People lured into Christianity with promise of Rs 50Kand
job
క్రైస్తవ మతమార్పిడి ముఠా ఆగడాలు రోజుకొకటి
వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఒక మతమార్పిడి ముఠా డబ్బుల ఆశ చూపించి
మతం మార్చడానికి ఏకంగా 110 మందిని తీసుకువెడుతూ పట్టుబడింది. విషయం తెలుసుకున్న
పోలీసులు, ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసారు.
క్రైస్తవుడిగా మతం మారితే మనిషికి 50వేల రూపాయలు ఇస్తామంటూ
ఒక ముఠా ఏకంగా 110 మంది హిందువులను ప్రలోభపెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్
జిల్లా నవాబ్‌గంజ్ వద్ద వారందరినీ రెండు బస్సుల్లో ఎక్కించింది. ఉన్నావ్‌లోని ఒక
చర్చిలో వాళ్ళను మతం మార్చాలన్నది ఆ ముఠా పథకం.
మతమార్పిడి ముఠా కార్యకలాపాల గురించి స్థానిక
బజరంగ్దళ్ బృందానికి విషయం తెలిసింది. కొందరు పాస్టర్లు మత మార్పిడులకు పాల్పడుతున్నారని
కచ్చితమైన సమాచారం అందింది. వారు వెంటనే నవాబ్‌గంజ్ వద్ద సిద్ధంగా ఉన్న బస్సులను
చేరుకున్నారు. బస్సుల్లో ఉన్న ప్రయాణికులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. వెంటనే
స్థానిక పోలీసులను అప్రమత్తం చేసారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి
చేరుకున్నారు.
కాన్పూర్ జిల్లాలోని అర్మాపూర్ ప్రాంత నివాసి
అయిన సంజయ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దాని ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్
నమోదు చేసారు. సంజయ్ నిజానికి బదౌన్ జిల్లాలోని బిల్సీ గ్రామానికి చెందిన వాడు.
ఉపాధి కోసం అర్మాపూర్లో ఉంటున్నాడు. అక్కడ నోయెల్ విలియమ్స్, దీపక్ మోరిస్ అనే ఇద్దరు
వ్యక్తులతో అతనికి పరిచయం ఏర్పడింది. వారు అతన్ని క్రైస్తవమతంలోకి మారాలంటూ
ఒత్తిడి చేసారు. ఏసుక్రీస్తును ప్రార్థిస్తే అతని సమస్యలన్నీ తీరిపోతాయని మాట
ఇచ్చారు.
వారి బ్రెయిన్‌వాష్ ఫలితంగా తన భార్య తనతో ఉండడం
మానేసిందని సంజయ్ చెప్పుకొచ్చాడు. కుటుంబ ఒత్తిడితో గత్యంతరం లేని పరిస్థితిలో మతం
మారడానికి సంజయ్ సిద్ధపడ్డాడు. పైగా, వారు అతనికి రూ.50వేల నగదు ఇస్తామని, ఉద్యోగం
కూడా ఇప్పిస్తామనీ ఆశ చూపారు. దాంతో అతను బస్సెక్కడానికి సిద్ధపడ్డాడు.
మార్చి 30 శనివారం అర్ధరాత్రి ఒంటిగంట దాటిన
తర్వాత ఆ బస్సులు బయల్దేరబోతుండగా పోలీసులు అటకాయించారు. రెండు బస్సుల్లో సుమారు
110 మందిని ఉన్నావ్‌లోని చర్చిలో మతం మార్చడానికి తీసుకువెడుతున్నట్లు పోలీసులు
గ్రహించారు. వారందరినీ డబ్బులిస్తామని ప్రలోభపెట్టారని వెల్లడైంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నోయెల్ విలియమ్స్,
దీపక్ మోరిస్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసారు.