PM Modi captures the beauty of Kaziranga in camera
అస్సాంలోని కజీరంగా
జాతీయ ఉద్యానవనం అందాలు చూడవలసినవే తప్ప మాటల్లో వర్ణించగలిగినవి కావు. రెండు రోజుల
పర్యటన కోసం అస్సాం వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ అద్భుతమైన వనప్రదేశంలో మొదటిసారి
విహరించారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించిన కజీరంగా ప్రకృతి అందాలను
తన కెమెరాలో బంధించారు.
ప్రధాని నరేంద్రమోదీ ఈ
ఉదయం కజీరంగా పార్క్‌లో ఏనుగుపై విహరించారు. పార్క్‌లోని సెంట్రల్ కొహొరా రేంజ్‌లోని
మిహిముఖ్ ప్రాంతంలో ఏనుగునెక్కి విహారయాత్ర చేసారు. తర్వాత ఆ అటవీప్రాంతంలో జీప్ సఫారీ
చేసారు. జీవవైవిధ్యానికి పెట్టింది పేరైన కజీరంగా పార్క్ అందచందాలను తన మూడోకంటిలో
బంధించారు. అద్భుతమైన అటవీమైదానాలను, ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన ఒంటికొమ్ము
ఖడ్గమృగాలనూ చూసారు. ఇంక కజీరంగాలో పెద్దసంఖ్యలో ఏనుగులు కూడా ఉన్నాయి. వాటిలో
లఖీమాయీ, ప్రద్యుమ్న, ఫూల్‌మాయీ అనే మూడింటికి చెరకు తినిపించారు.
ఆ తర్వాత ప్రధాని
మోదీ కజీరంగా ఫారెస్ట్ గార్డుల్లో మహిళల బృందమైన ‘వనదుర్గ’ గార్డులను పలకరించారు.
వనదుర్గ గార్డుల బృందం ఆ ప్రాంతంలోని అడవులను, వన్యప్రాణులను రక్షించడం వారి
బాధ్యత. సాధారణంగా పురుషులు చేపట్టే ఆ పనిని మహిళలు స్వీకరించినందుకు ప్రధాని
వారిన అభినందించారు.
కజీరంగా సందర్శన
పూర్తయిన తర్వాత ప్రధాని తాను తీసిన ఫొటోలను సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా షేర్
చేసారు. కజీరంగా నేషనల్ పార్కును సందర్శించి, అక్కడి అసమాన ప్రకృతి సౌందర్యాన్ని
ఆస్వాదించమంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.