Swami Dayanand Saraswati transformed Hindu Society
(నేడు స్వామి దయానంద సరస్వతి జయంతి)
యుగద్రష్ట, యుగ ప్రవర్తకుడు, ఆర్యసమాజ
వ్యవస్థాపకుడు అయిన స్వామి దయానంద సరస్వతి హిందూ సమాజాన్ని ఒక కొత్త ధోరణిలోకి
రూపుదిద్దాడు. భారతదేశం మన సొంత దేశమనీ, విదేశాల్లో పుట్టిన ఎవరికీ ఇఖ్కడి
వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం ఏనాటికీ లేదనే దృష్టిని కలిగించాడు. అంటరానితనం
మన వేదాల్లో లేదు అని ఆయన నమ్మాడు, అదే విషయాన్ని నిరూపించాడు. అంటరానితనానికి
వ్యతిరేకంగా ఆయన గొప్ప ఉద్యమాన్నే చేపట్టాడు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలోనూ, ఆ
తర్వాత కూడా గాంధీ, కాంగ్రెస్ స్వామి అడుగుజాడలను అనుసరించారు.
దయానంద సరస్వతి కాలానికి బాల్య వివాహాలు
సర్వసాధారణం. ఆ పద్ధతిని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు, హిందూ సమాజానికి శాపం లాంటి
ఆ పద్ధతిని నిర్మూలించాలని ఆయన తీవ్రంగా కృషి చేసాడు. ఆ ప్రయత్న ఫలితంగానే
స్వతంత్ర భారతదేశంలో బాల్యవివాహాలపై నిషేధాన్ని విధించారు.
స్వామి దయానంద సరస్వతి బహుళ వివాహాల పద్ధతిని కూడా
వ్యతిరేకించాడు. ఒక వ్యక్తి, ఒకే మహిళ కంటె ఎక్కువ మందిని పెళ్ళి చేసుకోవడం సరికాదంటై
ఉద్యమం నడిపాడు. ఆ దురాచార నిర్మూలనకు ఆర్యసమాజం ఎంతగానో కృషి చేసింది. ఆర్యసమాజ ప్రచారకులు
దేశంలోని మారుమూల గ్రామాలకు, పట్టణాలకూ వెళ్ళి, బహుభార్యాత్వం అనే దురాచారానికి
వ్యతిరేకంగా ప్రచారం చేసారు. దాని ఫలితమే హిందూ కోడ్ బిల్లులో ఆ దురాచారాన్ని
చట్టబద్ధంగా తొలగించారు.
ఆర్యసమాజం హిందూసమాజంలోని ఛాందసులపై విజయవంతంగా పోరాడింది.
ఒక విగ్రహాన్ని భగవంతుడిగా పూజించాలి అనడానికి వేదాల్లో ఎలాంటి ఉదాహరణా లేదని
నిరూపించింది. దైవం సర్వశక్తివంతం, సర్వాంతర్యామి, నిరాకారం అన్నది ఆర్యసమాజం
వాదన. సర్వాంతర్యామి అయిన దైవాన్ని గుడిలో అయినా సరే, నాలుగు గోడల మధ్య, తాళం వేసి
బంధించడం సాధ్యం కాదు అని ఆర్యసమాజం బోధిస్తుంది. హిందూ సమాజం వేదాలను వాటి
వాస్తవిక అర్ధంలో అనుసరించాలి అని దయానంద సరస్వతి ఛాందస హిందూ సమాజానికి
బోధించాడు, వారిని వేడుకున్నాడు.
దయానంద సరస్వతి జర్మనీ నుంచి వేదాల అసలు ప్రతులను
తెప్పించి, వాటిని సరళమైన సంస్కృత, హిందీ భాషల్లోకి అనువదించాడు. ‘ఋగ్వేద భాష్యము,
షోడశ సంస్కారాలు’ ఆయన రచనల్లో ప్రముఖమైనది.
స్వామి దయానంద సరస్వతి ఒకే విషయాన్ని విస్తృతంగా ప్రచారం
చేసాడు. పుట్టుకతో మనుషులంతా సమానమే. పుట్టుకతోనే ఎవరూ బ్రాహ్మణులో, క్షత్రియులో, వైశ్యులో
లేక శూద్రులో కారు. ఆ విభజనలన్నీ వ్యక్తులు ఎంచుకునే వృత్తిని బట్టి వచ్చాయి.
అవన్నీ పరస్పర పూరకాలు తప్ప ఏదీ మరోదానికంటె గొప్పదీ కాదు, తక్కువదీ కాదు.
దయానంద సరస్వతి హిందూ సమాజంలో ఒక చైతన్యం
కలిగించాడు. ‘‘భారతదేశ దాస్యవిమోచనం కోసం పాశ్చాత్య ప్రపంచం చేసింది ఏమీ లేదు.
నిజానికి పాశ్చాత్య ప్రపంచమే భారతదేశానికి ఎంతో రుణపడి ఉంది. ‘సున్నా ఆవిష్కరణ’ సహా
ప్రతీ పురోగతినీ భారతదేశం నుంచి అన్యాయంగా లాక్కుని తమ ఖాతాలో వేసేసుకున్నారు’’ అనే
చైతన్యం హిందువుల్లో కలిగేలా చేసాడాయన. స్వామి దయానంద సరస్వతి, భారతదేశానికి ఒక జాతీయ
మతం ఉండాలని ప్రగాఢంగా భావించాడు. ఆ మతం సత్యం, నిస్వార్థం, నిర్భయత్వం,
జాతీయతాభావన, సమర్పణాభావం ఆధారంగా ఉండాలని కోరుకున్నాడు. ఆ విలువలనే ఆయన
భారతదేశంలోని హిందువులందరికీ ప్రచారం చేసాడు. సమానత్వం ఆధారంగా స్వేచ్ఛ, స్వయం
పరిపాలన ఉండాలని ఆయన విస్తృతంగా ప్రచారం చేసాడు. వాటి వివరాలు ఆయన రాసిన సత్యార్థ
ప్రకాశ అనే గ్రంథంలో సవిస్తరంగా ఉన్నాయి.
మహిళల సంక్షేమం కోసం దయానంద సరస్వతి హిందువుల్లో
విధవా పునర్వివాహాల పద్ధతిని తీసుకొచ్చాడు. అమానుషమైన సతీ సహగమనం అనే దురాచారాన్ని
ఆపివేసాడు. దయానంద సరస్వతి తన జీవితాంతం హిందూ సమాజంలోని మూఢవిశ్వాసాలకు
వ్యతిరేకంగా పోరాడాడు, వాటి దుష్ఫలితాల గురించి హిందూ సమాజంలో చైతన్యం కలుగజేసాడు.
హిందూ సమాజానికి స్వామి దయానంద సరస్వతి అప్పటికీ,
ఇప్పటికీ, ఎప్పటికీ చేసిన గొప్ప సేవ ‘శుద్ధి ప్రచారం’. హిందువుల ఛాందస, మూఢ
విశ్వాసాల కారణంగా మన ధర్మాన్ని వదిలిపెట్టి వేరే మతాల్లోకి మారిపోయిన మన సోదరులను
మళ్ళీ మన మార్గంలోకి తీసుకురావడమే శుద్ధి ప్రచారం. ఈరోజుల్లో ఘర్‌వాపసీ లాంటిదన్నమాట.
హిందూ సమాజాన్నిపటిష్టం చేయడంలో స్వామి దయానంద
కీలక పాత్ర పోషించాడు. విద్యావ్యవస్థను వ్యవస్థీకృతం చేసినప్పుడే భారతదేశం
ఉత్కృష్ట స్థాయికి చేరుకోగలదని ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. దేశం
పురోభివృద్ధి చెందాలంటే కులం, లింగం వంటి తేడాలు లేకుండా అందరికీ విద్య అందాలని
నినదించాడు. దేశమంతటా మహిళలకు విద్య అందించే సంస్థలను ప్రారంభించడంలో ఆయన కృషి
ప్రశంసనీయమైనది. కులమతజాతిలింగ భేదాలు లేకుండా అందరికీ విద్య అందించడానికి ఆయన
చేసిన సేవ అనన్యసామాన్యమైనది.
అనాథ శరణాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని స్పష్టం
చేస్తూనే అనాథలు ఇతర మతాల్లోకి మారకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆర్యసమాజం మొదటి
అనాథశరణాలయాన్ని ఫిరోజ్పూర్లో ప్రారంభించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా
మొదలుపెట్టింది. తద్వారా అనాథలు ఇస్లాం లేదా క్రైస్తవం వంటి ఇతర మతాల్లోకి
మారకుండా నిలువరించింది.
విధవలకు ఆశ్రయం కల్పించడానికి ఆర్యసమాజం
ఆశ్రమాలను ప్రారంభించింది. భర్తను కోల్పోయిన స్త్రీలతో పాటు ఒంటరి మహిళలకు ఆశ్రయం
కల్పించి, వారికి ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ కల్పించింది. అలాగే వారికి సరైన
భాగస్వాములతో వివాహాలూ చేయించింది.
సంఘసంస్కర్తగా స్వామి దయానంద నిరంతరాయంగా
విశ్రాంతి లేకుండా కృషి చేసాడు. ఆయన మహిళలు పురుషులూ సమాన స్థాయిలో ఉండాలని కోరుకున్నాడు.
హిందూ సమాజంలో ఉన్న పరదా పద్ధతిని తొలగించడానికి ఆయన ఎంతో కృషి చేసి విజయం
సాధించాడు.
దయానంద సాధించిన మరో ప్రధానమైన విజయం ఏంటంటే…
వేదాలు ఉపనిషత్తుల అధ్యయనం కేవలం బ్రాహ్మణులకే పరిమితం కాదని ప్రచారం చేసాడు,
ప్రాచీన భారతీయ గ్రంథాలు హిందువుల్లోని అన్ని కులాల వారికీ, స్త్రీపురుషులకు
అందరికీ సమానంగా అందేలా చేసాడు.
పూర్వకాలంలో హిందువులు సముద్రప్రయాణం చేస్తే
ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉండేది. అది ఛాందస హిందూ సమాజపు మూఢనమ్మకం మాత్రమేనంటూ
ఆ పద్ధతిని తొలగించినవాడు దయానంద సరస్వతి స్వామే.
హిందూ సమాజానికి మొట్టమొదటిసారి సుపరిపాలనకు,
స్వతంత్ర పరిపాలనకూ తేడాను అవగతం చేసింది స్వామి దయానంద సరస్వతే. స్వయంపరిపాలన కావాలని
పట్టుపట్టాలంటూ, బ్రిటిష్ వారికి బానిసలుగా ఉండవలసిన అవసరం లేదంటూ భారతప్రజలను
ప్రోత్సహించింది ఆయనే. భారతవర్షం భారతవాసులది మాత్రమేనంటూ భారతీయులకు స్వయంపరిపాలన
ఉండాలంటూ ప్రకటించిన మొట్టమొదటి భారతీయుడు స్వామి దయానందే.
దయానంద, ఆయన స్థాపించిన ఆర్యసమాజం స్వదేశీ అన్నే
విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాయి. హిందువులు స్వదేశీ ఉత్పత్తులనే వాడాలి అని
పిలుపునిచ్చింది స్వామియే.
మన స్వాతంత్ర్య సంగ్రామంలో హిందీ ప్రధాన పాత్ర
వహించడానికి కారణం స్వామి దయానంద సరస్వతి ప్రయత్నాలే. నేటికి కూడా దేశమంతా హిందీని
జాతీయభాషగా గుర్తించాలన్న ప్రచారం జరుగుతోందంటే ఆ ఘనత దయానంద సరస్వతిదీ,
ఆర్యసమాజానిదే.
దయానంద సరస్వతి ఈ దేశానికి గొప్పగొప్ప
ఆలోచనాపరులను, మేధావులను, విప్లవవీరులను, జాతీయ నాయకులనూ అందించారు. లాలా లజపత్
రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్, భాయి పరమానంద్, శ్యాంజీ
కృష్ణవర్మ, రాంప్రసాద్ బిస్మిల్, భాయి బాల్ ముకుంద్, మదన్‌లాల్ ధింగ్రా, మదన్మోహన్
మాలవీయ, స్వామి శ్రద్ధానంద, పండిత్ లేఖ్రాం వంటి మేధావులు ఆయన శిష్యులే.
స్వాతంత్ర్య సాధనలో వారి పోరాటం చిరస్మరణీయం.
ప్రాచీన భారతీయ సంప్రదాయిక విధానాల ప్రకారం
పురుషులతో సమానంగా హిందూ మహిళలను పరిగణించేలా దేశ వ్యవస్థ రూపుదిద్దుకోడంలో స్వామి
దయానంద సరస్వతి భూమిక ఎంతో ప్రధానమైనది. ఆయన గొప్ప సంఘ సంస్కర్త. దేశ ప్రజలందరికీ
సమానంగా హక్కులు అందడం వెనుక ప్రబలమైన శక్తి ఆయనే. చదువుకునే హక్కు, వేదాలు
ఉపనిషత్తులను అధ్యయనం చేసే హక్కు, వరకట్న దురాచారాన్ని నిర్మూలించిన కృషి, జీవిత
భాగస్వామిని ఎంచుకునే అవకాశం స్త్రీపురుషులందరికీ సమానంగా ఉండే హక్కు… ఇవన్నీ
దయానంద సరస్వతి కృషి వల్లనే సాధ్యమయ్యాయి.