ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పెట్టుకున్న పిటిషన్ ఉపసంహరించుకున్నారు. తన అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ సర్వోన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవడంతో, ఈడీ అధికారులు ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. సీఎం కేజ్రీవాల్ పిటిషన్ మేరకు, విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంది. అయితే ట్రయల్ కోర్టులో కేసు నడుస్తున్నందున, క్లాష్ అయ్యే అవకాశముందని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిప్రాయపడ్డారు. దీంతో పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.
ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించిన తరవాత, ఆప్ అధినేత సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కాసేపట్లో కేజ్రీవాల్‌ను ట్రయల్ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. ఈడీ అధికారులు కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. కోర్టు అనుమతిస్తే కేజ్రీవాల్‌ను ఈడీ విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకునే అవకాశముంది.