India’s defence exports cross Rs 21000 crore mark
స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారి రక్షణ రంగంలో
మన ఎగుమతుల విలువ రూ.21వేల కోట్లు దాటింది. ఆ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి
రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
‘‘భారతదేశపు రక్షణ రంగ ఎగుమతులు ఇంతకుముందెన్నడూ
లేనంత ఎత్తులకు ఎగబాకాయి. రూ.21000 కోట్ల స్థాయిని దాటాయి. స్వతంత్ర భారతదేశ
చరిత్రలో మొట్టమొదటిసారిగా మన దేశపు రక్షణ రంగ ఎగుమతుల విలువ 2023-24 ఆర్థిక
సంవత్సరంలో రూ.21,083 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 32.5శాతం
అద్భుతమైన అభివృద్ధి’’ అంటూ రాజ్‌నాథ్ సింగ్ తన ‘ఎక్స్’ సోషల్ మీడియా అకౌంట్‌లో
ప్రకటించారు.
భారతదేశ రక్షణ రంగ ఉత్పత్తులను 84 కంటె ఎక్కువ
దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ అద్భుత అభివృద్ధికి ప్రధాన కారణం మన దేశపు
ఉమ్మడి ప్రయత్నాలూ, మన రక్షణ శాఖ వ్యూహాత్మక చర్యలే. ప్రత్యేకించి, ప్రధానమంత్రి
నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం రక్షణ ఉత్పాదక రంగంలో మన దేశపు
సామర్థ్యాన్ని, దేశీయంగా రక్షణ రంగంలో ఉత్పాదకతను ప్రోత్సహిస్తోంది.
భారత ప్రభుత్వ రక్షణ శాఖ తీసుకున్న చర్యల వల్ల రక్షణ
అవసరాల ఉత్పాదక రంగం సాంకేతికంగా గణనీయమైన పురోగతి సాధించింది. అంతేకాదు, దేశీయ
రక్షణ రంగ ఎగుమతులను పెంచడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని సంస్థలకు తగిన సానుకూల
వాతావరణాన్ని కూడా సృష్టించింది.
రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ సాధించిన ఈ ఘన
విజయంలో సుమారు 50 వరకూ భారతీయ కంపెనీల సమష్టి కృషి ఉంది. ఆయా కంపెనీల నిరంతర శ్రమ,
సృజనాత్మకత, సమర్థత, నాణ్యతా ప్రమాణాల కారణంగానే, ఆ రంగంలో మన దేశపు పేరుప్రతిష్ఠలు
ఇనుమడించాయి.
భారత్ ప్రస్తుతం రక్షణ రంగ ఉత్పత్తులు
ప్రపంచంలోని నలువైపులా విస్తరించాయి. ఇటలీ, మాల్దీవులు, శ్రీలంక, రష్యా, యుఎఇ,
పోలండ్, ఫిలిప్పైన్స్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇజ్రాయెల్, స్పెయిన్, చిలీ తదితర
దేశాలు మన రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి.
ఇలా మన రక్షణ రంగ ఉత్పత్తులు వివిధ దేశాలకు
విస్తరించడం వల్ల, వాటి ప్రమాణాలు బాగుండడం వల్ల వాటికి డిమాండ్ నానాటికీ
పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల రక్షణ అవసరాలను తీర్చగలిగేలా
ఉత్పత్తులు తయారుచేయడం, వాటిని సమర్థంగా సకాలంలో ఎగుమతి చేయడంలో భారతీయ సంస్థలు మంచిపేరు
గడించాయి.
భారతీయ కంపెనీల ఉత్పత్తుల్లో ప్రధానంగా వ్యక్తిగత
రక్షణ ఉపకరణాలు, ఆఫ్‌షోర్ పెట్రోల్ వాహనాలు, ఎఎల్‌హెచ్ హెలికాప్టర్లు, ఎస్‌యు
ఏవియానిక్స్, తీరప్రాంత నిఘా వ్యవస్థలు, తేలికపాటి ఇంజనీరింగ్ మెకానికల్ పార్ట్స్,
కవచ్ వ్యవస్థ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి.
ఈ అత్యాధునిక రక్షణ సాంకేతికతలు, పరికరాలకు
అంతర్జాతీయ కొనుగోలుదార్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తద్వారా డిఫెన్స్ హార్డ్‌వేర్
ఎగుమతుల్లో భారత్ గొప్ప ఎగుమతిదారుగా నిలుస్తోంది.