సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సీఏఏ అమలుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన మరోసారి స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో సీఏఏను వెనక్కు తీసుకునే ప్రశ్నే లేదన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ దేశాల్లో పీడనకు గురైన ముస్లిమేతరుల కోసమే సీఏఏ తీసుకువచ్చినట్లు ఆయన మరోసారి గుర్తు చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదన్నారు.
రాజ్యాంగం ప్రకారం ఎవరైనా భారత వాతసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ముస్లింలు అందుకు మినహాయింపు కాదన్నారు. భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోకుండా ఎలాంటి నిషేధం విదించలేదన్నారు. ఏ ఒక్క పౌరుడి హక్కులను సీఏఏ హరించదని అమిత్ షా కుండబద్దలు కొట్టారు. సీఏఏ గురించి ఏ వర్గం భయపడాల్సిన పనిలేదన్నారు.
సీఏఏపై ఆందోళనలు పెరిగితే వెనక్కు తగ్గుతారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు అమిత్ షా ఘాటుగా స్పందించారు. ఎన్నటికీ వెనక్కు తీసుకోమని సూటిగా చెప్పారు. అధికారంలోకి వస్తే సీఏఏ రద్దు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. వారు ఎప్పటికీ ఇక కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని షా చురకలు వేశారు. మోదీ సర్కార్ తీసుకువచ్చిన చట్టాన్ని, ఎవరూ రద్దు చేయలేరని షా స్పష్టం చేశారు.