విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మగుడిలో అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు అమ్ముతోన్న టికెట్లను రీసైక్లింగ్ చేస్తూ కొందరు ఉద్యోగులు లక్షలు కొల్లగొడుతున్నారు. పాలకమండలి అండదండలతోనే రూ.500 టికెట్లు రీసైక్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పాలకమండలి అనుచరులు, బంధువులు వందలాది మంది ఉచితంగా అంతరాయ దర్శనాలకు తరలి వెళుతున్నా, అధికారులు నోరు మెదపడం లేదు.
కొందరు పాలకమండలికి చెందిన వారి బంధువులు ఇటీవల రూ.500 క్యూలైనులోకి చొచ్చుకెళ్లారు. సిబ్బంది ప్రశ్నించగా పాలకమండలి సభ్యుడి బంధువులమంటూ కేకలు వేశారు. దీంతో సిబ్బంది ఈవోకు ఫిర్యాదు చేయడంతో రూ.500 టికెట్ల రీసైక్లింగ్ మాఫియా కూడా వెలుగులోకి వచ్చింది. అమ్మిన టికెట్లకు, దర్శనానికి వచ్చిన వారి సంఖ్యకు పొంతన లేకపోవడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల కొందరు భక్తులు అధికార లాంఛనాలతో దర్శనం కల్పిచాలంటూ బెదిరింపులకు దిగారు. తాము పాలకమండలి సభ్యుల బంధువులమంటూ చెప్పారు. అయినా అక్కడున్న ఏఈవో అంగీకరించలేదు. కేవలం పాలకమండలి సభ్యులకు మాత్రమే అధికార లాంఛనాలతో దర్శనాలుంటాయని చెప్పాడు. దీంతో వారు సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. ఇలాంటి అరాచకాలు ఎన్ని జరుగుతున్నా, పాలకమండలి మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.