IT department notices to Congress for payment of Rs 1700
Crores
నాలుగు సంవత్సరాలకు ఆదాయపుపన్ను బాకీలు రూ. 1700
కోట్లు కట్టాలంటూ కాంగ్రెస్ పార్టీకి ఆదాయపుపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. తమ
పార్టీకి పన్ను నోటీసులు జారీచేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను
ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన మరునాడే, తాజా నోటీసులు జారీ అయ్యాయి.
2017-18 నుంచి 2020-21 నాలుగు ఆర్థిక సంవత్సరాలకు
చెల్లించవలసిన పన్ను, చెల్లించనందుకు జరిమానా, పన్ను మొత్తంపై వడ్డీ అన్నీ కలిపి
రూ. 1700 కోట్లు కట్టాలంటూ ఆదాయపుపన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ నోటీసులు జారీ
చేసింది. ఇప్పటికే ఆదాయపుపన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి రూ.200కోట్ల జరిమానా
విధించి, పార్టీ ఖాతాలను స్తంభింపజేసింది.
ఆదాయపుపన్ను శాఖ జారీ చేసిన నోటీసులను సవాల్
చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను
ఢిల్లీ హైకోర్టు నిన్న గురువారం కొట్టివేసింది. సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐటీ
శాఖ తమకు నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే అంటూ కాంగ్రెస్ పార్టీ
చేసిన ఆరోపణలను న్యాయస్థానం తిరస్కరించింది. దాంతో వచ్చేవారం సుప్రీంకోర్టును
ఆశ్రయించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఆదాయపుపన్ను రిటర్నులు లోపభూయిష్టంగా
ఉన్నాయంటూ ఆదాయపుపన్నుశాఖ ఫిబ్రవరి నెలలో రూ.200 కోట్లు జరిమానా కట్టాలని ఆ
పార్టీని ఆదేశించింది. ఇన్‌కంట్యాక్స్ అప్పెలేట్ ట్రిబ్యునల్ సైతం, పాత బాకీలు
కట్టేయాల్సిందేనంటూ ఆదేశించింది. ఆ మేరకు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను
స్తంభింపజేసింది.