ఢిల్లీ మద్యం కుంభకోణం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. సార్వత్రిక ఎన్నికలు అతి సమీపంలో ఉండగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత, ఆప్ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాతోపాటు ఈడీ పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆప్ నేతలు దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్, ఢిల్లీల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
ఢిల్లీ మద్యం పాలసీ తయారీలో వందల కోట్లు చేతులు మారాయని 2022 ఆగష్టు 17న సీబీఐ మొదటిసారి కేసు నమోదు చేసింది. అప్పటి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. కొందరికి ప్రయోజనం చూకూర్చే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలు ముడుపులు తీసుకుని మద్యం పాలసీని, వారికి అనుకూలంగా రూపొందించారనేది ప్రధాన ఆరోపణ.
మద్యం పాలసీ తయారీలో సౌత్‌గ్రూప్‌నకు చెందిన శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలసి ఆప్ నేతలు కుట్రపన్నారని ఈడీ ఆరోపిస్తోంది. మద్యం పాలసీ అనుకూలంగా రూపొందించేందుకు ఈ గ్రూప్ ఆప్ నేతలకు వంద కోట్లు ముడుపులు చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సీఎం కేజ్రీవాల్‌తో కలసి భారాస ఎమ్మెల్సీ కవిత కుట్రకు తెరలేపి, తరవాత ఆప్ నేతలకు ముడుపులు ఇచ్చినట్లు ఈడీ విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
ఢిల్లీ మద్యం పాలసీకి గండి కొట్టడం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన రూ.2873 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని ఈడీ చెబుతోంది. టోకు వర్తకులు 12 శాతం, చిల్లర వ్యాపారులు 185 శాతం లాభం పొందేలా ఢిల్లీ మద్యం విధానాన్ని అనుకూలంగా మార్పులు చేసుకున్నారని, ఇందుకు ఆప్ నేతలు వందల కోట్ల ముడుపులు తీసుకున్నట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో కీలక సూత్రధారులను అరెస్ట్ చేసిన ఈడీ, తాజాగా సీఎం కేజ్రీవాల్‌ను కూడా అదుపులోకి తీసుకుంది.