Calcutta High Court orders CBI probe in Sandeshkhali case
పశ్చిమబెంగాల్లో సంచలనాత్మక సందేశ్‌ఖాలీ కేసులో
కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ
ఆదేశించింది. ఆ కేసులో స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేతలు భూకబ్జాలు, లైంగిక వేధింపుల
ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఆ కేసులో హైకోర్టు తీర్పునిస్తూ సందేశ్‌ఖాలీ
వివాదంపై నిశిత విచారణ జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలనీ సీబీఐని ఆదేశించింది.
మరీ నిర్దిష్టంగా, హిందూ మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపైనా, చేపల సాగు పేరుతో
భూమిని అక్రమంగా బదలాయింపు చేసే కుంభకోణాల పైనా దృష్టి సారించాలని స్పష్టం
చేసింది. భూ ఆక్రమణల ఆరోపణలపై విచారణ కోసం వెళ్ళిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
అధికారులపై దాడులు చేసిన ఘటన నేపథ్యంలో ఈ కేసు విచారణ విషయంలో న్యాయస్థానం మరింత
పట్టుదలగా ఉంది.
ఈ కేసులోని సంక్లిష్టతల కారణంగా నిష్పాక్షికమైన
విచారణ జరపాలని హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. సీబీఐ దర్యాప్తుకు
పూర్తిస్థాయిలో సహకారం అందించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుకు
సంబంధించి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేకంగా ఒక వెబ్‌పోర్టల్ లేదా ఇ-మెయిల్
ఐడీ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
సందేశ్‌ఖాలీ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు, ఎల్ఈడీ
వీధిదీపాలూ 15 రోజుల్లోగా అమర్చాలని కోర్టు ప్రత్యేకంగా ఆదేశించింది. ఈ పనిని
ప్రాధాన్యతాంశంగా పరిగణించాలనీ, దానికి కావలసిన నిధులను రాష్ట్రప్రభుత్వమే
సమకూర్చాలనీ స్పష్టంగా తేల్చిచెప్పింది.
సందేశ్‌ఖాలీకి చెందిన తృణమూల్ నాయకుడు షేక్
షాజహాన్ అక్రమాలపై విచారణ జరిపేందుకు కొన్ని నెలల క్రితం ఈడీ అధికారులు అక్కడకు వెళ్ళారు.
ఆ సమయంలో వారిపై షాజహాన్ అనుచరులు దాడి చేయడం సంచలనం సృష్టించింది. అంతలో అక్కడి హిందూ
మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి షాజహాన్, అతని అనుచరులు నియోజకవర్గ పరిధిలోని
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలను బైటపెట్టారు.
ఆ విధంగా షేక్ షాజహాన్
బృందం అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత కూడా షాజహాన్‌ను అరెస్ట్ చేయకుండా
మమతా బెనర్జీ ప్రభుత్వం, పోలీసులు చాలా తాత్సారం చేసారు. కోర్టు జోక్యం తర్వాతనే
అతన్ని అరెస్ట్ చేసారు. ఇప్పటికీ మమతా బెనర్జీ పార్టీ షేక్ షాజహాన్‌ను నామమాత్రంగా
సస్పెండ్ చేసినా, అతన్ని రక్షించడానికి అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తూనే ఉంది. ఈ
నేపథ్యంలో సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.