ED alleges Arvind Kejriwal is the kingpin of Delhi
Liquor Policy Scam
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో సూత్రధారి, ప్రధాన
కుట్రదారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలేనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్,
న్యాయస్థానానికి తెలియజేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడిని పది రోజుల కస్టడీకి
తమకు అప్పగించాలని వాదించింది.
మద్యం పాలసీ కుంభకోణంలో ‘దక్షిణాది గ్రూప్’కు,
ఇతర నిందితులకూ మధ్యవర్తిగా వ్యవహరించింది స్వయానా కేజ్రీవాలేనని ఈడీ కోర్టుకు
తెలిపింది. ఆ కుంభకోణం మొత్తం విలువ 600 కోట్ల పైమాటేనని చెప్పింది. అందులో ముందుగా
వంద కోట్లను సౌత్ గ్రూప్‌లో భాగస్వామి అయిన బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత
చెల్లించిందని ఈడీ కోర్టుకు చెప్పింది. కవితను గతవారంలోనే ఈడీ అరెస్ట్ చేసింది.
ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టయిన మొదటి
వ్యక్తిగా భారతదేశంలో రికార్డు సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్, తన మీద ఈడీ చేసిన
అన్ని ఆరోపణలనూ త్రోసిపుచ్చారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వొకేట్, కాంగ్రెస్
నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తున్నారు. అక్రమంగా చెల్లింపులు జరిగాయని
చెబుతున్న ఈడీ ఇప్పటివరకూ ఒక్క రూపాయినైనా పట్టుకోలేకపోయిందని కేజ్రీవాల్, ఆయన
పార్టీ నాయకులూ వాదిస్తున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను నిన్న అరెస్ట్
చేసిన ఈడీ, ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్ట్‌లో ప్రవేశపెట్టింది. ‘‘పాలసీ అమలులో, సౌత్
గ్రూప్‌కు లబ్ధి చేకూర్చడంలో ఆయన ప్రమేయం ప్రత్యక్షంగా ఉంది. లబ్ధి చేకూర్చినందుకు
బదులుగా ఆయన భారీమొత్తంలో లంచాలు అడిగాడు. పలువురి ప్రకటనలను కలిపి చూసినప్పుడు ఆ
విషయం స్పష్టమయింది’’ అని ఈడీ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు
న్యాయస్థానానికి చెప్పారు.
ఈ స్కామ్ ద్వారా సంపాదించిన లంచాల్లో రూ.45
కోట్లను 2022 గోవా, పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసిందని ఈడీ
ఆరోపించింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఆప్, జాతీయపార్టీ హోదా
పొందగలిగింది.
‘‘గోవాకు డబ్బు నాలుగు మార్గాల్లో తరలించారు. ఆప్
అభ్యర్ధుల్లో ఒకరు చెప్పిన వివరాలు మా ఆరోపణలకు ఊతమిస్తున్నాయి. ఆ వ్యక్తికి నగదు
రూపంలో చెల్లింపులు జరిగాయి’’ అని ఈడీ చెప్పింది. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అన్ని
వ్యవహారాలకూ బాధ్యుడు కేజ్రీవాలే, ఆయన ఉద్దేశపూర్వకంగానే 9 సార్లు సమన్లకు
స్పందించలేదు’’ అని ఈడీ న్యాయస్థానానికి వెల్లడించింది.