Researcher of Microwaves, Rajeswari Chatterjee
మహిళా దినోత్సవ ప్రత్యేకం : రాజేశ్వరీ ఛటర్జీ (1922-2010)
రాజేశ్వరీ ఛటర్జీ ఒక గణిత శాస్త్రవేత్త,
ఎలక్ట్రిక్ ఇంజనీర్. విద్యుదయస్కాంత సిద్ధాంతం, మైక్రోవేవ్ టెక్నాలజీ, రేడియో
ఇంజనీరింగ్ రంగాల్లో స్పెషలైజేషన్ చేసింది. రాజేశ్వరి కర్ణాటక నుంచి మొట్టమొదటి
మహిళా ఇంజనీర్. ఆమె రెండో ప్రపంచయుద్ధం తర్వాత అమెరికాలో పీహెచ్‌డీ చేసింది.
విమానాలు, వ్యోమనౌకల్లో ప్రత్యేక అవసరాలకు ఉపయోగించే యాంటెన్నాల తయారీలో ఆమె సేవలు
గణనీయమైనవి. భారత్ తిరిగి వచ్చాక రాజేశ్వరి బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్
ఆఫ్ సైన్సెస్‌లో ఫ్యాకల్టీగా పనిచేసింది. అక్కడ రిటైరయ్యాక ఇండదియన్ అసోసియేషన్
ఫర్ విమెన్స్ స్టడీస్‌లో పనిచేసింది.
రాజేశ్వరి తన స్కూలింగ్ పూర్తయ్యాక బెంగళూరులోని
సెంట్రల్ కాలేజీ నుంచి గణితశాస్త్రంలో బీఎస్సీ ఆనర్స్, ఎమ్మెస్సీ పూర్తిచేసింది.
1946లో ఢిల్లీ ప్రభుత్వం ఆమెను ‘బ్రైట్ స్టూడెంట్’గా గుర్తించి, విదేశాల్లో ఉన్నత
విద్యాభ్యాసానికి ఉపకారవేతనం మంజూరు చేసింది. అప్పుడామె అమెరికాలోని యూనివర్సిటీ
ఆఫ్ మిషిగన్‌లో చేరింది. అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసింది.
1953లో పీహెచ్‌డీ పూర్తి చేసింది. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చేసింది.
ఐఐఎస్సీలో ఈసీఈ డిపార్ట్‌మెంట్‌లో అధ్యాపకురాలిగా చేరింది. ఆ యేడాదే అక్కడే తన
సహోద్యోగి అయిన శిశిర్ కుమార్ ఛటర్జీని పెళ్ళిచేసుకుంది. వాళ్ళిద్దరూ కలిసి ఒక
మైక్రోవేవ్ రిసెర్చ్ ల్యాబొరేటరీని నిర్మించి, మైక్రోవేవ్ ఇంజనీరింగ్‌లో పరిశోధనలు
ప్రారంభిచారు. ఆ రంగంలో భారతదేశంలో అదే మొదటి పరిశోధన.
ఆ సమయంలోనే రాజేశ్వరి ఈసీఈ డిపార్ట్‌మెంట్‌కి
చైర్మన్ పదవికి ఎంపికైంది. ఆవిడ తన జీవితకాలంలో 20మంది విద్యార్ధుల పరిశోధనలకు
మెంటార్‌గా ఉంది. ఆమె స్వయంగా వందకు పైగా పరిశోధనా పత్రాలు దాఖలు చేసింది, ఏడు
రచనలు చేసింది. 1982లో ఐఐఎస్‌సీ నుంచి రిటైర్ అయాక, ఆమె సామాజిక కార్యక్రమాల్లో
చురుగ్గా పాల్గొనేది. ఇండియన్ అసోసియేషన్ ఫర్ వుమెన్స్ స్టడీస్ కార్యక్రమాలను
నిర్వహించేది.