19 killed in Pakistan for resisting robberies during
Ramzan
ఈ యేడాది రంజాన్ సమయంలో పాకిస్తాన్‌లోని కరాచీ
నగరంలో నేరాలు గతేడాదితో పోల్చుకుంటే ఒకమాదిరిగా తగ్గాయి. దోపిడీ ఘటనలను అడ్డుకునే క్రమంలో 19 మంది ప్రాణాలు
కోల్పోగా, 55 మంది గాయాల పాలయ్యారు.
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… కరాచీ
నగరంలో సాయుధులైన దుండగులు చేసిన దాడులను అడ్డుకుని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ 19మంది
పౌరులు ప్రాణాలు కోల్పోయారు, 55మందికి గాయాలయ్యాయి. గత సంవత్సరం దుండగులను అడ్డుకునే ప్రయత్నంలో 25మంది చనిపోయారు, 110 మంది గాయపడ్డారు.
ఈ యేడాది రంజాన్ సమయంలో దోపిడీ ఘటనలు, వాటిలో మరణాల
సంఖ్య గతేడాదితో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయనే చెప్పుకోవచ్చు. ఈ యేడాది కరాచీలో
దోపిడీ సంబంధిత హత్యలు 56 జరిగాయి, 200 మందికి పైగా గాయపడ్డారు. అదే గతేడాది దోపిడీ
సంబంధిత ఘటనల్లో 108 మంది ప్రాణాలు కోల్పోయారు, 469 మంది గాయపడ్డారు.
కరాచీ పోలీసులు ఈ సంవత్సరం ఇప్పటివరకూ 425
షూటౌట్స్‌లో పాల్గొన్నారు. వాటిలో 55మంది డెకాయిట్లు చనిపోయారు, 439 మంది గాయపడ్డారు.
సిటిజన్స్-పోలీస్ లయజన్ కమిటీ నివేదిక ప్రకారం 2024 మొదటి త్రైమాసికంలో 22,627
నేరాలు చోటుచేసుకున్నాయి. వాటిలో 59మంది మరణించారు. 700 మందికి పైగా ప్రజలు దొంగలను
అడ్డుకునే క్రమంలో గాయపడ్డారు.
ఈ యేడాది రంజాన్ పర్వదిన సమయంలో 373 కార్లు,
సుమారు 16వేల మోటార్ సైకిళ్ళు, 6102 మొబైల్ ఫోన్లు దొంగతనం జరిగాయి. 25 దోపిడీ
ఘటనలు చోటు చేసుకున్నాయి. డబ్బుల కోసం కిడ్నాపులు 5 నమోదయ్యాయి.
కరాచీ అదనపు ఐజీ ఇమ్రాన్ యాకూబ్ ఈ నేరాల్లో
చాలావాటికి కారణం నగరానికి బైటనుంచి వచ్చినవాళ్ళేనని తేల్చేసారు. సింధ్,
బలోచిస్తాన్ ప్రాంతాల నుంచి వచ్చిన వారే నగరంలో నేరాలకు పాల్పడుతున్నారని
చెప్పారు. రంజాన్, ఈద్-ఉల్-ఫితర్ పండుగల సమయంలో కరాచీలోకి సుమారు 4లక్షల మంది
ప్రొఫెషనల్ ముష్టివారు, నేరస్తులు వచ్చారని ఆయన చెప్పారు. విచిత్రం ఏంటంటే,
కరాచీలో రోజువారీ క్రైమ్ రేట్ 166 మాత్రమే. ఇది పాకిస్తాన్‌లోని మిగతా నగరాల కంటె
చాలా తక్కువ అని ఐజీ యాకూబ్ వివరించారు.