Guruji
enlightened not only RSS but the world too
(ఇవాళ గురూజీ మాధవరావ్
సదాశివరావ్ గోళ్వాల్కర్ జయంతి)
రాష్ట్రీయ స్వయంసేవక్
సంఘ్ – ఆర్ఎస్ఎస్కు, వ్యవస్థాపకులు డాక్టర్జీ రూపురేఖలను సమకూర్చారు, తాను
చేపట్టిన సత్కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు ఎంతోమంది నాయకులకు సాయపడ్డారు. సంఘం
ప్రాధాన్యతను మరింత విస్పష్టంగా వివరించినవారు గురూజీ. విస్తృత అధ్యయనం, నిశిత
ఆలోచన, ఆధ్యాత్మిక సాధన, మాతృభూమి పట్ల నిస్వార్థ భక్తి, ప్రజల పట్ల అవధుల్లేని
ప్రేమ వంటి విశిష్ట లక్షణాలతో గురూజీ సంఘాన్ని దేశవ్యాప్తంగా బలోపేతం చేయడం
మాత్రమే కాదు, దేశానికి ప్రతీరంగంలోనూ అవసరమైన పరిపక్వమైన మేధో మార్గదర్శనం
చేసారు.
గురూజీ అని అందరూ ప్రేమగా పిలుచుకునే గోళ్వాల్కర్జీ, సంఘం సైద్ధాంతిక
విధానమైన ‘హిందుత్వ’కు రూపకల్పన చేసి, దాన్ని విశ్వవ్యాప్తం చేసారు. ‘హిందుత్వ’
అనేది హిందువుల సాంస్కృతిక, జాతీయ అస్తిత్వాన్ని ప్రచారం చేస్తుంది. సామాజిక
రాజకీయ వాతావరణంలో హిందువుల ప్రయోజనాల గురించి ప్రస్తావించి వాటి సాధనకు
పాటుపడుతుంది. హిందుత్వ తాత్వికతను నిర్వచించి వ్యాప్తి చేయడంలో గురూజీ రచనలు,
ప్రసంగాలు ఎంతగానో సాయపడ్డాయి.
గురూజీ హిందూ సమాజంలో సాంస్కృతిక సామాజిక సంస్కరణల కోసం పాటుపడ్డారు.
కులవివక్ష నిర్మూలన, హిందువుల ఐక్యత, హిందూ విలువలు సంప్రదాయాల పరిరక్షణ కోసం ఆయన
కృషి చేసారు. అందరికీ విద్య, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి వంటి సామాజిక
విషయాలపైనా ఆయన పరిశ్రమించారు. ఆయన స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వంతో సంఘానికి అనుబంధంగా
ఒక్కొక్కటిగా పలు సంఘాలు ఏర్పడ్డాయి. అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్, భారతీయ మజ్దూర్
సంఘ్, విశ్వహిందూ పరిషత్, భారతీయ వనవాసీ కళ్యాణ ఆశ్రమ్ వంటి సంస్థలు ఒకదాని తర్వాత
ఒకటి మొలకెత్తాయి. సంఘం సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రవర్తించే నిర్వహణా నైపుణ్యాలు కలిగిన
స్వచ్ఛంద కార్యకర్తలు పెరుగుతున్న కొద్దీ, వారివారి రంగాలకు అనుగుణంగా ఆయా సంస్థలు
ఏర్పడ్డాయి. వారందరికీ ప్రేరణ కలిగించినది, మార్గదర్శకత్వం చేసినదీ గురూజీయే.
గోళ్వాల్కర్జీ ఎప్పుడూ దేశమంతా తిరుగుతూ సంఘాన్ని బలోపేతం చేసే కార్యంలోనే
ఎల్లవేళలా నిమగ్నమై ఉండేవారు. ఒకచోటినుంచి మరొకచోటికి వెడుతూ ఒకరి తర్వాత ఒకరిని
కలుస్తూ ఆయన దేశవ్యాప్తంగా సంఘాన్ని పెంచి పోషించారు. దేశమంతటా మేధోజీవులతో పాటు
సామాన్య పౌరులతో కూడా ఆయన ఆత్మీయ సంబంధాలు కలిగి ఉండేవారు. దానివల్ల జాతి
ఆలోచనాధోరణి ఎలా ఉండేదన్న విషయం ఆయనకు ఎప్పుడూ చేతివేళ్ళ మీద ఉండేది. దానివల్ల ఆయన
భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఎలా ఉండబోతాయో అర్ధం చేసుకుని, ఆ మేరకు సమాజాన్నీ,
పాలకులనూ అప్రమత్తం చేస్తుండేవారు, లేదా హెచ్చరిస్తుండేవారు. 1950ల తొలినాళ్ళలో
ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గురించి ఒక త్రిసభ్య కమిషన్ను నియమించింది.
ఆ సమయంలో దేశమంతటా ఏకకేంద్రక ప్రభుత్వాలే ఉండాలి అని వాదించిన ఒకే ఒక స్వరం
గురూజీది. అప్పటికింకా తప్పటడుగుల దశలోనే ఉన్న భారత రిపబ్లిక్ బలపడాలంటే ఏకకేంద్రక
ప్రభుత్వాలు మాత్రమే మార్గమని ఆయన వివరించారు. చాలా సంవత్సరాల తర్వాత, భాషా
ప్రయుక్త రాష్ట్రాల పేరిట చేసిన ప్రయోగం విఫలమైందని ప్రభుత్వానికి జ్ఞానోదయమైంది.
దాదాపు ఆ సమయంలోనే ఈశాన్య రాష్ట్రాల్లో సంక్షోభం మొదలయ్యే దశలో ఉంది.
అప్పుడే ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి క్రైస్తవ మిషనరీల దుర్మార్గ
చర్యల గురించి హెచ్చరించారు, వారితో కఠినంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఆయన
సూచనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దానికి దేశం ఇవాళ భారీ మూల్యమే
చెల్లిస్తోంది. 50వ దశకం నడినాళ్ళలో మన నాయకులు ఎంతో ఉద్వేగంతో హిందీ చీనీ భాయ్
భాయ్ అంటూంటే, గురూజీ ఒక్కరే బహిరంగంగా, నిజాయతీగా స్పందించారు. చైనా మెరమెచ్చు
మాటలను నమ్మకుండా మన సరిహద్దులను మనం కాపాడుకోవాలని గురూజీ స్పష్టంగా చెప్పారు.
ఏవైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు గురూజీ ఎన్నో కమిటీలను నిర్వహించారు.
విపత్తు సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ ప్రజలను ఉత్సాహపరిచేవారు. ఆయన వ్యక్తిగత
కోరికలు అనేవి లేకుండా జీవించారు. అందుకే గురూజీ మేధో మార్గదర్శనం ఎప్పుడూ
దూరదృష్టితో ఉంటూ జాతీయ జనజీవనం మీద శాశ్వతమూ, ప్రామాణికమూ అయిన ప్రభావం
కలిగించేది. ఆయన నుంచి దేశభక్తి, జీవితం పట్ల సానుకూల దృక్పథం అలవరచుకున్నవారు వేల
సంఖ్యలో ఉండేవారు. వారు నేటికీ దేశసేవలో నిమగ్నమై ఉన్నారు.
రాజకీయ సంస్థలు కానీ, మరే ఇతర సంస్థలు కానీ ఎందులోనైనా హిందువులు కలిసికట్టుగా
ఉండాలని గురూజీ కోరుకునేవారు. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకూ, ద్వారక నుంచి మణిపూర్
వరకూ దేశమంతా ఐకమత్యంగా ఉండాలన్నదే ఆయన ఉద్దేశం. అప్పుడే ఈ దేశంలో జీవించే ఎవరైనా
మాతృభక్తినీ, జాతీయ సమైక్యతనూ నేర్చుకుంటారు. వారి విశ్వాసాలను యథాతథంగా ఉంచుకుని
కూడా ఈ గొప్ప దేశానికి సేవ చేయాలన్నది గురూజీ ప్రబోధించిన మార్గం.
గురూజీ సందేశం – అధర్మాన్ని నాశనం చేసి ధర్మరాజ్యం ఏర్పాటుకూ, చెడు
శక్తులపై విజయం సాధించేందుకు బలం సమకూర్చుకోడానికీ – హిందువులను ప్రోత్సహిస్తుంది.
మంచి లేదా చెడు ఎలాంటి ప్రవర్తననైనా మనం నిర్ణయించుకోవలసింది ఆ గీటురాయి మీదే. ధార్మిక
శక్తులు విజయం సాధించడమే అంతిమలక్ష్యం కావాలి. విజయాలు సాధించిన గొప్పవారి ఉదాహరణలు మనకు
స్ఫూర్తి కలిగిస్తాయి. ధర్మస్థాపన మార్గంలో విజయం సాధించడమే అంతిమ లక్ష్యంగా సరైన
విచక్షణ కలిగి ఉండేలా మనను జాగృతం చేస్తాయి. అలా, ప్రపంచమంతటా ధర్మాన్ని
స్థాపించడమే మన జాతి చిరంతన లక్ష్యం.
భారతదేశపు జాతీయత, ఈ దేశపు విధి, ఆధునిక కాలంలో ఈ జాతి లక్షణాల
పునరుద్ధరణకు సరైన మార్గం గురించి గురూజీ చేసిన మౌలికమైన, నిర్మాణాత్మకమైన ఆలోచనలు
ఈ దేశపు గొప్ప మేధో వారసత్వంగా నిలిచాయి.
గురూజీ జీవితం విలక్షణంగా, ఒక యోగి జీవితంలా ఉండేది. ఆధ్యాత్మిక దృష్టికోణం
నుంచి చూస్తే ఆయన యోగే, కానీ భగవద్భక్తుడిగా ఈ సమాజంలో ఆయన సామాన్యుల్లో
సామాన్యుడిగా జీవించాడు, ఒక తల్లిలా వారిని ఆదరించాడు. అదే సమయంలో ఏకాంత జీవితం గడుపుతూ
భవబంధాల పట్ల ఉదాసీనంగా నిర్లిప్తంగా ఉండేవారు. అదేసమయంలో దేశానికి సంబంధించిన
విషయాల్లో పూర్తిగా తలమునకలైపోయి ఉండేవారు. మొత్తంగా ఆయన నడవడిక, వ్యక్తిత్వం
ఆదర్శప్రాయమైనవి.
ఇవాళ మనదేశంలో విచ్ఛిన్నకర శక్తులు విపరీతంగా పనిచేస్తున్నాయి. దేశంలో ఏ
సంక్షోభం తలెత్తినా దాన్నుంచి లాభం పొందడానికి విదేశాలు కాచుకుని కూర్చున్నాయి. చాలాయేళ్ళ
క్రితం అస్సాం భాషా ఉద్యమంలో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయి. ఇప్పుడు కూడా
దేశంలో రకరకాల మార్గాల్లో అస్థిరతను వ్యాపింపజేయడానికి విదేశీ శక్తులు
ప్రయత్నిస్తున్నాయి. మన దేశంలో తమ ఆధిక్యం కొనసాగాలంటే ఇక్కడ హిందువులను
విభజించాలి అన్న విషయాన్ని విదేశీ ప్రతీప శక్తులకు చాలా స్పష్టంగా తెలుసు. మన జాతిలో
ఐకమత్యాన్ని పాదుగొల్పడంలో, మన ప్రజల్లో దేశభక్తి అనే బలమైన భావనను
ప్రతిష్టించడంలో మనం అంత సమర్థంగా ప్రభావం చూపలేకపోయామన్న విషయాన్ని మనందరం ఒప్పుకోవలసిందే.
అందువల్ల మనం మన బాధ్యతల విషయంలో మరింత అవగాహన కలిగి ఉండాలి. మన
శక్తియుక్తులన్నింటినీ సమర్థంగా వినియోగించుకుంటూ మన లక్ష్యాన్ని సాధించడానికి కృషి
చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అంతిమ లక్ష్యాన్ని సాధించాలి. ఇదే గురూజీ గోళ్వాల్కర్
హిందువులకు ఇచ్చిన ఆఖరి సందేశం.