ఐనా ఉండండి, భారతమాతకు జై కొట్టడానికి ఏ నాయకుడి అనుమతి తీసుకోవడమూ అక్కర్లేదు
లక్ష్మణ్ గారూ. వాళ్ళు దాన్ని తప్పుగా భావిస్తారంటే అనుకోనివ్వండి. భారత్‌మాతా కీ
జై’’ అంటూ అశోక ట్వీట్ చేసారు.
బీజేపీ నేతల విమర్శల
సంగతి ఎలా ఉన్నా, దేశమాతకు జై కొట్టడానికి స్వేచ్ఛ లేని పరిస్థితి కాంగ్రెస్‌లో
ఉందన్న సంగతి ఈ వ్యవహారంతో మరోసారి వెల్లడైంది.