Akshaya Patra Foundation sets record of serving 4billion
meals till date
అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ‘ఇస్కాన్’
నిర్వహిస్తున్న ‘అక్షయపాత్ర ఫౌండేషన్’ గొప్ప రికార్డు సృష్టించింది. ఆ సంస్థ ఇప్పటివరకూ
4వందలకోట్లమందికి ఆహారాన్ని అందించింది. ఆ మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఆ
సంస్థను ఐక్యరాజ్యసమితి ఘనంగా ప్రశంసించింది.
ఐక్యరాజ్యసమితిలో భారతదేశపు శాశ్వత మిషన్, న్యూయార్క్‌లోని
యూఎన్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నాడు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ‘ఆహార
భద్రతలో విజయాలు – సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ ముందడుగు’ పేరిట ఆ
కార్యక్రమం నిర్వహించింది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, నోబెల్
బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, అక్షయపాత్ర ఫౌండేషన్ ఛైర్మన్ మధుపండిట్ దాస్ ఆ
కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ తన సందేశంలో అక్షయపాత్ర
సాధించిన ఘనతకు అభినందనలు తెలిపారు.‘‘ఆకలిని రూపుమాపడానికి, మానవాళి కడుపు
నింపడానికీ ఏమాత్రం తొణకని నిబద్ధతతో మీరు చేస్తున్న కృషికి నిదర్శనమే ఈ విజయం.
ప్రపంచానికి భవిష్యత్తు అయిన పిల్లలకు మంచి పోషణ ఉండాలనే ఉద్దేశంతో అక్షయపాత్ర
ఫౌండేషన్ కోట్లాదిమంది పిల్లలకు ఆహారం అందిస్తోంది. 2019 ఫిబ్రవరిలో 300కోట్ల మందికి
ఆహారం అందించిన సందర్భాన్ని ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో నిర్వహించినప్పుడు ఆ
కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు దక్కింది. ప్రపంచంలో అందరి బాగూ కోరే మీ
ప్రయత్నానికి అంతర్జాతీయ వ్యాప్తి లభించిందనడానికి తార్కాణం ఐక్యరాజ్యసమితి ఈ ఘనతను
గుర్తించడమే’’ అని మోదీ తన సందేశంలో ప్రశంసించారు.
అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలను నోబెల్ పురస్కార గ్రహీత
కైలాష్ సత్యార్థి అభినందించారు. 400 కోట్ల మందికి ఆహారం పెట్టడం మామూలు విషయం
కాదన్నారు. తోటి మనుషులపై సహజంగా ఉండాల్సిన సహానుభూతి నానాటికీ ప్రపంచవ్యాప్తంగా
కుంచించుకుపోతోందని కైలాష్ సత్యార్థి ఆవేదన వ్యక్తం చేసారు. ‘‘సహానుభూతిని ప్రపంచమంతటా
వ్యాపింపజేయడానికి భారత్ నాయకత్వం వహిస్తుంది. ఆ పని భారత్ చేయలేకపోతే, మరే దేశమూ
చేయలేదు’’ అని కైలాష్ వ్యాఖ్యానించారు.
అక్షయపాత్ర స్ఫూర్తిని ప్రపంచదేశాలు
అందిపుచ్చుకోవాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అన్నారు. ‘‘అక్షయపాత్ర అనుసరిస్తున్న నమూనాను
అన్ని దేశాలూ అనుసరించాలి. తమతమ దేశాల్లోని పేద పిల్లల జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం,
ఆశ, ఆత్మవిశ్వాసం నింపి వారిని విజయాలు సాధించేలా ప్రోత్సహించాలి’’ అని సూచించారు.
‘‘మంచి పనులు భారతదేశంలో బాగా జరుగుతాయి అన్న విశ్వాసాన్ని అక్షయపాత్ర మరింత
బలపరిచింది’’ అని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. పరిశుభ్రమైన ఆహారాన్ని వేడివేడిగా
అందజేయడంలో అక్షయపాత్ర తీసుకునే సాంకేతికత సహకారాన్ని ఆయన ప్రశంసించారు.
ఆ సందర్భంగా అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్
మధుపండిట్ దాస్ మాట్లాడుతూ ప్రపంచంలో పేదరిక నిర్మూలనకు జరిగే ప్రయత్నాలకు తమ
తోడ్పాటు ఉంటుందన్నారు. పెద్దమొత్తంలో ఆహారం వండి పంపిణీ చేయాలని భావించే ఏ
సంస్థకైనా తమ అనుభవాలు సహాయపడతాయంటే వివరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇక
ఏ దేశమైనా ఇలాంటి సేవాకార్యక్రమాలు చేయడానికి పిలిస్తే ఆ బాధ్యత స్వీకరించడానికి
కూడా అక్షయపాత్ర సిద్ధంగా ఉందని చెప్పారు.
బువ్వ లేక బడికి దూరమయ్యే పిల్లలు చదువుకు చేరువ కావాలంటే వారికి మధ్యాహ్న
భోజనం అందాలని గుర్తించిన ఇస్కాన్, 2000 సంవత్సరంలో అక్షయపాత్ర ఫౌండేషన్‌ను
ప్రారంభించింది. మొదట బెంగళూరులోని ఐదు పాఠశాలల్లో 1500 మంది పిల్లలకు అన్నం
పెట్టడంతో ఈ యజ్ఞం ప్రారంభమైంది. నాటి నుంచీ నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది.
కోవిడ్ మహమ్మారి సమయంలో ఇస్కాన్ ఫౌండేషన్ 25కోట్లమందికి అన్నం పెట్టింది. కొన్నేళ్ళ
క్రితం భూకంపం నేపాల్‌ను దెబ్బతీసినప్పుడు అక్కడి అన్నార్తుల ఆకలి తీర్చడానికి
ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేసింది. తాజాగా తుర్కియే దేశం భూకంపం ధాటికి చిగురుటాకులా
వణికిపోయినప్పుడు అక్కడి బాధితులకు ఆహారం, కిరాణా సరుకులు, హైజీన్ కిట్స్ సరఫరా
చేసింది. ఇప్పుడు యుద్ధం కారణంగా ఆహార భద్రత సవాళ్ళను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ దేశ
ప్రజలకు కూడా తమ సేవలు అందిస్తున్నట్లు మధుపండిట్ దాస్ వెల్లడించారు.
అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రస్తుతం దేశంలో 72 కిచెన్లను నిర్వహిస్తోంది.
వాటిద్వారా ప్రతీరోజూ దేశంలోని 24వేల పాఠశాలల్లో 21లక్షల మంది విద్యార్ధులకు
మధ్యాహ్న భోజనం అందిస్తోంది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు