Hamas top
commander killed in Israel Air Strike
ఇజ్రాయెల్ గగనతల దాడిలో హమాస్ ఉగ్రవాద
సంస్థ అగ్రస్థాయి నేత, కమాండర్ మారవాన్ ఇస్సా హతమయ్యాడు. ఆ విషయాన్ని పాలస్తీనా
ఇంకా ధ్రువీకరించలేదు కానీ అమెరికా ప్రకటించింది.
‘‘హమాస్‌పై చేస్తున్న పోరాటంలో
ఇజ్రాయెల్ పురోగతి సాధించింది. ఉగ్రవాదుల ప్రధాన దళాలను నాశనం చేసింది. ఇజ్రాయెల్
గతవారం చేపట్టిన గగనతల దాడుల్లో భారీసంఖ్యలో హమాస్ మిలిటెంట్లను హతమార్చింది.
హమాస్‌లో మూడవ ర్యాంక్ కమాండర్ మారవాన్ ఇస్సా హతమయ్యాడు. మిగతా అగ్రస్థాయి
కమాండర్లు సొరంగాల్లో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు’’ అని అమెరికా జాతీయ
భద్రతా సలహాదారు జేక్ సలివాన్ వెల్లడించారు.
హమాస్ ఆకస్మిక దాడితో మొదలైన
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం సుమారు 5 నెలలుగా కొనసాగుతోంది. ఇన్నాళ్ళకు ఇజ్రాయెల్,
హమాస్ అగ్రస్థాయి నేతను ఒకడిని హతమార్చగలిగింది. సెంట్రల్ గాజా ప్రాంతంలో ఓ సొరంగంలో
దాగివున్న మారవాన్ ఇస్సాను మార్చి 11న తుదముట్టించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు
ఇంకా నిర్ధారణ కావలసి ఉంది.
మరోవైపు, ఇజ్రాయెల్ చేస్తున్న
యుద్ధాన్ని పూర్తిగా సమర్ధించలేని పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
కొన్నాళ్ళుగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడడం మానేసారు.
ఎట్టకేలకు నిన్న సోమవారం నాడు ఇద్దరు నేతలూ ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. రఫా
ప్రాంతంలోని శరణార్థుల గురించి నేతలిద్దరూ చర్చించినట్లు సమాచారం. అక్కడ నానాటికీ
పరిస్థితులు దిగజారుతున్న తరుణంలో రఫాలో యుద్ధ ప్రణాళికల కోసం అధికారులను అమెరికా
పంపించడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒప్పుకున్నారని ప్రకటించారు.