రాజకీయ పార్టీల ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు అందించిన వారి వివరాలు పూర్తిగా ఎందుకు ఇవ్వలేదంటూ ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఎస్‌బిఐకి సర్వోన్నత న్యాయస్థానం తాజాగా నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల బాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేసింది. బాండ్ల నెంబర్లను తమకు చెప్పలేదని సీఈసీ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ సీజేఐ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. బాండ్ల నెంబర్లు ఇవ్వకపోవడంతో ఎవరు, ఎవరికి ఎంత ఇచ్చారనే స్పష్టత లేదని సీఈసీ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పినా ఎందుకు ఇవ్వలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
కోర్టు ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో కూడా వివరణ ఇవ్వాలని ఎస్‌బిఐ అధికారులను ధర్మాసనం ఆదేశించింది. వచ్చే సోమవారం నాటికి అన్ని వివరాలు సీఈసీకి అందించాలని స్పష్టం చేసింది.