DMK Former Leader Arrested in Rs2000 Crores Drugs Racket Case
భారతదేశం,
ఆస్ట్రేలియా, న్యూజీలాండ్లలో డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఆరోపణల మీద
డీఎంకే ఎన్ఆర్ఐ విభాగం మాజీ నాయకుడు, సినీ నిర్మాత జాఫర్ సాదిక్‌ను నార్కోటిక్స్
కంట్రోల్ బ్యూరో ఇవాళ అరెస్ట్ చేసింది. ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం వారంరోజుల
పాటు మాటువేసి అతన్ని పట్టుకుంది. ఈ అరెస్టుతో అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్
సిండికేట్‌కు పెద్ద ఎదురుదెబ్బే తగిలింది.
జాఫర్ సాదిక్
ఒకప్పుడు డీఎంకేలో క్రియాశీలంగా ఉండేవాడు. అయితే మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారంలో
అతని ప్రమేయం గురించి వెలుగు చూడడంతో అధిష్థానం అతన్ని పార్టీ నుంచి
బహిష్కరించింది. అతని అరెస్టుతో రెండువేల కోట్ల రూపాయల భారీ డ్రగ్ రాకెట్ మూలాలు
బైటపడతాయని అధికారులు ఆశిస్తున్నారు. డ్రగ్స్ రాకెట్లో ఉన్న ప్రతీఒక్కరి పేర్లతో
పాటు వారి మిగతా అక్రమ కార్యకలాపాల గురించి కూడా జాఫర్ చెబుతాడని ఎన్సీబీ
అధికారులు అంచనా వేస్తున్నారు.
గతవారమే సాదిక్ అనుచరులు
ముగ్గురు ఢిల్లీలో పట్టుపడ్డారు. మాదకద్రవ్యాల తయారీలో ఉపయోగించే సూడోఫెడ్రిన్ అనే
పదార్ధం 50కేజీలు వారిదగ్గర దొరికింది. ఎన్సీబీ అధికారులు
చెప్పిన వివరాల ప్రకారం జాఫర్ సాదిక్ అనుచరులు, మనుషులూ కలిసి గత మూడేళ్ళలో
అంతర్జాతీయ మార్కెట్లో 2వేల కోట్లకు పైగా విలువ చేసే సుమారు 3500 కేజీల
సూడోఫెడ్రిన్ పదార్ధాన్ని 45 కన్సైన్మెంట్ల ద్వారా అక్రమరవాణా చేసారు. జాఫర్
సాదిక్ ఒక సినీ నిర్మాత మాత్రమే కాదు, ఒక ఫార్మాకంపెనీ యజమాని, ఎగుమతిదారుడు కూడా.
తాజాగా పట్టుబడిన డ్రగ్స్‌ను భారతదేశం నుంచి ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌కు
తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు.
అరెస్టు భయంతో సాదిక్ అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయాడు.
అతను విదేశాలకు పారిపోకుండా నిలువరించడానికి ఎన్సీబీ లుక్ఔట్ నోటీసు జారీ
చేసింది. ఇక డీఎంకే నేతలు సాదిక్‌తో తమ సన్నిహిత సంబంధాలు తెంచుకోడానికి సుముఖంగా లేరు.