సముద్రపు దొంగలు రెచ్చిపోయారు. ఈసారి హిందూమహాసముద్రంలో బంగ్లాదేశ్‌కు చెందిన నౌకను హైజాక్ చేశారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు నౌక యాజమాన్యం ప్రకటించింది. హైజాక్ చేసిన నౌకను దుండగులు సోమాలియా వైపు తీసుకెళుతున్నట్లు సమాచారం అందుతోంది. అబ్దుల్లా అనే కార్గో నౌక మొజాంబిక్‌లో బొగ్గు నింపుకుని యూఏఈ వైపు వెళుతుండగా హైజాక్‌కు గురైంది.
అబ్దుల్లా నౌక హిందూ మహాసముద్రంలో ప్రయాణం చేస్తుండగా దుండగులు ప్రవేశించారు. మారణాయుధాలతో సిబ్బందిని బెదిరించి, నౌకను దారిమళ్లించినట్లు తెలుస్తోంది. నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నారు. వారంతా ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నట్లు నౌక యాజమాన్యం ప్రకటించింది. 14 సంవత్సరాల కిందట కూడా బంగ్లాదేశ్ ఓ రవాణా నౌక హైజాక్‌కు గురైంది. అప్పట్లో వంద రోజుల తరవాత విడిచిపెట్టారు. అబ్దుల్లా నౌకను ఎవరు హైజాక్ చేశారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. సోమాలియాకు చెందిన పైరేట్లు హైజాక్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.